కొంతమంది జీవించి ఉన్నప్పటికన్నా, మరణించిన తర్వాత ప్రజలలో గొప్ప ఆదరణ పొందుతుంటారు. అలాంటివారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముందు వరసలో ఉంటారని చెప్పవచ్చు. రాజశేఖరరెడ్డి సీఎంగా పనిచేసింది ఐదేళ్ల మూడు నెలల కాలమే. కానీ ప్రజలపై తనదైన ముద్ర వేసుకోవడంలో ఆయన సఫలం అయ్యారు. ఆయన బాగా సక్సెస్ అయ్యారన్న విషయం చాలా మందికి ఆయన మరణం తర్వాత అర్థం అయింది. వైఎస్ ఆ హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూయకుండా ఉంటే, ఇప్పటికీ ఆయన విశిష్టమైన నేతగానే వెలుగొందేవారు.
చదవండి: Pawan Kalyan: ఉండాలంటాడా? పోవాలంటాడా?
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు ఇన్ని పరిణామాలు జరిగేవి కావేమో! రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికలలో 156 స్థానాలతోనే కాంగ్రెస్‌ను వరసగా రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చారు. కానీ అది ఆయనకు సంతృప్తి కలిగించలేదు. తనకు మొదటి టర్మ్ తర్వాత ప్రజలు పాస్ మార్కులే ఇచ్చారని వ్యాఖ్యానించారు. తద్వారా ఆయన ఎంత వాస్తవిక దృక్పథంలో ఉంటారో తెలియచెప్పారు. అసెంబ్లీతో పాటు లోక్ సభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌కు 33 సీట్లు వచ్చాయి. దాంతో వైఎస్ అంటే గిట్టని వారు అసలు కాంగ్రెస్ గెలుపు అంతా సోనియాగాంధీ వల్లేనని ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధిష్టానానికి కూడా అదే వాదనను వినిపించి పితూరీలు చెప్పేవారు. కానీ వైఎస్ కనుక ముఖ్యమంత్రిగా లేకుంటే ఉమ్మడి ఏపీలో అధికారం కోల్పోవడంతో పాటు, లోక్ సభ సీట్లు కూడా అన్ని వచ్చేవి కావన్న విషయం ఆయన మరణం తర్వాత అర్థం అయింది.
ఎందుకంటే వైఎస్ చిత్తూరు జిల్లాకు వెళుతుండగా, ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయిందన్న సమాచారం రాగానే కోట్లాది మంది ప్రజలు తల్లడిల్లారు. ఆయన లేరన్న విషయాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఆయన పార్ధివదేహాన్ని హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంకు తీసుకు వస్తే అప్పటికప్పుడు వేలాది మంది తరలివచ్చారు. అప్పుడు ఆయన ప్రత్యర్ధులు వైఎస్సార్‌కు అంత ఫాలోయింగ్ ఉందా అని అచ్చెరువొందారు. వారిలో తెలుగుదేశంకు చెందిన ప్రముఖ నేత ఒకరు కూడా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ భౌతిక కాయాన్ని పులివెందుల తరలించినప్పుడు ఆ జిల్లా అంతటా ప్రజలు కదలిన తీరు చెప్పనలవికాదు.
అంత్యక్రియల కార్యక్రమానికి హాజరవడానికి వెళ్లినవారు తమ వాహనాలలోనే కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోవలసి వచ్చింది. అంతగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదంతా చరిత్ర. ఇక్కడ మరో విశేషం కూడా చెప్పుకోవాలి. 1996 జనవరిలో ఎన్టీఆర్ తుదిశ్వాస విడిచినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని కూడా ఎల్‌బి స్టేడియంలో పెట్టగా, వేలాది మంది ప్రజలు స్వచ్చందంగా దర్శించి వెళ్లారు. ఆ తర్వాత వైఎస్సార్ భౌతిక కాయాన్ని చూడడానికి కూడా వేలాది మంది వచ్చిన తీరు అలాగే ఉంటుంది. వీరిద్దరి మధ్య కొన్ని పోలికలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ ప్రముఖ నటుడుగా రాజకీయాలలోకి వచ్చి మాస్ లీడర్ అయ్యారు. వైఎస్ ఆది నుంచి పులివెందులలో మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. తొలిసారి ఆయన కాంగ్రెస్ ఆర్ పక్షాన పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలుపొందడమే ఇందుకు నిదర్శనం. ఎన్టీఆర్ నీటి పారుదల పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగు గంగ వంటి విన్నూత్నమైన స్కీమ్‌ను చేపట్టారు. కాగా ఎన్టీఆర్ చేపట్టిన పలు ప్రాజెక్టులు పూర్తికాకుండానే ఆయన పదవీచ్యుతులయ్యారు. వైఎస్ కూడా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రాలోని అవసరమైన అన్ని ప్రాంతాలలో ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి నాంది పలికారు. ఎంతో కాలంగా ప్రతిపాదన దశలోనే ఆగిపోయిన పోలవరం, పులిచింతల, వెలిగొండ వంటి ప్రాజెక్టులకు ఆయన జీవం పోశారు. ఎన్టీఆర్ రెండు కిలో బియ్యం పథకంతో పాటు జనతా వస్త్రాలు, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి స్కీములను అమలు చేస్తే, వైఎస్సార్ అంతకన్నా ఎక్కువగా వివిధ పథకాలు చేపట్టారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ఆయన పునరుద్దరించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సాచ్యురేషన్ పద్దతిలో భారీ ఎత్తున పేదలకు ఇళ్లు నిర్మించారు.
అన్నిటికి మించి ఆరోగ్యశ్రీ , ఫీజ్ రీయింబర్స్ మెంట్ వంటివి ప్రజల మన్నన బాగా పొందాయి. రెండోసారి కాంగ్రెస్ విజయంలో అలాంటి స్కీముల ప్రభావం కూడా చాలా ఉందని చెప్పాలి. ఉమ్మడి ఏపీలో కాని, విభజిత ఏపీలో కాని ఒక నేత మరణించిన దశాబ్దాల తర్వాత కూడా ప్రజల మనసులలో ఉన్నారంటే అది ఎన్టీఆర్, వైఎస్సార్‌లే అని చెప్పవచ్చు. ఇక్కడ ఒక తేడా ఉంది. ఎన్.టి.రామారావును పదవీచ్యుతులను చేసింది స్వయంగా ఆయన అల్లుళ్లు, కుమారులే కావడం ఆయనకు అప్రతిష్టగా మిగిలిపోయింది.
దానికి తోడు జామాత దశగ్రహం పేరుతో ఆయన తన అల్లుడు చంద్రబాబునాయుడును తీవ్రంగా విమర్శిస్తూ ఒక క్యాసెట్‌ను కూడా విడుదల చేశారు. ఆయన చనిపోయిన తర్వాత మాత్రం చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు ఎన్.టి.ఆర్.వారసులుగా మళ్లీ జనం ముందుకు వచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అలాంటి సమస్య లేదు. ఆయన జీవించినంతకాలం ప్రజల మధ్యే ఉన్నారు. కాంగ్రెస్ లో అసమ్మతి నేతగా ఉన్నా, ప్రభుత్వంలోని తెలుగుదేశంపై పోరాడే నేతగా రాజకీయాలను ప్రభావితం చేసినా, తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకోగలిగారు.
కాంగ్రెస్‌లో ఉండే వర్గ విభేదాలను తట్టుకుని నిలబడి, మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా ప్రజలలో నిలిచిపోయారు. నిజానికి నీలం సంజీవరెడ్డి మొదలు డాక్టర్ చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి వరకు పలువురు ముఖ్యమంత్రి పదవితో పాటు మరిన్ని ఉన్నత పదవులు నిర్వహించారు. వారు తమ పదవీకాలంలో మంచి గౌరవాన్నే పొందగలిగారు. కాని వారు మరణించిన తర్వాత మాత్రం వైఎస్సార్ స్థాయిలో ప్రజలలో నిలవలేకపోయారన్నది వాస్తవం. అందుకు రకరకాల కారణాలు ఉండవచ్చు. అది వేరే విషయం.
ఇక్కడ ఒక విషయం ఒప్పుకోవాలి. రాజశేఖరరెడ్డి ఇలా ప్రజలలో నిలిచిపోవడానికి తను చేసిన పనులు ఒక అంశంకాగా, అంతకన్నా ముఖ్యంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రిని ప్రజల మదిలోనే ఉండేలా చేయడం కూడా అని చెప్పాలి. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించడానికి జగన్ ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకోవడం, దానిపై కొందరు కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీకి పితూరి చేయడం, తదుపరి సోనియాగాంధీని కూడా ధిక్కరించి ఓదార్పు యాత్రను కొనసాగించడం సంచలనం అయింది.
ఆ తర్వాత వైఎస్సార్‌ను ఒక బ్రాండ్ గా ప్రజలలోకి తీసుకు వెళ్లడం, అభిమానులు ఊరు వాడ అన్ని చోట్ల విగ్రహాలను ప్రతిష్టించడం, తర్వాత కాలంలో జగన్ తన తండ్రికి నివాళి అర్పిస్తూ, ఆయన పేరుమీదే రాజకీయ పార్టీని స్థాపించడం వంటి వాటితో చిరకాలం జనంలో నిలిచిపోయారని చెప్పాలి. బహుశా ఏ కుమారుడు కూడా తన తండ్రికి ఇంత గొప్పగా నివాళి అర్పించి ఉండరేమో!
ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యుల చేతిలో ఘోర పరాభవానికి గురి కావడం ఒక విషాదం అయితే, వైఎస్ రాజశేఖరరెడ్డి తన కుమారుడు, కుమార్తె వంటివారితో మరింత గొప్పపేరు పొందడం అదృష్టంగా భావించాలి. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం, తెలుగుదేశంతో కలిసి తన మాట వినలేదన్న కారణంగా జగన్‌పై పలు కేసులు పెట్టించడం, సిబిఐ విచారణ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం, చివరికి వైఎస్సార్ పేరును కూడా చార్జీషీట్‌లో చేర్చడం ద్వారా కాంగ్రెస్ పెద్ద తప్పు చేసింది.
ఒక వైపు వైఎస్సార్ పేరును కాంగ్రెస్ వారు వాడుకోవాలని ప్రయత్నిస్తూనే, మరో వైపు ఆయన పట్ల అపచారంగా వ్యవహరించి ఆ పార్టీ దారుణంగా నష్టపోయిందన్నది వాస్తవం. వైఎస్సార్ పేరుతోనే జగన్ అధికారం సాధించడం ద్వారా ఆయన గొప్పదనం ఏమిటో దేశం దృష్టికి తీసుకువెళ్లారని చెప్పారు. వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను మళ్లీ తీసుకు వస్తామని చెబుతూ నాన్న ఫోటో పక్కన తన పోటో కూడా చిరస్థాయిగా ఉండేలా పాలన సాగిస్తానని జగన్ చెబుతుంటారు. ఆ ప్రకారమే ఆయన అధికారంలోకి రాగానే తన మానిఫెస్టోలోని వివిధ స్కీములను అమలు చేయడం ఆరంభించారు. వాటిలో పెక్కింటికి వైఎస్సార్ పేరు పెట్టారు.
ఉదాహరణకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీని పేదలకు మరింత మేలు చేసే విధంగా తీసుకు వచ్చారు. రైతులకు సంబంధించిన పలు స్కీములకు కూడా వైఎస్సార్ అని నామకరణం చేశారు. వైఎస్సార్ జయంతిని, వర్దంతిని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. అధికారికంగా కూడా ఆయన స్మారకార్దం ప్రభుత్వ కార్యక్రమాలు సాగుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా జనం మధ్యలోనే ఉంటే, మరణం తర్వాత కూడా ఆయన జనంలోనే ఉంటున్నారు. అదే అన్నిటికన్నా గొప్ప విషయంగా భావించాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment