ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని మూడు ఉపాధ్యాయ జేఏసీలు, వాటిల్లోని 54 సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించాయి. వేర్వేరు జేఏసీల పరిధిలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై పోరాటాలు సాగించాలని నిర్ణయించాయి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో జాయింట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ యూనియన్‌గా (జేసీటీయూ) ఏర్పడ్డాయి. ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు 30 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశాయి. వచ్చే నెల 2 నుంచి జరగాల్సిన 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరించాలని నిర్ణయించాయి. బహిష్కరణను విజయవంతం చేసేందుకు ఈనెల 28, 29 తేదీల్లో అన్ని జిల్లాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించాలని నిర్ణ్ణయించాయి. దీనిపై ఈనెల 27న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసిచ్చేందుకు సిద్ధమయ్యాయి. మూడు జేఏసీలకు నాయకత్వం వహిస్తున్న పీఆర్‌టీయూ అ«ధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావు, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా 9 ప్రధాన సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సంఘాల నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, రఘునందన్, చెన్నయ్య, అంజిరెడ్డి, రాజన్న పాల్గొన్నారు.
ఇవీ ప్రధాన డిమాండ్లు..
- సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలి.
- ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం న్యాయపరమైన ఆటంకాలు తొలగించి, వేసవిలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి.
- కొత్త పీఆర్‌సీని 2018 జూలై 1 నుంచి అమలు చేసేలా చర్యలు చేపట్టాలి.
- రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.
- 2016 వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలి.
- ఎయిడెడ్, మోడల్ స్కూల్, కేజీబీవీ, గిరిజన, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి.
- అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను పునరుద్ధరించాలి.
- ఎస్సెస్సీ పరీక్షల విధులు, మూల్యాంకనం రేట్లను రెట్టింపు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment