- పాఠశాలల విలీనంతో టీచర్లు మిగిలిపోయే అవకాశం
- ఇప్పటికే 10 వేల మంది వరకూ అదనంగా ఉన్నారంటున్న ప్రభుత్వ వర్గాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ ఈ ఏడాదికి లేనట్లే కనిపిస్తోంది. పాఠశాలల్లో భారీగానే ఖాళీ పోస్టులున్నా... ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ తర్వాత అవేమీ మిగిలే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి చూస్తే... ఇప్పటికే దాదాపు 10 వేల మంది వరకూ టీచర్లు అదనంగా ఉన్నారని అధికారవర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. మంజూరైన పోస్టుల సంఖ్య లెక్కన రాష్ట్రంలో 24,861 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా... వేసవి సెలవుల్లో చేపట్టనున్న టీచర్ల హేతుబద్ధీకరణ తర్వాతే అసలు సంఖ్య వెల్లడికానుంది. మరోవైపు 2016-17 విద్యా సంవత్సరం నుంచి ‘కేజీ టు పీజీ’ అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది అమల్లోకి వస్తే వచ్చే ఏడాది భారీ సంఖ్యలో టీచర్ నియామకాలను చేపట్టే అవకాశం ఉంది.
ఈ వేసవిలోనే: వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు (రేషనలైజేషన్) రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 19 కంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లను మరో పాఠశాలలో విలీనం చేసే అవకాశం ఉంది. 75 మంది కంటే తక్కువ మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలను కూడా సమీపంలోని స్కూళ్లలో విలీనం చేసే అవకాశముంది.
ఇలా పాఠశాలల విలీనం ద్వారా దాదాపు 8 వేల నుంచి 10 వేల మంది ఉపాధ్యాయులు మిగిలిపోయే అవకాశముంటుంది. అందులో ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్, పండిట్ పోస్టులే ఉండనున్నాయి. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల విషయంలో చూస్తే నాలుగు జిల్లాల్లో 2,823 మందిని అదనంగా నియమించాల్సిన అవసరం ఉండగా... మిగతా ఆరు జిల్లాల్లో 6,017 పోస్టులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు.
‘కేజీ టు పీజీ’కి సర్దుబాటు..
‘కేజీ టు పీజీ’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒకటి చొప్పున మూడు నుంచి నాలుగు వేల మంది విద్యార్థులకు నివాస వసతితో కూడిన గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వీటిని ఇంగ్లిష్ మీడియంలో నడపనున్నారు. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణ అనంతరం మిగిలే టీచర్లను వారి అర్హతలను బట్టి ‘కేజీ టు పీజీ’ స్కూళ్లలోకి సర్దుబాటు చేయాలన్న యోచన ఉన్నట్లు తెలుస్తోంది.
2016-17 విద్యా సంవత్సరంలో వీటిని ప్రారంభించాలని నిర్ణయించినందున... అప్పటివరకు కొత్తగా ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉండదు. 2016 జూన్‌లో ఈ ‘కేజీ టు పీజీ’ పాఠశాలలను ప్రారంభించేలా చర్యలు చేపడితే మాత్రం... ఈ ఏడాది చివరన లేదా వచ్చే ఏడాది మొదట్లో ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది. అది కూడా హేతుబద్ధీకరణలో మిగిలే టీచర్లను సర్దుబాటు చేసిన తర్వాత అవసరమైన మేరకే నియామకాలు చేపడతారు.
దీంతో ఈ ఏడాదికి మాత్రం డీఎస్సీ నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. అయితే ‘కేజీ టు పీజీ’ పాఠశాలలకు మాత్రం భారీ సంఖ్యలోనే ఉపాధ్యాయులు అవసరమవుతారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఒక్కో పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థులకు బోధించేందుకు 34 పోస్టులు అవసరమని అంచనా. మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసే ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను మూడు నుంచి నాలుగు వేల వరకూ పెంచే యోచన ఉంది.
ఈ లెక్కన రాష్ట్రంలోని 445 మండలాల్లో వీటిని ఏర్పాటు చేస్తే... ఒక్కో పాఠశాలలో దాదాపు వంద మంది చొప్పున మొత్తంగా 44,500 వరకు ఉపాధ్యాయులు అవసరమవుతారు. ఈ లెక్కన హేతుబద్ధీకరణ అనంతరం మిగిలే దాదాపు పదివేల మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినా... భారీ సంఖ్యలో మిగిలే పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది.
డీఎస్సీ-98 అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చేలా చర్యలు
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
డీఎస్సీ-1998లో అన్యాయానికి గురై, కోర్టుల చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులకు ఉద్యోగం ఇచ్చే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వరంగల్ పర్యటనలోనూ సీఎం డీఎస్సీ-98 అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ‘కేజీ టు పీజీ’పై నిర్వహించిన సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. డీఎస్సీల వారీగా అన్యాయానికి గురైన అభ్యర్థులకు న్యాయం చేసే దిశగా పరిశీలన జరపాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న టీచర్ నియామకాల కేసులపై సమీక్షించారు.