భువనేశ్వర్: ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) రూ.61,000 కోట్ల పెట్టుబడులతో ఒడిశాలోని పరదీప్‌లో నాఫ్తా క్రాకర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబందించి ఐవోసీఎల్, ఒడిశా (Odisha) ప్రభుత్వం మధ్య జనవరిలో జరిగే ‘ఉత్కర్ష్ ఒడిశా–మేక్ ఇన్ ఒడిశా 2025’ సదస్సు సందర్భంగా అవగాహన ఒప్పందం కుదరనుంది.
ఈ మేరకు ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. భద్రక్‌లో రూ.4,352 కోట్లతో ఏర్పాటు చేయనున్న యార్న్ ప్రాజెక్ట్‌కు సైతం ఇదే వేదికగా శంకుస్థాపన చేయనున్నట్టు పేర్కొంది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఐవోసీఎల్ చైర్మన్ ఏఎస్ సాహ్నే మధ్య భువనేశ్వర్‌లో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపింది.
‘‘పరదీప్‌లో నాఫ్తా ప్రాజెక్టుకు ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు కోసం ఐవోసీఎల్ రూ.61,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ రంగంలో దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికీ వాటా ఉంటుంది. పన్నులకు అదనంగా, డివిడెండ్ రూపంలో ఆదాయం లభిస్తుంది’’అని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. భద్రక్‌లో రూ.4,352 కోట్లతో ఏర్పాటు చేయనున్న యార్న్ ప్రాజెక్టుతో, పెద్ద ఎత్తున వస్త్రాల తయారీ కంపెనీలు ఇక్కడకు వస్తాయని తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులతో యువకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment