మావోల దాడులకు బలవుతోంది ఎక్కువగా స్థానికులే
డీఆర్‌జీలో మాజీ నక్సల్స్, ఫైటర్స్‌లో లోకల్ యూత్
ముందుండి నడిపిస్తున్న డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బస్తర్ అడవుల్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. సీఆర్‌పీఎఫ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్–కోబ్రా, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, దంతేశ్వరి ఫైటర్స్ తదితర సాయుధ బలగాలు సంయుక్త ఆపరేషన్లు చేస్తూ బస్తర్ అడవుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. అయితే భద్రతా దళాలపై మావోయిస్టులు జరిపే దాడుల్లో ఎక్కువగా స్థానికులతో కూడిన డీఆర్‌జీ యూనిట్ జవాన్లే హతమవుతున్నారు. తాజా ఘటనలో బస్తర్ ఫైటర్స్ కూడా ఉన్నారు.
బలగాలకు భారీ నష్టం
దేశంలోని విప్లవ శక్తులన్నీ కలిసి 2004లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఏర్పడ్డాయి. నేపాల్ నుంచి శ్రీలంక వరకు రెడ్ కారిడార్ లక్ష్యంగా ముందుకు కదిలాయి. దీనికి ప్రతిగా ప్రభుత్వం 2005లో స్థానిక యువతతో సల్వాజుడుం (శాంతి దళం) పేరుతో సాయుధ దళాలను ఏర్పాటు చేసింది.
2007లో మావోయిస్టులు జరిపిన దాడిలో ఏకంగా 55 మంది పోలీసులు చనిపోయారు. ఇందులో 31 మంది సల్వాజుడుం వారే ఉన్నారు.
2008లో ఒడిశా బలిమెల వద్ద జరిగిన దాడిలో 37 మంది గ్రేహౌండ్స్ పోలీసులు హతమయ్యారు.
2007 ఏప్రిల్ 25న చింతల్నార్ దగ్గర బాంబుదాడితో పాటు అంబూష్ ఎటాక్ జరిపారు. ఈ ఘటనలో ఏకంగా 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సల్వాజుడుం, గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్ ఇలా ఏ రూపంలో బలగాలు దండకారణ్యంలోకి వెళ్లినా చేదు ఫలితాలే వచ్చాయి. దీంతో జనంలో జనంలా కలిసిపోయి గెరిల్లా యుద్ధతంత్రంతో మావోలు జరిపే దాడులను సమర్థంగా ఎదుర్కోవడం ప్రభుత్వ భద్రతా దళాలకు తప్పనిసరిగా మారింది.
మాజీలతో డీఆర్‌జీ..
గతంలో సల్వాజుడుంలో పనిచేసిన వారికి జంగిల్ వార్‌ఫేర్‌లో శిక్షణ ఇచ్చి డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ) పేరుతో 2008లో కాంకేర్ తొలి యూనిట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో మావోయిజం వైపు ఆకర్షితులై జనమిలీషియా నుంచి దళాల్లో వివిధ హోదాల్లో పనిచేసి లొంగిపోయిన మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే సంస్థగా డీఆర్‌జీ రూపాంతరం చెందింది.
జిల్లాకు ఒకటి వంతున 2015 నాటికి బస్తర్, నారాయణ్‌పూర్, కాంకేర్, దంతెవాడ, కొండెగావ్, బీజాపూర్, సుక్మా మొత్తం ఏడు డీఆర్‌జీ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ప్రతీ యూనిట్‌లో 500 మంది జవాన్లు పని చేస్తున్నారు.
ముందుండేది వీరే..
గతంలో అడవుల్లో నక్సల్స్‌తో కలిసి పనిచేసిన అనుభవం, స్థానిక అడవులపై అవగాహన, వాగులు దాటడం, గుట్టలు ఎక్కడంలో నేర్పరితనం, అడవుల్లో దొరికే ఆకులు, దుంపలు, కాయల్లో ఆహార పదార్థాలను గుర్తించడం తదితర విషయాల్లో డీఆర్‌జీ జవాన్లు ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో అడవుల్లో చేపట్టే గాలింపు చర్యల్లో డీఆర్‌జీ యూనిట్లు కీలకంగా మారాయి.
అంతేకాదు పారిశ్రామికీకరణ, పట్టణీకరణ లేక విద్యావకాశాలకు దూరంగా ఉన్న స్థానిక యువతకు వెంటనే లభించే ఉపాధి మార్గంగా డీఆర్‌జీ యూనిట్లు మారాయి. అయితే జవాన్ల వయోభారం, ఫిజికల్ ఫిట్‌నెస్ డీఆర్‌జీ యూనిట్లకు మైనస్‌గా మారింది.
బస్తర్ ఫైటర్స్..
డీఆర్‌జీతో వచ్చిన సానుకూల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని లోకల్ యంగ్ టీమ్‌తో బస్తర్ ఫైటర్స్‌ను 2022లో అందుబాటులోకి తెచ్చారు. 300 మందితో కూడిన మొదటి యూనిట్‌కు నోటిఫికేషన్ ఇస్తే ఏకంగా 40 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాకు 300 మంది జవాన్లతో కూడిన ఏడు యూనిట్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి.
ఇదే ఊపులో కేవలం మహిళలతో దంతేశ్వరీ ఫైటర్స్ అనే యూనిట్ కూడా మొదలైంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో స్థానికేతర దళాలకు సాయమందించే పనిలో ఉన్న ఈ లోకల్ జవాన్లే ఎక్కువగా మావోలు జరిపే దాడుల్లో చనిపోతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment