‘‘రాజు మరణించు నొకతార రాలిపోయే
కవియు మరణించు నొకతార గగనమెక్కె
రాజు జీవించు రాతి విగ్రహములందు
సుకవి జీవించు ప్రజల నాలుకల యందు’’
ఇక్కడ మహాకవి జాషువా పద్యపంక్తులు సందర్భోచితం. ఆయన సుకవిని కీర్తించినా రాజన్న విషయంలో సుపరిపాలకునికి అన్వ యించుకోవడం సముచితమే. తారగా రాలిపోయినా ధృవతారగా జనం గుండెల్లో వెలుగొందడం రాజన్నకే సాధ్య మయింది. అంతేకాదు.. సుపరిపాలకుడు ప్రజల నాలుకలపై జీవించే వుంటాడని రాజన్న శిలాశాసనం రాశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ప్రజల కోసం కలలు కన్నారో ఆ జనం గుండెల నిండా సుపరిపాలనా ప్రతిమగా నిలిచి నేడు పండువెన్నెల్లా ప్రకాశిస్తు న్నారు. అందరి నోటా రాజన్న తనయుడు జగనన్న నామస్మరణే నేడు మారుమోగుతోంది. నాటి అపరభగీరథుని శ్రమ నేడు ఆంధ్రప్రదేశ్ అంతటా హరితహారమై పరిమళిస్తోంది. రాజన్న కలల సాకారానికి జగనన్న పాలన నిండు నిదర్శనంగా నిలిచింది. (చదవండి: నాకు తెలిసిన మహనీయుడు)
ప్రజాహృదయాల్లో జీవించే వున్న రాజన్న స్మృతి చిరస్మరణీయం. దశాబ్దకాలం రైతుల్ని కాలదన్ని, వ్యవసాయాన్ని వ్యర్థమన్న కార్పొరేట్ పాలన కబంధహస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసిన విమోచకుడు వైఎస్సార్. 2004కి ముందు గడిచిన తొమ్మిదేళ్ళ పాలన రాజన్నకు ఎన్నో చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోనే భవిష్యత్’ అనే అబద్ధాన్ని నినాదంగా ప్రచారం చేసి మిగతా చదు వుల్ని, రంగాల్ని నిరుత్సాహానికి గురిచేసిన సందర్భాన్నీ ఆయన గుర్తుంచుకున్నారు. మిగతా చదువులు, రంగాల భవితవ్యాన్ని ఆలోచ నలో వుంచుకున్నారు. భారీగా విద్యుత్ చార్జీలు పెంచి వినియోగదా రుల్ని నడ్డివిరిచిన నిర్ణయాన్ని ఆయన పత్రికల సాక్షిగా దుయ్యబ ట్టారు. నిరసనగా రైలుపట్టాల మీద కొచ్చిన కాల్దరి రైతుల రక్తం కళ్ళ చూసిన ప్రభుత్వ హత్యల్ని నిలదీశారు. రాజధానిలోనే విద్యార్థుల మీద బుల్లెట్ల వర్షం కురిపించిన కర్కశంపై రాజన్న కదం తొక్కారు. (చదవండి: ఇక్కడెవరైనా అమృతం తాగి ఉన్నారా?)
ప్రతిపక్షనాయకునిగా ఆనాటి ప్రభుత్వ కఠిన నిర్ణయాల్ని కాలినడకన ప్రచారం చేసి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపిన మహాపాద యాత్రకుడా యన. రక్తం కార్చిన అరికాళ్ళ పాదముద్రల ప్రమాణంగా కోట్లాది మంది ప్రజానీకానికి బతుకు భరోసా కల్పించారు. కఠిన నిర్ణయాల మధ్య కాలం వెళ్లదీసిన ప్రజలు, సహకారం సన్నగిల్లి వ్యవసాయాన్ని పక్కనబెట్టిన రైతు, పనుల్లేక కునుకుతీసిన కూలీలు, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగులు రాజన్న వెంట నడి చారు. ఆయనకు ఊరూరా నీరాజనాలు అందించారు. జనం జనం కలిసి ప్రభంజనమై వైఎస్ రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. రైతులకు, పేదలకు ఉచిత విద్యుత్ దస్త్రం మీద తొలి సంతకాన్ని దస్తూరీగా చేసి మాటతప్పని మహానాయకునిగా అవతరించారు.
రాజన్నగా తన పేరును ప్రజల పిలుపుగా మార్చుకున్నారు. ప్రజల కలల సాకారానికి నిలువెత్తు సాక్షిగా నిలిచిన పాలకుడు రాజన్న. రాజకీయాల్లో యువతరం ప్రాధాన్యత పెంచడానికి ఒక చారిత్రక అవసరంగా రాజన్న రాజకీయ అరంగేట్రం జరిగింది. 1978లో పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పులిబిడ్డగా తొలిసా రిగా ఎన్నికైన తర్వాత ఆయన విజయపరంపర అంతిమక్షణం వరకు వెన్నుతట్టి విజయపథం వైపు నడిపించింది. శాసనసభలోనైనా, లోక్ సభలోనైనా తనదైన బాధ్యతాయుతమైన పాత్ర జనం మెచ్చిన నిజమై రగిలింది. అంతర్గత ఆధిపత్య పోరుల్లో కోల్పోయిన అవకాశాలు తనలో పట్టుదలను రేకెత్తించాయి. చెవులతో వినడమే తప్ప కళ్ళతో చూడటం తెలియని అధిష్టానం కళ్ళు తెరిపించిన ఘనత అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ వైఎస్‌దే. (చదవండి: అదే స్ఫూర్తి.. అదే లక్ష్యం.. అదే గమ్యం )
చివరిగా తనకు తాను కాలినడకన ప్రత్యక్షంగా ప్రజలందరినీ పలకరిస్తే తప్ప అధిష్టానం కళ్ళుతెరచి నిజాన్ని చూడలేకపోయింది. అనంతరం ముఖ్యమంత్రిగా అవతరించిన డాక్టర్ వైఎస్ సంక్షేమ సంతకంగా, మాటల మనిషిగా కాదు చేతల మనిషిగా ప్రజాజీవితాలతో మమేకమైపోయారు. వైఎస్సార్ రైతు సాగు నీటి కోసం, తాగు నీటి కోసం వెలిగొండ, గుండ్లకమ్మ, రామతీర్థ ప్రాజెక్టులై ప్రవహించారు. కోట్లాది రూపాయల రుణమాఫీతో నష్టాల్లో ఉన్న రైతులను వైఎస్సార్ ఆదుకున్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే అభివృద్ధి సాధ్యమని భావించిన రాజన్న అపర భగీరథునిగా అవతరించారు. నిలువనీడ లేనివారికి పక్కా ఇళ్లు, భూమి పంపిణీ చేశారు. వృద్ధాప్య పింఛన్లు రాష్ట్రంలో గొప్ప పేదరిక నిర్మూలన విప్లవం. తనను మహానేతను చేసిన ప్రజలకు తన పాలనను కళ్ళారా చూపించాలని ఆలోచన చేసిన రాజన్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కోట్లాదిమంది జనం ఆయుష్షు పెంచారు. అన్ని కులాల, మతాల, వర్గాల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్. ఉచిత విద్యుత్తుతో ప్రతి ఇంటా వెలుగులు విరజిమ్మిన విశాలహృదయుడు రాజన్న.
సంక్షేమంలో ‘చెరగనిముద్ర’గా, రాయితీల్లో ‘రైతు పక్షపాతి’గా, విద్యావిషయకమై ‘విశాలహృదయుని’గా, ప్రజారోగ్యంలో ‘ఆరోగ్య శ్రీమంతుని’గా అశేషప్రజానీకానికి విశేషసేవలందించిన ‘విశ్వన రుడు’ రాజన్న. ‘రచ్చబండ’ దగ్గరే రాజకీయం నిగ్గు తేల్చాలనుకు న్నారు. ఊరిజనాన్ని ఒక్కచోట, ఒకేతాటిపై నిలపాలనుకున్నారు. సమస్యలకు సత్వర పరిష్కారం ఇవ్వాలనుకున్నారు. సకలజన సౌభాగ్యాన్ని స్వాగతించాలనుకున్నారు. ప్రమాదవశాత్తూ స్వప్నకథగా మిగిలిన ఆయన జీవితం జనజీవన స్రవంతిలో సాక్షాత్కారమయింది. తండ్రి పోరాట జవసత్వాలతో రాజకీయంగా జనించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి స్వాభిమాన పోరాటాన్ని పతాకగా ఎగురవేశారు. అభిమానంతో ప్రజలే సహజ కవచకుండలాలుగా జగన్‌తో జతకట్టారు. రాజన్న సంక్షేమమే పరమావధిగా పాలన కొనసాగిస్తున్న వైఎస్ జగన్ ప్రజాభిమానం చూరగొన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అలుపెరగలేదు. తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి సైతం అంతే.. తండ్రి అడుగుల్లో అడుగులేసి సమస్త జనావళి ముఖారవిందాలను ప్రేమగా ముద్దాడే తీరునే సొంతం చేసుకున్నారు. తండ్రి జ్ఞాపకాల్నీ తనివితీరా ఆస్వాదించే పాలనే చేస్తున్నారు. జనం గుండెల్లో రాజన్న సంక్షేమాన్ని నిండా నింపుతున్నారు.
డా. జీకేడీ ప్రసాదరావు
-వ్యాసకర్త ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment