అనంతపురం అగ్రికల్చర్, అర్బన్, న్యూస్‌లైన్:
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్ ఉద్యోగులు సేవలు నిలిపివేయడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సోమవారం గంటల తరబడి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఫలితంగా బ్యాం కులు, ఆసుపత్రుల్లో కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మధ్యాహ్నం 1.30 నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలచిపోవడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎంఏసీ, సీఓటీ మినహా మిగతా అన్ని వార్డుల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఓ వైపు ఉక్కపోత, మరో వైపు దోమల రొదతో రోగులు సతమతమయ్యారు. ఐసీయూ రోగుల ఆర్తనాదాలతో నిండిపోయింది. ఎమర్జెన్సీ వార్డులోనూ అదే దుస్థితి. ప్రసూతి వార్డులో ప్రసవం జరుగుతున్న సమయంలో కరెంటు పోవడంతో వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలిన గాయాలతో చికిత్సలు పొందుతున్న రోగులు గాలి తగలక నరకయాతన అనుభవించారు.
ప్రభుత్వంతో విద్యుత్ జే ఏసీ చర్చలు విఫలం
అనంతపురం న్యూటౌన్: విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో ఆ శాఖ సీఎండీ నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో సీమాంధ్ర ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఆగిపోయి పలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి మూడు సార్లు ట్రాన్స్‌కో సీఎండీ, రైల్వే అధికారులు జేఏసీ నాయకులతో జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో ఉద్యోగులెవరూ విధులకు హాజరు కావద్దని జేఏసీ నాయకులు సూచించారు. విద్యుత్ జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ రవిశంకర్, జిల్లా విద్యుత్ జేఏసీ చైర్మన్ సంపత్‌కుమార్ న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర అధికారులతో చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
విద్యుత్ ఉపకేంద్రం ముట్టడి
పరిగి, న్యూస్‌లైన్:మండల పరిధిలోని సేవామందిర్ కూడలిలో ఉన్న 220/132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని విద్యుత్ జేఏసీ నాయకులు సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా జేఏసీ ైచైర్మన్ నాగరాజు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతంలోని ఉద్యోగులు జీతాలు అందవని తెలిసినా, శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తున్నామన్నారు. టీనోట్ ఆమోదించిన కేంద్ర కేబినేట్ దానిని తిరస్కరించేంత వరకు విధులకు హాజరుకామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీలు విజయరాజు, రాజశేఖర్, ఏఈలు వెంకటేశులు, చెన్నకృష్ణయ్య, వేణుగోపాల్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ కోతతో విలవిల
Published Tue, Oct 8 2013 3:35 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
Advertisement
Advertisement