ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తెలంగాణలో ఎన్‌కౌంటర్ల పేరుతో ఇప్పటివరకు 2,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టార్గెట్‌లు, ఇన్‌ఫార్మర్ల పేరుతో నక్సలైట్లు చంపిన వారి సంఖ్య 2,300 దాకా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలోని ఎన్‌కౌంటర్లు, రక్తపాతం గురించి కూడా చాలాసార్లు చర్చకు వచ్చింది. అటువంటి హింసలేని ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని అందరం ఉద్యమ సమయంలో ఎలుగెత్తి చాటాం. కానీ శ్రుతి, విద్యాసాగర్‌ల ఎన్‌కౌంటర్ ప్రజలను, ప్రజాస్వామ్యవాదులను కలవరపెడుతున్నది.
వ్యక్తి చేస్తే అది పొరపాటు. అధికార వ్యవస్థ చేస్తే అది తప్పవుతుంది. పాలించే ప్రభుత్వమే మనిషిని చంపితే దాన్ని నేరమే అనాలి. రాజ్యం తప్ప మరెవ్వరు చేసినా దాన్ని సమర్థించుకోవచ్చు. కానీ ప్రజల మానప్రాణాలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థే నేరానికి పాల్పడితే సమర్థించుకోజాలదు. వ్యక్తికి జీవించే హక్కును ప్రసాదించిన రాజ్యాంగం ప్రభుత్వాలకూ, రాజ్యాలకూ కొన్ని నియమాలను విధించింది. పౌరుల స్వేచ్ఛకు పాలకుల అధికారాలు అడ్డంకి కాకూడదు. జీవించే స్వేచ్ఛను హరించకూడదు. రాజ్యాంగ రచనా సభ చర్చలను గమనిస్తే ఇది స్పష్టమవుతుంది.
‘ఈ రాజ్యాంగం ద్వారా ప్రభుత్వానికే కాకుండా, ప్రజలకూ హక్కులు కల్పించాలి. ప్రజల జీవితాలను, స్వేచ్ఛను ప్రభుత్వ అధీనంలోకి నెట్టకూడదు. చాలా విషయాలను ఇప్పటికే ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వాలకు దఖలు పరిచారు. ఇది నియంతృత్వ పోకడలకు దారితీయకూడదు. అందువల్ల ప్రజల స్వేచ్ఛ, భద్రత, జీవించే హక్కు లాంటివి ప్రాథమిక హక్కులుగా ఉండాలి.’ అంటూ ఆర్టికల్-21 పై 1949, సెప్టెంబర్ 16న జరిగిన చర్చలో ప్రముఖులు వాదనలు వినిపించారు. దానిని న్యాయస్థానాలలో ప్రశ్నించడానికి వీలుగా ప్రాథమిక హక్కులలో చేర్చారు. కానీ ప్రజల ఓట్లతో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న ప్రభుత్వాలే, వారి జీవితాలను నియంత్రించే హక్కును అనధికారికంగా సొంతం చేసుకొని రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. ఇది మొదటిది కాదు. కానీ నవ తెలంగాణలో ఇదే చివరిది కావాలని కోరుకుందాం.
కట్టుకథలు మారవా?
ఇటీవల వరంగల్ జిల్లాలోని ములుగు అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో శ్రుతి, విద్యాసాగర్‌లు మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. కానీ, శ్రుతి మరణించిన తీరు, వాతావరణం హత్యేనని రుజువుచేస్తున్నాయన్నది మృతుల బంధువులు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల వాదన. వారిని ముందుగా పట్టుకొని, చిత్రహింసలు పెట్టి, కాల్చి చంపారని వారు ఆరోపిస్తున్నారు. ఎప్పటిలాగే పోలీసుల వాదన మరోలా ఉంది. వారి కట్టు కథలు కూడా సుపరిచితమే. కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీపీఐ (ఎంఎల్) నాయకులు మధుసూదన్‌రాజ్ ఎన్‌కౌంటర్‌పై దాఖలైన రిట్ పిటిషన్‌ను స్వీకరిస్తూ, జస్టిస్ ఎం.ఎన్.రావు ఇచ్చిన విలక్షణ తీర్పును ఇప్పుడు ప్రస్తావించడం అవసరం. మధుసూదన్‌రాజ్ నిజమైన ఎన్‌కౌంటర్‌లో చనిపోలేదని, హైదరాబాద్‌లోని గాంధీనగర్ ప్రాంతం నుంచి పట్టుకొచ్చి, వరంగల్‌లో కాల్చివేశారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు.
దీనిపైనే జస్టిస్ ఎం.ఎన్ రావు, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నక్సలైట్లుగానీ, ఎవరైనా చనిపోయిన సంఘటనతో గానీ సంబంధం ఉన్న పోలీసు అధికారులపై ముందుగా హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని, ఒక వేళ న్యాయస్థానం విచారణలో వాళ్లు నిర్దోషులని తేలితే తప్ప, అంత వరకు వారు నిందితులుగానే ఉంటారని తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పును ఆనాటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అందువల్ల దానిని అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ జస్టిస్ ఎం.ఎన్.రావు ఇచ్చిన తీర్పు స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాల చేతిలో అధికారం, పోలీసుల చేతుల్లో తుపాకులు. ఈ రెండింటికీ ఎదురులేదనే భావన ఇప్పటికీ ప్రామాణికంగా కొనసాగుతున్నది. కానీ చట్టాలలో పేర్కొన్న విధానాల ప్రకారం తప్ప ప్రజల ప్రాణాలకు, భద్రతకు, స్వేచ్ఛకు ఎటువంటి హానీ తలపెట్టకూడదని ఆర్టికల్ 21 ఘోషిస్తోంది. కాబట్టి ప్రజలను కాల్చిచంపి, ఇది చట్టం, న్యాయాల రక్షణకేనని ప్రకటించడం సరికాదు. ఇదే విషయంపై గతంలో ఎన్నో చర్చలు జరిగాయి.
ఇది ప్రమాదకర ధోరణి
కొంతమంది దొంగలు, గ్యాంగస్టర్‌ల విషయంలో పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని పట్టణ మధ్యతరగతి, ధనికవర్గాలు నమ్ముతున్నాయి. నక్సలైట్లు, టైస్టులు కూడా ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని, అందువల్ల వారిని పట్టుకొని చంపినా, ఎన్‌కౌంటర్లు చేసినా తప్పు లేదనే వాదనలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈ కారణంగానే దొంగలను, స్త్రీలపై హింసకు పాల్పడిన వారిని ఉరితీయాలని, ఎన్‌కౌంటర్ చేయాలనే వాదనలను సాధారణ ప్రజలే కాకుండా ప్రజాసంఘాలు కూడా చేస్తుండడం ఒక విచిత్రమైన పరిస్థితి. ఇది ప్రమాదకరమైన వైఖరి. ప్రాణం తీసే హక్కును ప్రభుత్వానికీ, పోలీసులకూ ప్రజలే అప్పగించినట్టవుతుంది. అది ఒక దొంగ విషయంలో జరగొచ్చు. నక్సలైటు కనుక, వాళ్లు కూడా మనుషులను చంపుతున్నారు కనుక శ్రుతిని కానీ, మరెవ్వరినైనా కానీ పాశవికంగా చంపొచ్చు అనే ఆటవిక పోకడలకు మద్దతివ్వడమే.
రాజ్యాంగం ప్రజలకు కొన్ని హక్కులను ఇచ్చింది. ఒకవేళ ప్రజలు, వ్యక్తులుగా, సంస్థలుగా నేరాలు చేస్తే, వాళ్ల కారణంగా ఇతరులకు ఇబ్బందులైతే చూస్తూ కూర్చోవాలని ఎవరూ అనడం లేదు. ప్రభుత్వాలు అలాంటి వ్యక్తులను, సంస్థలను అదుపులోకి తీసుకోవాలి. విచారణ జరిపి, చట్టాలకు లోబడి శిక్షించాలి. అట్లా చేస్తున్నారు కూడా. అయితే ఇక్కడ చర్చ అంతా ఆ ప్రభుత్వాలే ఇంకొక వైపు, విచారణ లేకుండా, చట్ట వ్యతిరేకంగా ప్రజలను కాల్చి చంపడం. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఆయుధాలతో ప్రజలను చంపడం, దానిని అరికట్టడానికి వెళ్లిన వారిని, సైన్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని కాల్పులు జరిపిన సందర్భాలు ఎదురైతే, అప్పుడు ఎదురు కాల్పులు జరిపితే అటు, ఇటు రెండు వైపులా నష్టం జరిగితే అది నిజమైన ఘర్షణ. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, దేశవ్యాప్తంగా ఏక పక్షంగా జరిగిన ఎన్‌కౌంటర్లే ఎక్కువ. ఎన్నో నిజనిర్ధారణ కమిటీలు దీనిని నిరూపించాయి.
1975-77 ఎమర్జెన్సీ కాలంలోనూ, అంతకు ముందు జరిగిన ఘటనల్లోనూ అక్రమంగా కాల్చి వేయడం వల్ల మరణించిన వారే ఎక్కువని జస్టిస్ భార్గవ కమిషన్ వెల్లడించింది. ప్రజాస్వామిక, పౌర హక్కుల సంఘాలతో రూపొందిన తార్కుండే కమిటీ కూడా ఇదే చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తెలంగాణలో ఎన్‌కౌంటర్ల పేరుతో ఇప్పటివరకు 2,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టార్గెట్‌లు, ఇన్‌ఫార్మర్ల పేరుతో నక్సలైట్లు చంపిన వారి సంఖ్య 2,300 దాకా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలోని ఎన్‌కౌంటర్లు, రక్తపాతం గురించి కూడా చాలాసార్లు చర్చకు వచ్చింది. అటువంటి హింసలేని ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని అందరం ఉద్యమ సమయంలో ఎలుగెత్తి చాటాం. కానీ శ్రుతి, విద్యాసాగర్‌ల ఎన్‌కౌంటర్ ప్రజలను, ప్రజాస్వామ్యవాదులను కలవరపెడుతున్నది. కేవలం నక్సలైట్లే కాదు, సాధారణ ప్రజలు, ప్రజాస్వామిక వాదులంతా దీన్ని ఖండించారు. చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు.
ఇది పరిష్కారం కాదు, కాలేదు
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై విస్తృత ప్రజాస్వామిక వేదిక ఏర్పాటైంది. ఇది బలపడుతోన్న ఉద్యమ ఐక్యతకు సంకేతం. దీనిని ప్రభుత్వం గుర్తించి తీరాలి. నిజానికి గతంలో ఉన్న విధంగా నక్సలైట్ల కార్యకలాపాలు, హింసాయుత సంఘటనలు ఇప్పుడు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, ఉద్యమం ఒక ప్రజాస్వామ్య భావనకు పునాదిగా భావించాం. ఇప్పుడు చేయాల్సింది ‘నక్సలైట్ల’ను ఏరివేయడం కాదు. ఆ ఉద్యమ మూలాలను వెతికి, అందుకు కారణమైన ఆర్థిక, సామాజిక సమస్యలను పరిష్కరించాలి. దానికి తెలంగాణలో మిషన్ కాకతీయ, దళితులకు భూమి లాంటి కొన్ని విధానాలను అమలు చేస్తున్న మాట నిజమే. కానీ అవి చాలవు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం యువతలో పెరుగుతున్న నిరాశ, నిస్పృహలను అర్థం చేసుకోవాలి.
అది అసహనంగా మారకుండా చూడాలి. ఇప్పటికే తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులుగా, అర్ధ నిరుద్యోగులుగా ఉన్నారు. తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని, లేదంటే ఏదో ఉపాధి లభిస్తుందని యువతరం భావించింది. మనందరం అదే అభిప్రాయాన్ని కలిగించాం. కానీ సమగ్రమైన ఉద్యోగ, యువజన విధానాన్ని రూపొందించలేకపోయాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను వేసి, కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చాం. కానీ ప్రభుత్వ సంస్థలలో లక్షమందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలం. మిగతా లక్షలాది మంది గురించి మన ప్రణాళికలేమిటో స్పష్టం చేయలేదు. ఇది పెద్ద సవాల్.
హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న సంస్థలు, పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులలో లక్షలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో స్థానికులు తక్కువ. ఎక్కువమంది ఇతర రాష్ట్రాల వారు. దానికి కారణం వాళ్లకున్న నైపుణ్యం. మన దగ్గర యాభై లక్షల మందికి పైగా యువకులు ఉన్నారు. వీరిలో సగానికి సగం ఎటువంటి నైపుణ్యంలేనివారేనని లెక్కలు చెబుతు న్నాయి. అందుకే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన యువకులకు ఉపాధిలో నైపుణ్యం కలిగించే అంశం మీద దృష్టి సారించాలి. కనీసం 80 శాతం మందికి స్థానిక సంస్థల్లో, పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలి. మిషన్ కాకతీయ లాగా మిషన్ ఎంప్లాయ్‌మెంట్‌ను స్థాపించాలి. ప్రభుత్వాలు మనకు రక్షణగా ఉంటాయనే భరోసానివ్వాలి. అంతేకానీ ఎన్‌కౌంటర్ల పేరుతో పౌరులను కాల్చి చంపడం సరియైంది కాదు. అది సమస్యకు పరిష్కారం కూడా కాదు.
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213
- మల్లెపల్లి లక్ష్మయ్య
జీవించే హక్కే వేదవాక్కు
Published Thu, Oct 8 2015 1:26 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement