తెలంగాణ అప్పు.. రూ. 61,710 కోట్లు
- ఉమ్మడి ఏపీ అప్పును పంపిణీ చేసిన కేంద్రం
- ఆంధ్రప్రదేశ్ అప్పువాటా రూ. 86.34 వేల కోట్లు
- నోటిఫికేషన్ జారీచేసిన కేంద్ర ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పులను కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఈ మేరకు వారం కిందటే నోటిఫై చేసింది. వివాదాలు లేని అప్పులను విభజించి ఎవరి వాటా ఎంత అని తేల్చింది. సెక్యూరిటీల విక్రయం, నాబార్డు, చిన్నమొత్తాల పొదుపు సంస్థ నుంచి చేసిన అప్పులను జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఏపీలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పంపిణీ చేసింది. ఉమ్మడి ఏపీకి మొత్తంగా 1.48 లక్షల కోట్ల అప్పు ఉండగా, అందులో తెలంగాణకు రూ. 61.71 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.86.34 వేల కోట్లు అప్పుగా తేల్చా రు.
విదేశీ ఆర్థిక సంస్థలు, కేంద్రం మంజూరు చేసిన 18.43 వేల కోట్ల రూపాయల అప్పులో రెండు రాష్ట్రాల వాటా తేల్చాల్సి ఉంది. ఈ అప్పుల్లో నిర్దిష్టంగా ఒక ప్రాంతానికి లేదా ఒక జిల్లాకు సంబంధించి ప్రాజెక్టు కోసం వ్యయం చేస్తే... ఆ అప్పు ఆ ప్రాంతాలు, జిల్లాలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే వెళ్తుంది. జిల్లాల్లో వెచ్చించిన వ్యయం ఆధారంగా ఆ అప్పులను పంపిణీ చేయాలంటే అందుకు తగిన లెక్కలు ఉన్నాయా లేదా అనేది అకౌంటెంట్ జనరల్ పరిశీలించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి వివిధ పథకాల కింద మంజూరు చేసిన రుణాన్ని రాష్ట్రం అంతటికీ వినియోగించారు.
ఈ రుణాలను రెండింటికి పంపిణీ చేయడానికి ఏ విధానం అవలంభిం చాలనేది వాస్తవికత ఆధారంగా అకౌంటెంట్ జనరల్ నిర్ధారించాల్సి ఉంది. కేసీ కెనాల్ ఆధునీకరణకు విదేశీ సంస్థ నుంచి చేసిన అప్పులు ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయని, అలాగే హుస్సేన్‌సాగర్ నీటిశుద్ధి, ఔటర్ రింగ్ రోడ్డు కోసం చేసిన అప్పులు తెలంగాణ ప్రభుత్వానికి చెందుతాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ర్టం విడిపోవడానికి ముందు అంటే గతేడాది మే 31వ తేదీ నాటికి ఉమ్మడి రాష్ట్రానికి అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం రూ.1.66 లక్షల కోట్లు. ఇందులో వివాదం లేని అప్పును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విధంగా పంపిణీ చేసింది.
వివాదం లేని ఉమ్మడి రాష్ట్ర అప్పు రూ.1.48 లక్షల కోట్లు మార్కెట్‌లో సెక్యురిటీల విక్రయం ద్వారా చేసిన అప్పు రూ.1.17 లక్షల కోట్లు నాబార్డు, చిన్న మొత్తాల సంస్థ, ఇతర సంస్థల నుంచి అప్పు రూ.31 వేల కోట్లు.