సంక్షేమానికి చిరునామా | Ysr welfare schemes to benefit for all people in ysr rule | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి చిరునామా

Published Fri, Jul 8 2016 12:58 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

సంక్షేమానికి చిరునామా - Sakshi

సంక్షేమానికి చిరునామా

ప్రజా సంక్షేమమే పరమ ధర్మంగా అహరహం శ్రమించిన వైఎస్ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా దేనికీ ఆయన తన పేరును, తన కుటుంబ సభ్యుల పేర్లను పెట్టుకోకపోవడమే ప్రజలపట్ల ఆయన అంకిత భావానికి నిదర్శనం.  స్వర్ణయుగం... అవును.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004- 2009 మధ్యన తెలుగు ప్రజలకే  కాదు, దేశానికే స్వర్ణయుగాన్ని కళ్లెదుట ఆవిష్కరించింది. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందడంతోపాటు అభి వృద్ధి పథంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. అంతకు ముందెన్నడూ లేని రీతిలో ఏ పథకమైనా పరిమితులు, కోటాలు లేకుండా సంతృప్తి  స్థాయిలో అమలు జరిగిందంటే అది వైఎస్ హయాంలోనే.
 
 ఆయన అధికారంలోకి రాక ముందు చంద్రబాబు నాయుడి పాలనలో రైతులు, బడుగు బలహీనవర్గాలే కాదు అన్ని వర్గాల ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. ఆ తరుణంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ వారి పాలిట నిజంగా దేవుడిగానే మారారు. ఇటు దుర్భిక్ష పరిస్థితులు, అటు ప్రభుత్వ నిరాదరణ, వేధింపులతో యమయాతనలు పడు తున్న రైతాంగానికి ప్రత్యేకించి వైఎస్ పాలన ఆశల వేకువే అయ్యింది.
 
 వ్యవసాయాన్ని పండగ చేసిన మహానేత
 అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేయడమే గాక ఆ క్షణం నుంచే అమల్లోకి తెచ్చి ఆయన చరిత్రను సృష్టించారు. అంతకు ముందు విద్యుత్తు లేక చేతికం దాల్సిన పంటలు ఎండిపోయో, కరవుకాటకాలతోనో రైతులు దివాలా తీయడం, విధిలేక ఆత్మహత్యలు చేసుకోవడమో నిత్యకృత్యమైనా నాటి ప్రభుత్వం కని కరించలేదు సరికదా... పంట రుణాల వసూళ్లు, విద్యుత్తు బకాయిల పేరిట రైతులను ఆరెస్టు చేయిం చడం, వారి ఆస్తులను జప్తు చేయించడం యథేచ్ఛగా సాగించింది వైఎస్ అధికారంలోకి రాగానే రైతుల విద్యుత్తు బకాయిలు రూ.1,300 కోట్లను ఒక్క సంత కంతో రద్దుచేయించారు.
 
 ఎన్‌టీఆర్ హయాంలో ఒక హెచ్‌పీ విద్యుత్తుకు రూ.50గా ఉన్న చార్జీలను రూ. 625 పెంచిన చంద్రబాబు  వైఎస్ ఉచిత విద్యుత్తును అపహాస్యం చేస్తూ కరెంటు తీగెలపై దుస్తులు ఆరేసు కోవాల్సిందేనని విమర్శించారు. వైఎస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని 30 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్తును అందించారు. వైఎస్ రెండున్నరేళ్లలోనే విద్యుత్తు కొనుగోళ్లకోసమే రూ. 6,500 కోట్లు వెచ్చించి రైతాంగానికి విద్యుత్తు సక్రమంగా అందేలా శ్రద్ధ వహించారు. ఆయన పాలనలో పరిశ్రమల విద్యుత్తు వినియోగం 40 శాతం పెరిగినా ఆ రంగం ఎలాంటి ఇబ్బందినీ ఎదుర్కొనలేదు.
 
 సాగునీటి ప్రాజక్టులకు ప్రాధాన్యం
 చంద్రబాబు తొలి తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర దుర్భిక్షం, కరవుకాటకాలతో అల్లాడింది. ఆయన ప్రాజెక్టుల నిర్మాణం ఊసే ఎత్తలేదు.  వైఎస్ 81 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టగా అందులో 12 పూర్త య్యాయి. మరో 13 పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టులపై చంద్రబాబు 9 ఏళ్లలో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్ ఐదేళ్లలో రూ. 32 వేలు కోట్లు ఖర్చు చేసి అదనంగా 19 లక్షల ఎకరాలకు నీరందించారు. చంద్రబాబు పాలనలో వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధికంగా కేటాయించినది రూ. 4,280 కోట్లు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క 2008-09 బడ్జెట్లోనే వ్యవసాయానికి రూ. 32,076 కోట్లు కేటాయించారు.
 
 చంద్రబాబు ప్రభుత్వం బకాయిలను కట్ట మంటూ రెతులను  పీడిస్తే, వైఎస్ రైతుల రుణమాఫీ పథకాన్ని ప్రకటించి 63 లక్షల మంది రైతులకు చెందిన రూ. 12వేల కోట్ల రుణాలను మాఫీ చేశారు. రుణమాఫీ పరిధిలోకి రాని  37 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున వారి బ్యాంకు అకౌంట్లలో మొత్తం రూ. 1,600 కోట్లు జమ చేయించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ  రైతు కుటుం బాలకు రూ. 9,650 కోట్లు అందించారు. ఇందిర ప్రభ పథకం కింద 6.4 లక్షల ఎకరాల భూమిని  నిరుపేద రైతులకు అందించారు. పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీని  ఎకరాకు రూ. 600 నుంచి రూ. 1,800 పెంచారు. వరి గిట్టుబాటు ధరను రూ. 190 నుంచి రూ. 350కి పెంచారు. పత్తి గిట్టుబాటు ధరను  రూ.575 నుంచి రూ. 1,075కి పెంచారు.
 
 అందరికీ ఆరోగ్యం, విద్య, ఇళ్లు
 వీరూ వారూ అని లేకుండా పేదలు, బలహీన వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందేలా వైఎస్ దేశంలోనే  వినూత్నమైన ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకం చేపట్టారు. పేదలకు రూ.2 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్  వైద్య సదుపాయాన్ని కల్పించి, 942 రోగాలకు దాన్ని వర్తింపచేశారు. దేశంలోనే మొదటిసారిగా 108, 104 సేవలకు వైఎస్ శ్రీకారం చుట్టారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే 108కు ఫోన్ చేస్తే చాలు నిము షాల్లోనే అంబులెన్సులు వచ్చే ఏర్పాటు చేశారు. ఇక 104 కింద మారుమూల ప్రాంతాల్లోని రోగులకు వైద్య సేవలందించేందుకు అన్నిరకాల మందులు, ఇతర పరికరాలతో డాక్టర్లు వెళ్లేవారు.
 స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం రాష్ట్రంలో 47 లక్షల ఇళ్లు కడితే, వైఎస్ హయాంలో నాలుగున్నరేళ్లలోనే 45 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించారు. గతంలో రేషన్‌కార్డులు కావాలంటే లబ్దిదా రులు ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. వైఎస్ హయాంలో 50 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా అర్హులైన వారం దరికీ కార్డులందేలా చర్యలు తీసుకున్నారు.
 
 ఒకప్పుడు పేద, బడుగు బలహీనవర్గాలకు కలగా ఉన్న ఇంజనీరింగ్, మెడిసిన్ సహాఉన్నత సాంకేతిక, వృత్తి విద్యాకోర్సులను 100 శాతం ఫీజు రీయంబర్స్‌మెంటుతో వైఎస్ పేదలు, బడుగు బలహీనవర్గాల వారికి అందుబాటులోకి తెచ్చారు.  జిల్లాకొక యూనివర్సిటీ చొప్పున 17 యూనివర్సి టీలు ఆయన హయాంలో ఏర్పడ్డాయి. హైదరా బాద్‌లో బిట్స్ పిలానీతోపాటూ, జాతీయ స్థాయి ఐఐటీ, ఐఐఐటీలకు దీటుగా గ్రామీణ ప్రాంత విద్యా ర్థులకోసం ట్రిపుల్ ఐటీలను ఇడుపులపాయ, నూజి వీడు, బాసరలో ఏర్పాటుచేశారు.  
 
 ఉద్యోగాల  కల్పనలో సరికొత్త రికార్డు
 వైఎస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలపై నిషేధం తొలగించి లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం కల్పిం చారు. నిర్దేశిత సమయంలో పీఆర్సీని అమలు చేయిం చారు. అయిదేళ్లలో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో 55 వేల ఉద్యోగాలు లభించాయి.  50 వేల మంది టీచర్లు నియమితులయ్యారు. 17 వేల మంది పోలీసుల నియామకం జరిగింది. ఐటీకి ఆద్యుడినని చెప్పుకొనే చంద్రబాబు హయాంలో ఐటీ ఉత్పత్తుల విలువ రూ.5 వేల కోట్లు. అలాంటిది 2008-09లో ఐటీ ఉత్పత్తులు రూ 26 వేల కోట్లకు పెరిగాయి.  పారి శ్రామిక వృద్ధిలోనూ రాష్ట్రం పరుగులు పెట్టింది. చంద్ర బాబు హయాంలో కేవలం హైదరాబాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాలకే పారిశ్రామిక వృద్ధిలోనూ పరి మితం కాగా వైఎస్ హయాంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్ కరీంనగర్ ఇలా అన్ని జిల్లాలకు ఇది విస్తరించింది.
 
 చంద్రబాబు హయాంలో ప్రజా ప్రతినిధులను డమ్మీలుగా మార్చి నోడల్ ఆఫీసర్లు, జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థల వ్యవస్థలు నిర్వీర్య మయ్యాయి. వైఎస్ అధికారంలోకి రాగానే నోడల్ ఆఫీసర్లను, జన్మభూమి కమిటీలను రద్దు చేశారు. నాలుగేళ్లలోనే రూ, 6,110 కోట్ల నిధులను స్థానిక సంస్థలకు అందించి, వాటిని బలోపేతం చేశారు.
 
 వృద్ధులకు ఆసరా
 సంక్షేమ కార్యక్రమాలకు చంద్రబాబు తన గత తొమ్మి దేళ్ల పాలనలో రూ. 10వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ హయాంలో ఒక్క 2008-09 బడ్జెట్లోనే రూ. 30వేల కోట్లు కేటాయించారు. బీసీలకు అండగా ఉన్న వైఎస్ బీసీ బడ్జెట్‌ను రూ. 363 కోట్ల నుంచి 1,600 కోట్లకు పెంచారు. మైనారిటీల బడ్జెట్‌ను రూ 30 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు పెంచారు.  తీవ్ర నిర్లక్ష్యానికి గురైన 3 లక్షల చేనేత కార్మికుల కుటుంబాల రూ. 327 కోట్ల రుణ బకాయిలను వైఎస్ రద్దు చేయించారు. అభయ హస్తం పథకం కింద 60 ఏళ్లు దాటిన వృద్ధుల పెన్షన్‌ను రూ.500 నుంచి రూ.2,200కు పెంచేలా ఐకేపీ లైఫ్ ఇన్సూరెన్సు పథకం ప్రారంభించారు. తనకు ముందు ఐదేళ్లలో డ్వాక్రా మహిళలకు అందిన రుణాలు రూ.1,660 కోట్లు కాగా వైఎస్ హయాంలో రూ.16,535 కోట్లకు పెంచారు. ప్రజా సంక్షేమమే పరమ ధర్మంగా అహరహం శ్రమించిన వైఎస్ ఎన్ని ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా దేనికీ ఆయన తన పేరును, తన కుటుం బసభ్యుల పేర్లను పెట్టుకోకపోవడమే ప్రజలపట్ల ఆయన అంకితభావానికి నిదర్శనం.
 - సీహెచ్ శ్రీనివాసరావు
 సాక్షి, ఏపీ బ్యూరో

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement