‘సమైక్యం’తో మమేకం | united andhra pradesh | Sakshi
Sakshi News home page

‘సమైక్యం’తో మమేకం

Published Sat, Sep 7 2013 6:34 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

united andhra pradesh

 ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రతి ఒక్కరూ సమైక్య ఉద్యమంతో మమేకమవుతున్నారు. ర్యాలీలు, మానవహారాలు, నిరసన దీక్షలతో జిల్లా శుక్రవారం దద్దరిల్లింది. ఆర్టీసీ బస్సులు లేకపోవడం, పలు ప్రాంతాల్లో ఆటోవాలాలు సైతం సంఘీభావం ప్రకటిస్తూ బంద్‌కు పిలుపునివ్వడంతో సామాన్య జనజీవనం స్తంభించినట్లయింది. సీఎస్‌పురం మండలం డీజీపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా టీచర్లు పాఠశాలను వదిలి రోడ్డుపై పాఠ్యాంశాలు బోధించారు. సీఎస్‌పురంలో ఉపాధ్యాయ జేఏసీ కూడా ఇదే తరహాలో  నిరసన వ్యక్తం చేసింది.
 
 రాష్ట్ర విభజన వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుందని, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఉపాధ్యాయ జేఏసీ ప్రకటించింది. అద్దంకిలో వ్యవసాయ శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయం నుంచి 3 వేల మందికిపైగా ఉద్యోగులు, ఆరోగ్య మిత్రలు ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, పొక్లయినర్లతో ర్యాలీ సాగింది. అద్దంకి బస్టాండు సెంటర్‌లో ‘రాష్ట్ర విభజన చీడ పురుగు’ పేరుతో తయారు చేసిన దిష్టిబొమ్మను దహనం చేశారు. నూర్‌బాషా సంఘం కూడా ర్యాలీ నిర్వహించింది. పాత బస్టాండ్ సెంటర్‌లో మానవహారం, రాస్తారోకో చేశారు. భవన నిర్మాణ కార్మికులు రాస్తారోకో, మానవహారంతో పాటు శాంతిహోమం నిర్వహించారు.
   
 వినూత్న నిరసనలు: జిల్లా కేంద్రమైన ఒంగోలులో కవులు, రచయితలు నిరసన గళం వినిపించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు భీమనాథం హనుమారెడ్డి ఆధ్వర్యంలో కవితాగోష్ఠి నిర్వహించారు. జిల్లా కోర్టు ఎదుట, ఒంగోలు నగరపాలక సంస్థ ఉద్యోగులు చెవిలో పూలుపెట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు భారీగా చర్చి సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. జిల్లాలోని ఎయిడెడ్ ఉపాధ్యాయులు జేఏసీగా ఏర్పడి సమైకా్యాంధ్రకు మద్దతుగా ప్రకాశం భవనం ముందు రిలే దీక్ష చేపట్టారు. ఎన్‌జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బషీర్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి సంఘీభావం తెలిపారు. జే.పంగులూరు, సంతనూతలపాడు, మార్కాపురం, మద్దిపాడు, బేస్తవారిపేట, కొమరోలులో ఉపాధ్యాయ జేఏసీ నాయకులు నిరసన ర్యాలీలు, రిలే దీక్షలు కొనసాగించారు. పర్చూరులో మూడుబొమ్మల సెంటర్‌లో  న్యాయవాదుల దీక్షలు కొనసాగాయి.
 
 ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి: గిద్దలూరులో ఉద్యమ జేఏసీ నాయకులు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కార్యాలయాన్ని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాచర్లలో జర్నలిస్టులు చేపట్టిన రిలే దీక్షను వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సూరా పాండురంగారెడ్డి ప్రారంభించారు.  యర్రగొండపాలెంలో గురుకుల పాఠశాల విద్యార్థులు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ విద్యార్థులు భారీగా రోడ్డుపైకి వచ్చి సమైక్యవాదానికి సంఘీభావం ప్రకటించారు. ఎన్‌జీఓలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మార్కాపురంలో ఎన్‌జీఓలు, మున్సిపల్ ఉద్యోగులు, జర్నలిస్టులు సంయుక్తంగా సమైక్య ర్యాలీ చేశారు.
 
 కదం తొక్కిన విద్యార్థి లోకం: దర్శిలో పది వేల మందికిపైగా విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు దర్శి కూడలిలో సమైక్యాంధ్ర గర్జన  నిర్వహించారు. జేఏసీ చైర్మన్ రాజకేశవరెడ్డి పాల్గొన్నారు. మార్టూరులో 10 వేల మందికిపైగా విద్యార్థులు జాతీయ రహదారిపైకి వచ్చి సమైక్యాంధ్రకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. పొన్నలూరు మండలం చవటపాలెం ఎస్సీకాలనీ వాసులు రోడ్డుపైనే వంటావార్పు చేశారు. జరుగుమల్లి మండలం చిరికూరపాడులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీతోపాటు మానవహారం నిర్వహించారు. కందుకూరులో 200 మంది ఆటోవాలాలు బంద్ పాటించి ర్యాలీ నిర్వహించారు. ఉలవపాడులో ఎంఈఓ బీ.శ్రీమన్నారాయణ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. ఉలవపాడు ఎంపీడీఓ, తహసీల్దారు సంఘీభావం ప్రకటించారు. ఆటోవాలాలంతా తాము సమ్మెలో పాల్గొనడమే కాకుండా విద్యాసంస్థలను కూడా మూసేయించి బంద్ పాటించారు. వీరికి ముఠాకూలీలు సైతం సంఘీభావం ప్రకటించారు.  
 
 చీరాలలో ఎల్‌ఐసీ ఏజెంట్లు చేపట్టిన రిలే దీక్షకు మెప్మా ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. ఎన్‌జీఓలు, ఆర్టీసీ కార్మికులు క్యారమ్స్, వైకుంఠపాళీ ఆడుతూ నిరసన తెలిపారు. బీసీ ఫెడరేషన్ దీక్షలు కొనసాగాయి. కనిగిరిలో వ్యాయామ ఉపాధ్యాయులు రిలే దీక్ష, ఆర్టీసీ ఎన్‌ఎంయూ కార్మికులు ధర్నా నిర్వహించారు. వెలిగండ్ల మండలం రామగోపాలపురంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పామూరులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్ని రహదారులను దిగ్బంధించారు. పామూరు, ఇనిమెర్ల గ్రామాల్లో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. సింగరాయకొండలో జేఏసీ నాయకులు చండీయాగం నిర్వహించి సర్వమత ప్రార్థనలు చేశారు. ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం సింగరాయకొండలో శాంతి ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లోని విద్యార్థులను బయటకు పంపి తాళాలు వేయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement