జంబో డీఎస్సీ లేనట్లే..!
పరిమితంగానే ఖాళీల భర్తీ
8 వేల పోస్టులకే నోటిఫికేషన్?
5 వేల స్కూల్ అసిస్టెంట్,
3 వేల ఎస్‌జీటీ పోస్టుల భర్తీకే చాన్స్
హైదరాబాద్: రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా భారీగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న 3.5 లక్షల మంది నిరుద్యోగులకు నిరాశ తప్పేలా లేదు. వచ్చే డీఎస్సీలో మొత్తంగా 5 వేల వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, మరో 3 వేల వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులను మాత్రమే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల చేపట్టిన హేతుబద్ధీకరణలో (రేషనలైజేషన్) విద్యాశాఖ ఈ లెక్కలు తేల్చింది. నివాస ప్రాంతాల్లోని కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని ప్రస్తుతం చేపట్టలేదు. అది కూడా చేపడితే ఇక భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టుల అవసరం పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు జిల్లాలు మినహా మిగతా ఆరు జిల్లాల్లో ఎస్‌జీటీ పోస్టులే వచ్చే పరిస్థితి లేదు. ఆరు జిల్లాల్లో ఇప్పటికే ఎస్‌జీటీ పోస్టులు మిగులుగానే ఉన్నాయి. ఫలితంగా ఎస్‌జీటీ పోస్టులు భారీగా వస్తాయని ఎదురుచూస్తున్న డీఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనయ్యే పరిస్థితి నెలకొంది. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా పరిమితంగానే వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో దాదాపు 17 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గతంలో విద్యాశాఖ లెక్కలు తేల్చినా వాటిల్లో చాలా పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో త్వరలో డీఎస్సీ వస్తుందని, కనీసం 12 వేల వరకు పోస్టులను భర్తీ చేస్తారన్న ఆశతో ఇప్పటికే కోచింగ్‌లలో చేరిన నిరుద్యోగులకు నిరాశ తప్పేలా లేదు. ఒక్కో జిల్లాలో మిగులు పోస్టులు పోగా ఖాళీగా ఉండే ఎస్‌జీటీ పోస్టులు నోటిఫికేషన్ నాటికి రెండంకెలకు మించి ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలవారీగా ఖాళీలు ఇవీ...
హేతుబద్ధీకరణ తరువాత ఆదిలాబాద్ జిల్లాలో 551 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉండగా మెదక్ జిల్లాలో 458 పోస్టులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 931 పోస్టులు, రంగారెడ్డి జిల్లాలో 1,894 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా దాదాపు 4 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో ఎస్‌జీటీ పోస్టులకు 75 శాతం ఖాళీ ఉండగా, 25 శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు మిగతా ఆరు జిల్లాల్లో ప్రస్తుతం సర్దుబాటు చేయగా ఎక్కువ మొత్తంలో ఎస్‌జీటీ పోస్టులు, కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లు లెక్కలు తేల్చారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో 623, నల్లగొండ జిల్లాలో 848, హైదరాబాద్‌లో 909, ఖమ్మంలో 450, వరంగల్‌లో 440, కరీంనగర్ జిల్లాలో 826 పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లు సమాచారం. ఈ జిల్లాల్లో నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఎస్‌జీటీ పోస్టుల అవసరం రెండంకెలకు మించి ఉండకపోవచ్చని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.