పెద్ద మనసున్న ప్రజల మనిషి
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయనపట్ల సోనియాగాంధీ, పార్టీ పెద్దలు వ్యవహరించిన తీరు అందరికీ తెలుసు. కానీ పార్టీని అధికారంలోకి తేవడానికి ఆయన ప్రయత్నిస్తున్న కాలంలో కూడా ఆమె ఆయనపట్ల అక్కసుతో వ్యవహరించిన తీరు సన్నిహితులకే తెలుసు. పార్టీ పట్ల, నాయకత్వంపట్ల ఆయన చూపిన విధేయత వల్ల అది బయటకు రాలేదు. ప్రజ లలో ఆయనకున్న ఆకర్షణ, ఆదరణ వల్లనే కాంగ్రెస్ ఆయనను ముట్టుకోలేదు. లేకపోతే ఏపీలో మరోసారి ముఖ్యమంత్రుల మార్పిడి ప్రహసనాన్ని చూసి ఉండేవాళ్లం.
మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఎట్లా పని చేస్తున్నది? ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అన్నిటినీ నెరవేర్చడానికి నిజాయితీగా కృషి చేస్తున్నదా? మనం సరైన ప్రభుత్వాన్నే ఎన్నుకున్నామా లేక పొరపాటు జరిగిందా? అని ప్రజలు తీరికగా సమీక్షించుకునే అవకాశం కనుక కలిగినట్టయితే చాలా ప్రభుత్వాలు కుప్పకూలిపోవడం ఖాయం. ఏ రాజకీయ పార్టీ అయినా సుదీర్ఘ కాలం అధికారంలో ఉండాలని కోరుకోవడం సహజమే. కానీ ప్రజల చేత శభాష్ అనిపించుకునేలా పని చేయడం ద్వారానే మళ్లీ అధికారంలోకి రావా లని తపనపడేవారు అరుదు. అటువంటి అరుదైన నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎల్లుండి జూలై ఎనిమిది ఆయన జయంతి.
జనం నాడి ఎరిగిన విజయ సారధి
2004లో, పదేళ్ల విరామం తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన వాడాయన. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం దాకా ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర జరిపి ప్రజల కష్టాలను తెలుసుకుని, సమస్యలను అధ్యయనం చేసి పార్టీ గెలుపునకు వ్యూహం కూడా రచించు కున్నారు. కాబట్టే 2004 ఎన్నికల ఫలితాన్ని ముందుగానే అంత కచ్చితంగా చెప్పగలిగారు. ఒక్కటి కూడా తగ్గకుండా ఆయన చెప్పినన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో గెలిచింది.
2004లో అద్భుత విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన రాజశేఖరరెడ్డి 2009 ఫలితాలను ఆత్మవిమర్శగా స్వీకరించారు. ఆ ఆత్మవిమర్శ ఆయన మౌనంగా, ఒంటరిగా, నాలుగు గోడల మధ్య చేసుకున్నది కాదు. బాహాటంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష సమా వేశంలో చేసిన ప్రసంగంలోనే ఆయన... ప్రజలు మనకు ఈసారి పాస్ మార్కులు మాత్రమే వేశారు, ఈ ఐదేళ్లూ కష్టపడి ప్రజల మన్నన పొంది మంచి మార్కులు తెచ్చుకుని, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసు కోవాలి అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవరికీ మంచి పేరు రావడం ఆ కుటుంబానికి ఇష్టం ఉండదు. ఐదేళ్లపాటూ కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించి, దేశాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఆయన మరణించాక కాంగ్రెస్, మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆయనపట్ల ఎంత అవమానకరంగా ప్రవర్తించిందీ మనందరికీ తెలుసు. నిన్నగాక మొన్న ఆయన జీవిత చరిత్ర ‘హాఫ్ లయన్’ తెలుగులో ‘నరసింహుడు’ పేరిట వెలువడిన సందర్భంగా మరొక్కసారి ఆ విషయంపై చర్చ జరిగింది. అందరం విన్నాం. కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత్రికి ఇంతకుముందే చెప్పుకున్నట్టు తమ కుటుంబానికి తప్ప మరెవరి కీర్తి ప్రతిష్టలు ఇనుమడించడం ఇష్టం ఉండదు. రెండుసార్లు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుడయిన రాజ శేఖరరెడ్డిని సైతం సోనియా గాంధీ, ఆమె కుటుంబం గౌరవంగా చూడలేదు.
కాంగ్రెస్ వైఎస్ రుణం తీర్చుకున్న తీరు
2009లో ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పెద్ద సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకుని ఉండకపోతే యూపీఏ 2 అధికారంలోకి రావడం అంత సులభం అయ్యేదే కాదు. యూపీఏ 1 సమయంలో తోడున్న వామపక్షాలు లేక పోవడమే గాక, కేంద్రంలో కాంగ్రెస్ ప్రతిష్ట కొంత మసకబారుతున్న సమయంలో... ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షాలన్నీ మహా కూటమి పేరుతో ఏకమయినా రాజశేఖరరెడ్డి ఒంటి చేత్తో రాష్ట్రంలో పార్టీ ప్రచారాన్ని నిర్వ హించారు. అక్కడా, ఇక్కడా మళ్లీ అధికారాన్ని కాంగ్రెస్ హస్తగతం చేశారు. 2009 గెలుపునకు ఏ నాయకుడైనా మరే కారణమైనా చెబితే అది ఆత్మ ద్రోహం అవుతుంది.
ఇంత చేసిన రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన పట్ల, ఆయన కుటుంబం పట్ల కాంగ్రెస్ పార్టీ దాని అధినేత్రి ఎట్లా వ్యవ హరించారో అందరికీ తెలుసు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చ దలచిన రాజశేఖరరెడ్డి కుమారుడు, అప్పటి కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని పార్టీ నుంచి వెళ్లగొట్టే వరకూ, ఆ తరువాత కేసులు పెట్టి వేధించే వరకూ ఏం జరిగిందో చూస్తే... తమకు తప్ప మరెవరికి కీర్తి ప్రతిష్టలు రావడాన్నీ సహించలేని గాంధీ-నెహ్రూ కుటుంబం ధోరణి ఎవరికైనా అర్థం అవుతుంది. అంతేకాదు జీవించిలేని రాజశేఖరరెడ్డి పేరును నిందితునిగా చార్జిషీట్‌లో చేర్చి మరీ కాంగ్రెస్ ఆయన రుణాన్ని తీర్చుకుంది.
క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాక ముఖ్యమంత్రి కావడానికి డాక్టర్ రాజశేఖరరెడ్డి 26 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. 1978లో మొదటిసారి శాసన సభ్యుడిగా ఎన్నికయిన దగ్గరి నుంచి 2004 వరకూ ఆయన కాంగ్రెస్‌లోని అంతర్గత విరోధులతో తలపడుతూనే, నిత్య అసమ్మతివాది అనే విమర్శను ఎదుర్కొంటూనే ముఖ్యమంత్రి స్థానానికి చేరుకోగలిగారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయనపట్ల సోనియాగాంధీ, పార్టీ పెద్దలు వ్యవహరించిన తీరు అందరికీ తెలుసు. కానీ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని అధికారంలోకి తేవడా నికి ఆయన ప్రయత్నిస్తున్న కాలంలో కూడా కాంగ్రెస్ అధినాయకురాలు రాజశేఖరరెడ్డితో వ్యవహరించిన పద్ధతి చాలా కొద్ది మంది సన్నిహితులకు మాత్రమే తెలుసు. అసమ్మతివాది అనే ముద్ర ఉన్నా ఆయన పార్టీపట్ల, నాయకత్వంపట్ల ఎప్పుడూ విధేయుడిగా ఉండటమే అందుకు కారణం. రాజశేఖరరెడ్డి సీఎం కావడం లేదా కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకు దక్కడం సోనియాకి, కాంగ్రెస్ పెద్దలకు ఎప్పుడూ ఇష్టం లేదు. ఆయనకున్న ప్రజాకర్షణ, సీఎంగా ప్రజల్లో ఆయనపట్ల పెరిగిన ఆద రణా చూసి, ఏమీ చేయలేని స్థితిలోనే కాంగ్రెస్ ఆయనను ముట్టుకోలేదు. లేక పోతే మళ్లీ ఒకసారి ఏపీలో సీఎంల మార్పిడి ప్రహసనాన్ని చూసి ఉండేవాళ్లం.
దట్ ఈజ్ వైఎస్
కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం వైఎస్ పాదయాత్ర చేస్తున్న రోజులు అవి. తెలంగాణ జిల్లాల పాదయాత్రను ముగించుకుని, ఆంధ్ర ప్రాంతంలోకి అడుగు పెట్టాక ఆయన రాజమండ్రి దగ్గర అనారోగ్యం పాల య్యారు. దీంతో ఆయన అక్కడే ఓ ఊరి బయట విశ్రాంతి తీసుకుంటున్న రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా మరెక్కడికో వెళుతూ విశాఖపట్నం విమానాశ్రయంలో కాసేపు ఆగారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావడానికి కఠోర యాత్ర చేస్తూ రాజశేఖరరెడ్డి అస్వస్తులయ్యారు, ఎలాగూ మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి స్వయంగా వెళ్లి ఆయనను పలకరిస్తే బాగుంటుంది, ఆయనకే కాదు పార్టీ శ్రేణులకు కూడా కొత్త ఉత్సాహం కలుగుతుంది అని కొందరు సూచించారు.
దానికి సోనియా ఇచ్చిన జవాబుకు ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ‘‘దట్ ఈజ్ హిజ్ హెడ్ ఏక్’’ (అది ఆయన తలనొప్పి) నేనెందుకు పలకరించాలి అన్న అర్థం వచ్చేట్టు మాట్లాడి, ఆ సూచనను నిరాకరించారు. రాజశేఖరరెడ్డి వంటి సీనియర్ నాయకుడి పట్లనే అధినేత్రి వైఖరి ఇట్లా ఉంటే ఏమనుకోవాలి? ఆ తరువాత రాజ శేఖరరెడ్డి ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించుకుని నేరుగా తిరుపతి వెళ్లి తిరుమలలో వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని పార్టీ అధ్యక్షురాలిని కలుసుకోడానికి అటునుంచి అటే ఢిల్లీ వెళ్లారు. తిరుమలలో స్వామివారి దర్శనం అయినంత సులభంగా ఆయనకు పార్టీ అధ్యక్షురాలి దర్శనం కాలే దనేది అప్పుడు ఆయన వెంట ఉన్న వారికి తెలుసు.
90కి పైగా శాసనసభా స్థానాలుగల బలమైన ప్రతిపక్షనేత, ప్రజాకర్షణగల నాయకుడు, పైగా కొన్ని వేల కిలో మీటర్ల పాదయాత్ర చేసి వచ్చినా అధినేత్రి అపాయింట్‌మెంట్ దొరకడం కష్టం అయింది. ఇదీ కాంగ్రెస్ అధిష్టానం తన నాయకులను గౌరవించే తీరు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కాంగ్రెస్ పార్టీనే మరిపించే తీరున పరిపాలన సాగించి ప్రజా హృదయాలపై తన సొంత ముద్రను బలంగా వేశారు. అయినా ఆయన పార్టీ విధేయతను మరచి పోలేదు. కాబట్టే ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దానికి నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుల పేర్లను పెట్టడం జరిగింది. దట్ ఈజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!
జూలై 8 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
- దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com