డీఈడీ జోరులో బీఈడీ బేజారు | students are intrested on DED | Sakshi
Sakshi News home page

డీఈడీ జోరులో బీఈడీ బేజారు

Published Sun, Jun 22 2014 2:10 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

students are intrested on DED

బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ)కు క్రమంగా ఆదరణ తగ్గిపోతోంది. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టుకు బీఈడీ అభ్యర్థులు అర్హులు కాదని రెండేళ్ల క్రితం కోర్టు తేల్చినప్పటినుంచి కళాశాలల్లో ఏటా విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. గతేడాది ఏకంగా 103 సీట్లు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
 
నిజామాబాద్‌అర్బన్ :  బీఈడీ కోర్సుకు ఒకప్పుడు చాలా డిమాండ్ ఉండేది. పోటీ తీవ్రంగా ఉండేది. మన రాష్ట్రంలో సీటు లభించనివారు ఇతర రాష్ట్రాలకు వెళ్లి లక్షల్లో ఫీజులు చెల్లించి బీఈడీ చదివేవారు. రాష్ట్రంలోనూ మేనేజ్‌మెంట్ కోటా కింద సీటు కోసం లక్ష రూపాయల వరకు వెచ్చించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఈ కోర్సును ఎంచుకునే వారి సంఖ్య పడిపోతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం రెండేళ్ల పాటు ఉపాధ్యాయ శిక్షణపొందిన(డీఈడీ)వారే ఎస్జీటీ పోస్టులకు అర్హులని సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం తేల్చి చెప్పినప్పటినుంచి బీఈడీ కళాశాలలు వెలవెలపోతున్నాయి. ఈ ఏడాది బీఈడీ ఎంట్రెన్స్ పరీక్ష ఏడున్నర వేల మంది రాయగా.. డీఈడీ 26 వేల మంది రాయడం కోర్సుల డిమాండ్‌ను తెలియజేస్తోంది.
 
1,100 సీట్లు..
జిల్లాలో 11 బీఈడీ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో వంద చొప్పున సీట్లున్నాయి. ఇందులో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద, 30 శాతం సీట్లను మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. గతంలో మేనేజ్‌మెంట్ సీట్లకోసం కూడా తీవ్ర పోటీ ఉండేది. కౌన్సెలింగ్ పూర్తి కాకముందే మేనేజ్‌మెంట్ కోటా సీట్లు అయిపోయేవి. లక్ష రూపాయలకుపైగా చెల్లించి సీటు పొందేవారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులన్న కోర్టు తీర్పు కారణంగా ఈ సీట్లు భర్తీ కావడం గగనంగా మారింది. మైనారిటీ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి. సీట్లు భర్తీ కావడం కోసం యాజమాన్యాలు నానా పాట్లు పడుతున్నాయి.
 
ఉన్నత విద్యాశాఖ కన్వీనర్‌తో మాట్లాడి పలుమార్లు ప్రవేశాల గడువును పొడిగించుకుంటున్నా ప్రయోజనం ఉండడం లేదు. కన్వీనర్ కోటా కింద రూ. 16,500 ఫీజు వసూలు చేస్తారు. అదే రేటుకు మేనేజ్‌మెంట్ సీటు ఇస్తామన్నా కొన్ని సీట్లు మిగిలిపోతుండడం గమనార్హం. 2013-14 విద్యాసంవత్సరంలో జిల్లాలోని బీఈడీ కళాశాలల్లో 103 సీట్లు మిగిలిపోయాయి. ఇలా సీట్లు మిగిలిపోవడానికి బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత లేకపోవడంతోపాటు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ) పోస్టులు చాలా తక్కువగా ఉండడమూ కారణమే. 2012 డీఎస్సీలో జిల్లాలో 71 ఎస్‌ఏ పోస్టులను భర్తీ చేయగా 1,100 వరకు ఎస్జీటీ పోస్టులను భర్తీ చేశారు. ఎస్జీటీ పోస్టులకు పోటీ లేకపోగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వేలాది మంది పోటీ పడ్డారు.
 
డీఈడీకి పెరుగుతున్న ఆదరణ
ఓవైపు బీఈడీ కళ తప్పుతుండగా మరోవైపు డీఈడీకి ఏటా ఆదరణ పెరుగుతోంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డైట్ కళాశాల ఒక్కటి మాత్రమే ఉంది. ఏడు ప్రైవేట్ కళాశాలలున్నాయి. ప్రతి ప్రైవేట్ కళాశాలలో 50 చొప్పున సీట్లున్నాయి. ఇందులో 40 సీట్లను కౌన్సెలింగ్ ద్వారా, మిగిలిన పది సీట్లను మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. రెండేళ్లుగా ఈ కోర్సుకు డిమాండ్ బాగా పెరిగింది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డీఈడీ అభ్యర్థులే అర్హులని కోర్టు తీర్పు ఇవ్వడం, పోస్టులు ఎక్కువ, పోటీ తక్కువ ఉండడంతో విద్యార్థులు ఈ కోర్సువైపు ఆసక్తి చూపుతున్నారు.

డీఈడీకి పోటీ పెరుగుతోంది
ఎస్జీటీ పోస్టులకు డీఈడీ చేసినవారే అర్హులని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ కోర్సుకు డిమాండ్ పెరిగింది. ఎస్‌ఏ పోస్టులకన్నా ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా భర్తీ చేస్తుండడమూ ఈ కోర్సుకు డిమాండ్ పెరగడానికి కారణమే.
 - థామసయ్య, ప్రిన్సిపాల్, ఇందూరు బీఈడీ, డీఈడీ కళాశాల, బోధన్
 
ఎస్‌ఏ పోస్టులు పెంచాలి
 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉన్నాయి. బీఈడీ పూర్తి చేసినవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ కోర్సు చేసినవారు చాలా మంది నిరుద్యోగులుగా ఉండిపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి ఎస్‌ఏ పోస్టులు పెంచాలి.
- వెనిగల్ల సురేశ్, జిల్లా అధ్యక్షుడు,బీఈడీ టీచర్స్ అసోసియేషన్ ఇందూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement