teacher vacancies
-
టీచర్ పోస్టుల లెక్కలు వేరయా!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ ఖాళీలపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. నిరుద్యోగుల ఆందోళనలు, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నుంచి అసంతృప్తి ఎక్కువవుతోంది. దీంతో విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. టీచర్ల నియామక ప్రకటన రాజకీయంగా కలిసి వస్తుందని ప్రభుత్వం భావిస్తుంటే, అసంతృప్తి, విమర్శలకు దారి తీస్తుందని ప్రభుత్వ వర్గాలు కంగారు పడుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి తాజాగా నివేదిక కోరారు. నియామక పోస్టులు పెంచడం సాధ్యమా? వాస్తవ ఖాళీలను వెల్లడించడం వీలవు తుందా? టీచర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా ఏర్పడే ఖాళీలను తర్వాత భర్తీ చేస్తామనే భరోసా ఇవ్వగలమా? అని ఆమె అధికారులను అడిగినట్టు తెలిసింది. అయితే దీనిపై విద్యాశాఖ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేసినట్లు సమాచారం. పొంతన లేని లెక్క పాఠశాల విద్యలో 22 వేల ఖాళీలు ఉండే వీలుందని ఏడాది క్రితం విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. గెజిటెడ్ హెచ్ఎం పోస్టులు 1,974, ప్రైమరీ హెచ్ఎం పోస్టులు 2,043, స్కూల్ అసిస్టెంట్లు 7,200, పీడీలు 25, ఎస్జీటీలు 6,775, లాంగ్వేజ్ పండిట్లు 688, పీఈటీలు 172, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్ పోస్టులు 1,733 ఖాళీలున్నాయని తేల్చింది. దీంతోపాటు ఎంఈవోలు 467, బాలికల పాఠశాలల హెచ్ఎంలు 15, డైట్ లెక్చర్లు 271, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు 58, డీఈవోలు 12 మందిని నియమించాలని సర్కార్‌కు నివేదించారు. ఇందులో 13 వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ ఇప్పుడు 5,089 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు వెల్లడించింది. దీంతో నిరుద్యోగులు ప్రతీ రోజూ పాఠశాల విద్య డైరెక్టరేట్ వద్ద ఆందోళనలు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా 22 వేల ఖాళీలుంటే, 5 వేల పోస్టుల భర్తీ ఏంటని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం టీచర్లకు పదోన్నతులు ఇస్తే కొన్ని ఖాళీలు ఏర్పడతాయని చెబుతోంది. ఈ ప్రక్రియ ముందుకెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. నిరుద్యోగులను మోసం చేయడమే టీచర్ పోస్టులు 22 వేల వరకూ ఖాళీగా ఉంటే, 5,089 పోస్టులే భర్తీ చేస్తామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమే. దీనిపై ఆందోళనకు దిగితే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యమంత్రే 13,500 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడా పోస్టులు ఎక్కడికి పోయాయి? 22 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం. – కోటా రమేష్ (డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు) ఇదేం రేషనలైజేషన్ విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను కేటాయించే హేతుబద్దిణ అశాస్త్రీయమైంది. ఒక్కో పాఠశాలలో ఎంత మంది విద్యార్థులున్నా, అన్ని తరగతుల బోధన జరగాలి. అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండాలి. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చడం, అతి తక్కువ పోస్టుల భర్తీకి పూనుకోవడం ఎంతమాత్రం సరికాదు. – చావా రవి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) హేతుబద్దిణే ముంచిందా? ♦టీచర్ నియామక ప్రకటన వెలువడేందుకు ముందు విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖాధికారులతో సమావేశం నిర్వ హించారు. రేషనలైజేషన్ ప్రకారం చూస్తే ఎన్ని ఖాళీలుంటాయని ఆరా తీశారు. టీచర్ పోస్టులు భారీగా కుదించుకుపోవడానికి డీఈవోల హేతుబద్దిణ నివేదికే కారణ మని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ 30 మందికి ఒక టీచర్ చొప్పున అధికారులు లెక్క గట్టారు. దీన్ని కొలమానంగా తీసుకోవడం అశాస్త్రీయమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. రాష్ట్రంలో మూడోవంతు బడుల్లో విద్యార్థుల సంఖ్య 30లోపే ఉంది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు 26,337 ఉన్నాయి. ఇందులో 8,782 (33.35 శాతం) చోట్ల 1–30 మంది విద్యార్థులున్నారు. ఈ తరహా హేతుబద్ధీకరణను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 30 మంది కన్నా తక్కువ ఉన్నా, అన్ని తరగతులకు టీచర్లు కావాలని, కానీ హేతుబద్దిణ పేరుతో ఒకే టీచర్‌ను ఇవ్వడం వల్ల అన్ని తరగతులు ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నాయి. దీనివల్లే అసలైన ఖాళీలు బయటకు రాకుండా పోయాయని వాపోతున్నాయి. -
టీచర్లు కావాలె!
సాక్షి, తాడూరు: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నా చదువు చెప్పే పంతుళ్లు కరువయ్యారు.. మండలంలోని చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యావలంటీర్లతోనే నెట్టుకొస్తున్నారు.. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించి సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. మండలంలో ఇలా మండలంలో చాలావరకు ఉపాధ్యాయులున్న చోట పిల్లలు లేరు, పిల్లలున్న చోట ఉపాధ్యాయులు లేరు. మండలంలోని ఆకునెల్లికుదురులో ఐదు తరగతులకు గాను 50మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. రెండు ఉపాధ్యాయ పోస్టులకు గాను ఒక పోస్టు ఖాళీగా ఉండటంతో ఉన్న ఒక్క ఉపాధ్యాయులు విద్యపరమైర సెలవుపై వెళ్లడతో వలంటీరుతో చదువు కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల్లో వలంటీరుతో చదువు ఎలా సాగుతుందన్న ఉద్దేశంతో గ్రామస్తులు తమ పిల్లలను మెరుగైన విద్య కోసం ప్రైవేటు పాఠశాలలకు పంపేందుకు సిద్ధమయ్యారు. అయినా ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేస్తామని ఉపాధ్యాయులు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. దీంతో ఉన్న వలంటీరుతో చదువు సాగడం కష్టంగా ఉంటుందన్న ఉద్దేశంతో దాదాపు 20మందికి పైగా విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు పంపేందుకు సిద్ధమయ్యారు. మండలంలో 24ప్రాథమికపాఠశాలలు, ఏడుప్రాథమికోన్నత, ఆరు ఉన్నత, ఒక కేజీబీవీ పాఠశాల ఉంది. పాఠశాలలో 1,856 మంది బాలురు, 2,304మంది బాలికలతో మొత్తం 3,890 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 565 మంది కొత్తగా పాఠశాలలో చేరినట్లు అధికారులు చెబుతున్నారు. వంద ఉపాధ్యాయ పోస్టులకుగాను 88మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 13ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులు లేక కొమ్ముకుంట తండా పాఠశాల మూసివేశారు. పలు గ్రామాల్లోని పాఠశాలలో అదనపు నగదుల కొరత మరి కొన్ని గ్రామాలలో శిథిలావస్థకు చేరిన భవనాలు, అరకొర వసతుల మధ్య పాఠశాలలు కొనసాగుతున్నాయి. విధిగా బోధించి ఉత్తమ ఫలితాలు తేవాలన్న ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ వారి సరిపడా వసతులు లేకపోవడం వల్ల చదువులు డీలా పడుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఉమ్మడి జిల్లాలోనే ఉత్తమ ఫలితాలు సాధించే తాడూరు మండల పరిస్థితిని మెరుగుపర్చే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తాం మొత్తం 13ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వలంటీర్లను ఏర్పాటు చేశాం. వలంటీర్ల ద్వారా చదువుకు ఆటంకం లేకుండ చూస్తాం. ఆకునెల్లికుదురు గ్రామానికి తాత్కాలికంగా ఉపాధ్కాయుడిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయం ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. – డా.చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈఓ -
ఇంటర్వ్యూ రద్దుపై మిశ్రమ స్పందన
దిగువ స్థాయి ఉద్యోగాలపై కేంద్రానికి రాష్ట్రాల వివరణ సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కింది స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు స్వస్తి పలకాలన్న కేంద్ర ప్రతిపాదనకు మిశ్రమ స్పందన లభిస్తోంది. జనవరి నుంచి జరిగే నియామకాల్లో ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించొద్దని కేంద్ర సిబ్బంది,పెన్షన్ల శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలకు ఆదేశాలు జారీచేయడం తెలిసిందే. రాష్ట్రాలు సైతం ఇదే పాటించాలని రాష్ట్రాల సీఎంలకు కేంద్రం లేఖలు రాసింది. దీనిపై ఇటీవల కేంద్ర సిబ్బంది,పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఒక వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసి రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించింది. వర్క్‌షాప్‌కు హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని చెప్పారు. గ్రూప్ సీ, గ్రూప్ బీ పోస్ట్‌లకు మానేసే ప్రతిపాదన ఉందని హిమాచల్ ప్రదేశ్ పేర్కొంది. కొన్ని మంత్రిత్వ శాఖలలో ఈ విధానం కొనసాగుతోందని పంజాబ్ తెలిపింది. విద్యా శాఖలో ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని, ఆరోగ్య శాఖ లో ఈ విధానం అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మణిపూర్ తెలిపింది. రాష్ట్రంలో కొన్ని పోస్ట్‌లకు మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహించడంలేదని రాజస్ధాన్ పేర్కొంది. నియామకాల ప్రక్రియలో 61 శాతం మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని మహారాష్ట్ర వెల్లడించింది. గ్రూప్ డీ పోస్ట్‌లకు ఇంటర్వ్యూలు లేవని హర్యానా తెలిపింది. నియామకాల ప్రక్రియలో 85 శాతం ఇంటర్వ్యూలు లేవని తమిళనాడు పేర్కొంది. గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్ట్‌లకు ఇంటర్వ్యూలు లేవని జార్ఖండ్, ఉత్తరాఖండ్, కేరళ పేర్కొన్నాయి. టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలు లేవని యూపీ తెలిపింది. గ్రూప్ సీ, డీ, నాన్ గెజిటెడ్ గ్రూప్ బీ పోస్ట్‌లకు ఇంటర్వ్యూలు ఉండబోవని నోటిఫికేషన్ జారీ చేస్తామని పుదుచ్చెరి తెలిపింది. -
టీచర్ పోస్టుల్లో మిగిలేవెన్ని?
* డీఎస్సీ ప్రకటన నాటికి తగ్గిపోనున్న ఉపాధ్యాయ ఖాళీలు * గత డీఎస్సీల్లో నష్టపోయిన వారు 6,907 మంది * వీరిని తాత్కాలికంగా నియమించినా తగ్గనున్న ఖాళీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు సుమారు 10,961... విద్యాశాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం గత డీఎస్సీల్లో నష్టపోయిన అభ్యర్థుల సంఖ్య 6,907.. మరి ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఎన్నింటిలో గత డీఎస్సీల్లో నష్టపోయినవారిని నియమిస్తారు, మరెన్ని పోస్టులకు కొత్త డీఎస్సీ నిర్వహిస్తారన్నది గందరగోళంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు వివిధ డీఎస్సీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం వివిధ కోణాల్లో పరిశీలన జరుపుతోంది. వారిని కన్సాలిడేటెడ్ పేతో తాత్కాలిక పద్ధతిన నియమించాలన్న అంశంపై ఆలోచనలు చేస్తోంది. దీంతో ఖాళీగా ఉన్న పోస్టుల్లో సగానికిపైగా వారితో తాత్కాలికంగా భర్తీ చేస్తే.. డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు మిగిలే పోస్టులు ఎన్ని? అన్న ఆందోళన దాదాపు 5 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థుల్లో నెలకొంది. వారు ఇప్పటికే తమ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి.. ఎన్ని పోస్టులు తగ్గుతాయి, ఎన్ని పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారన్న లెక్కలు వేసుకుంటున్నారు. అయితే గత డీఎస్సీల్లో నష్టపోయామంటున్న అందరికీ న్యాయం చేసే చర్యలు చేపడతారా, లేదా అభ్యర్థి వారీగా పరిశీలన జరిపి వాస్తవంగా నష్టం జరిగినట్లు తేలితే కన్సాలిడేటెడ్ పేతో నియమిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ పాత డీఎస్సీల్లో నష్టపోయిన వారందరినీ తాత్కాలిక పద్ధతిన తీసుకుంటే.. కొత్త డీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్య భారీగా తగ్గిపోతుందన్న ఆందోళన నెలకొంది. -
జంబో డీఎస్సీ లేనట్లే..!
పరిమితంగానే ఖాళీల భర్తీ 8 వేల పోస్టులకే నోటిఫికేషన్? 5 వేల స్కూల్ అసిస్టెంట్, 3 వేల ఎస్జీటీ పోస్టుల భర్తీకే చాన్స్ హైదరాబాద్: రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా భారీగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న 3.5 లక్షల మంది నిరుద్యోగులకు నిరాశ తప్పేలా లేదు. వచ్చే డీఎస్సీలో మొత్తంగా 5 వేల వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, మరో 3 వేల వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులను మాత్రమే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల చేపట్టిన హేతుబద్ధీకరణలో (రేషనలైజేషన్) విద్యాశాఖ ఈ లెక్కలు తేల్చింది. నివాస ప్రాంతాల్లోని కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని ప్రస్తుతం చేపట్టలేదు. అది కూడా చేపడితే ఇక భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టుల అవసరం పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు జిల్లాలు మినహా మిగతా ఆరు జిల్లాల్లో ఎస్జీటీ పోస్టులే వచ్చే పరిస్థితి లేదు. ఆరు జిల్లాల్లో ఇప్పటికే ఎస్జీటీ పోస్టులు మిగులుగానే ఉన్నాయి. ఫలితంగా ఎస్జీటీ పోస్టులు భారీగా వస్తాయని ఎదురుచూస్తున్న డీఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనయ్యే పరిస్థితి నెలకొంది. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా పరిమితంగానే వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో దాదాపు 17 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గతంలో విద్యాశాఖ లెక్కలు తేల్చినా వాటిల్లో చాలా పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో త్వరలో డీఎస్సీ వస్తుందని, కనీసం 12 వేల వరకు పోస్టులను భర్తీ చేస్తారన్న ఆశతో ఇప్పటికే కోచింగ్‌లలో చేరిన నిరుద్యోగులకు నిరాశ తప్పేలా లేదు. ఒక్కో జిల్లాలో మిగులు పోస్టులు పోగా ఖాళీగా ఉండే ఎస్జీటీ పోస్టులు నోటిఫికేషన్ నాటికి రెండంకెలకు మించి ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలవారీగా ఖాళీలు ఇవీ... హేతుబద్ధీకరణ తరువాత ఆదిలాబాద్ జిల్లాలో 551 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉండగా మెదక్ జిల్లాలో 458 పోస్టులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 931 పోస్టులు, రంగారెడ్డి జిల్లాలో 1,894 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా దాదాపు 4 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో ఎస్జీటీ పోస్టులకు 75 శాతం ఖాళీ ఉండగా, 25 శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు మిగతా ఆరు జిల్లాల్లో ప్రస్తుతం సర్దుబాటు చేయగా ఎక్కువ మొత్తంలో ఎస్జీటీ పోస్టులు, కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లు లెక్కలు తేల్చారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో 623, నల్లగొండ జిల్లాలో 848, హైదరాబాద్‌లో 909, ఖమ్మంలో 450, వరంగల్‌లో 440, కరీంనగర్ జిల్లాలో 826 పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లు సమాచారం. ఈ జిల్లాల్లో నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఎస్జీటీ పోస్టుల అవసరం రెండంకెలకు మించి ఉండకపోవచ్చని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. -
ఈ ఏడాది డీఎస్సీ డౌటే..!
పాఠశాలల విలీనంతో టీచర్లు మిగిలిపోయే అవకాశం ఇప్పటికే 10 వేల మంది వరకూ అదనంగా ఉన్నారంటున్న ప్రభుత్వ వర్గాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ ఈ ఏడాదికి లేనట్లే కనిపిస్తోంది. పాఠశాలల్లో భారీగానే ఖాళీ పోస్టులున్నా... ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ తర్వాత అవేమీ మిగిలే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి చూస్తే... ఇప్పటికే దాదాపు 10 వేల మంది వరకూ టీచర్లు అదనంగా ఉన్నారని అధికారవర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. మంజూరైన పోస్టుల సంఖ్య లెక్కన రాష్ట్రంలో 24,861 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా... వేసవి సెలవుల్లో చేపట్టనున్న టీచర్ల హేతుబద్ధీకరణ తర్వాతే అసలు సంఖ్య వెల్లడికానుంది. మరోవైపు 2016-17 విద్యా సంవత్సరం నుంచి ‘కేజీ టు పీజీ’ అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది అమల్లోకి వస్తే వచ్చే ఏడాది భారీ సంఖ్యలో టీచర్ నియామకాలను చేపట్టే అవకాశం ఉంది. ఈ వేసవిలోనే: వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు (రేషనలైజేషన్) రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 19 కంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లను మరో పాఠశాలలో విలీనం చేసే అవకాశం ఉంది. 75 మంది కంటే తక్కువ మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలను కూడా సమీపంలోని స్కూళ్లలో విలీనం చేసే అవకాశముంది. ఇలా పాఠశాలల విలీనం ద్వారా దాదాపు 8 వేల నుంచి 10 వేల మంది ఉపాధ్యాయులు మిగిలిపోయే అవకాశముంటుంది. అందులో ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్, పండిట్ పోస్టులే ఉండనున్నాయి. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల విషయంలో చూస్తే నాలుగు జిల్లాల్లో 2,823 మందిని అదనంగా నియమించాల్సిన అవసరం ఉండగా... మిగతా ఆరు జిల్లాల్లో 6,017 పోస్టులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. ‘కేజీ టు పీజీ’కి సర్దుబాటు.. ‘కేజీ టు పీజీ’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒకటి చొప్పున మూడు నుంచి నాలుగు వేల మంది విద్యార్థులకు నివాస వసతితో కూడిన గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వీటిని ఇంగ్లిష్ మీడియంలో నడపనున్నారు. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణ అనంతరం మిగిలే టీచర్లను వారి అర్హతలను బట్టి ‘కేజీ టు పీజీ’ స్కూళ్లలోకి సర్దుబాటు చేయాలన్న యోచన ఉన్నట్లు తెలుస్తోంది. 2016-17 విద్యా సంవత్సరంలో వీటిని ప్రారంభించాలని నిర్ణయించినందున... అప్పటివరకు కొత్తగా ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉండదు. 2016 జూన్‌లో ఈ ‘కేజీ టు పీజీ’ పాఠశాలలను ప్రారంభించేలా చర్యలు చేపడితే మాత్రం... ఈ ఏడాది చివరన లేదా వచ్చే ఏడాది మొదట్లో ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది. అది కూడా హేతుబద్ధీకరణలో మిగిలే టీచర్లను సర్దుబాటు చేసిన తర్వాత అవసరమైన మేరకే నియామకాలు చేపడతారు. దీంతో ఈ ఏడాదికి మాత్రం డీఎస్సీ నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. అయితే ‘కేజీ టు పీజీ’ పాఠశాలలకు మాత్రం భారీ సంఖ్యలోనే ఉపాధ్యాయులు అవసరమవుతారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఒక్కో పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థులకు బోధించేందుకు 34 పోస్టులు అవసరమని అంచనా. మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసే ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను మూడు నుంచి నాలుగు వేల వరకూ పెంచే యోచన ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలోని 445 మండలాల్లో వీటిని ఏర్పాటు చేస్తే... ఒక్కో పాఠశాలలో దాదాపు వంద మంది చొప్పున మొత్తంగా 44,500 వరకు ఉపాధ్యాయులు అవసరమవుతారు. ఈ లెక్కన హేతుబద్ధీకరణ అనంతరం మిగిలే దాదాపు పదివేల మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినా... భారీ సంఖ్యలో మిగిలే పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. డీఎస్సీ-98 అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చేలా చర్యలు అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం డీఎస్సీ-1998లో అన్యాయానికి గురై, కోర్టుల చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులకు ఉద్యోగం ఇచ్చే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వరంగల్ పర్యటనలోనూ సీఎం డీఎస్సీ-98 అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ‘కేజీ టు పీజీ’పై నిర్వహించిన సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. డీఎస్సీల వారీగా అన్యాయానికి గురైన అభ్యర్థులకు న్యాయం చేసే దిశగా పరిశీలన జరపాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న టీచర్ నియామకాల కేసులపై సమీక్షించారు.