BED Course
-
నేడు తెలంగాణ ఎడ్‌సెట్
నల్లగొండ రూరల్: రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకోసం గురువారం నిర్వహించే తెలంగాణ ఎడ్‌సెట్–2024కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎడ్‌సెట్ కన్వినర్ ఆచార్య తాళ్ల మృణాళిని తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని తెలిపారు. మొదటి సెషన్లో 16,929 మంది, రెండో సెషన్లో 16,950 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 79 పరీక్ష కేంద్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్, విజయవాడ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://edcet.tsche.ac.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మొదటి సెషన్ పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకల్లా, రెండో సెషన్ పరీక్షకు హాజరయ్యేవారు మధ్యాహ్నం 12:30 కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.ఉదయం పరీక్ష కేంద్రాలకు 10 గంటల తర్వాత, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోరని తెలియజేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రెండోసారి ఎడ్‌సెట్ నిర్వహిస్తున్నట్లు ఎడ్‌సెట్ చైర్మన్ ఆచార్య గోపాల్‌రెడ్డి తెలిపారు. -
నాలుగేళ్లలోనే డిగ్రీ+బీఈడీ
సాక్షి, అమరావతి: సైన్సు, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇప్పుడు బోధన రంగంలోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఈడీ కోర్సు స్థానంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ–బీఈడీ, బీఏ–బీఈడీ కోర్సులను దేశంలో 42 ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు ప్రారంభించాయి. మనరాష్ట్రంలో శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గత నెలలో నిర్వహించిన జాతీయ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–(ఎన్సెట్)–2023కు 16,004 మంది దరఖాస్తు చేసుకోగా 10,136 మంది పరీక్షకు హాజరయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడించి, ఈ నెలలో ప్రవేశ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రకారం.. ఫౌండేషన్(1 నుంచి 2 తరగతులు), ప్రిపరేటరీ (3–5), మిడిల్ స్టేజ్ (6–8), సెకండరీ స్టేజ్ (9–12 తరగతులు)కు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులను అందిస్తున్నారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సెకండరీ స్టేజ్ (9 నుంచి 12వ తరగతి)కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ప్రవేశపెట్టారు. ఇంటిగ్రేటెడ్ బీఈడీతో ఉన్నత అవకాశాలు ఎన్టీఏ నిర్వహించిన ఎన్సెట్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు మూడేళ్ల తర్వాత నాలుగో ఏడాది చదవడం ఇష్టం లేకపోతే కోర్సు నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఇలాంటి వారికి మూడేళ్ల డిగ్రీ పట్టాను అందిస్తారు. నాలుగేళ్ల కోర్సు పూర్తి చేస్తే పీజీ కోర్సులు చదువుకోవచ్చు. బోధన రంగాన్ని ఎంచుకునేవారికి మంచి అవకాశాలు.. శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ–బీఈడీ, బీఏ–బీఈడీల్లో 50 చొప్పున సీట్లు ఉన్నాయి. బీఎస్సీ–బీఈడీకి 1,988 మంది, బీఏ–బీఈడీకి 1,020 మంది దరఖాస్తు చేసుకున్నారు. బోధనకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ పోస్టులను కూడా మంజూరు చేసింది. నైపుణ్యం గల టీచింగ్ ఫ్యాకల్టీకి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. ఇప్పటివరకు ఉపాధి కోర్సుగా మాత్రమే ఉన్న బీఈడీ కోర్సు బోధన రంగాన్ని ప్రొఫెషన్‌గా తీసుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తుంది. – ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు, వైస్ చాన్సలర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ -
నాలుగేళ్ల బీఈడీ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: సమీకృత బీఈడీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభం కానున్నాయి. ఇంటర్ తర్వాత ఒకే సమయంలో డిగ్రీ, బీఈడీ కలిపి పూర్తి చేయవచ్చు. ఈ కోర్సు కాలపరిమితి నాలుగేళ్లు ఉంటుంది. సాధారణంగా బీఈడీ చేయాలంటే మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసి, రెండేళ్ల బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలి. దీనికి మొత్తం ఐదేళ్లు పడుతుంది. కొత్త విధానం వల్ల నాలుగేళ్లలోనే పూర్తి చేసే వీలుంది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా తీసుకొచ్చిన ఈ కోర్సును జాతీయ స్థాయిలో పలు కళాశాలల్లో ప్రవేశపెడుతున్నారు. వీటిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం అర్ధరాత్రి ఎన్టీఏ విడుదల చేసింది. తెలంగాణలో మూడు విద్యా సంస్థలకు నాలుగేళ్ల బీఈడీ కోర్సు నిర్వహించేందుకు అనుమతి లభించింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, వరంగల్ ఎన్ఐటీ, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో 250 సీట్లు ఉంటాయి. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాయవచ్చని ఎన్టీఏ పేర్కొంది. ఆధునిక విద్యా బోధనకు అనుగుణంగా సమీకృత బీఈడీ కోర్సును ఎన్సీఈఆర్టీ రూపొందించింది. విద్యార్థి మానసిక ధోరణి, ఆన్లైన్, డిజిటల్ విద్యా బోధనతో పాటు సరికొత్త మెలకువలతో ఎలా బోధించాలన్న అంశానికి ఈ కోర్సులో అత్యధిక ప్రాధాన్యమిస్తారు. తరగతి గదిలో పాఠాల కన్నా, అనుభవం ద్వారా నేర్చుకునే రీతిలో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రవేశ పరీక్ష ఇలా.. ఇంటర్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు ఈ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. పన్నెండో తరగతి, ఇంటర్ సిలబస్‌లోంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 160 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎన్సీఈఆర్టీ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది. తెలంగాణలో మూడు కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీకి అనుమతించారు. వీటిలో మొత్తం 250 సీట్లు ఉన్నట్టు ఎన్టీఏ తెలిపింది. -
ఆగస్టు 1 నుంచి బీఈడీ దూరవిద్య పరీక్షలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానంలో బీఈడీ అభ్యసిస్తున్న (ఇన్ సర్వీస్ టీచర్ ) విద్యార్థులకు ఆగష్టు 1 నుంచి దూరవిద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను పరీక్షల విభాగం అధికారులు ఖరారు చేశారు. ఆగస్టు 1న ఫండమెంటల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, 2న సైకాలజీ టీచింగ్ అండ్ లర్నింగ్, 03న స్కూల్ మేనేజ్మెంట్ , 04న ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, 05న టీచింగ్ మెథడ్స్–1, 06న టీచింగ్ మెథడ్స్–2, 07న మెథడ్స్ ఆఫ్ టీచింగ్ 1,2 (ఫిజికల్ సైన్సెస్) సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి. -
ఎడ్యు న్యూస్
దూరవిద్యలో బీఈడీ కోర్సు 2016 విద్యా సంవత్సరం నుంచి అన్ని వర్సిటీల్లో దూరవిద్య ద్వారా బీఈడీ, ఎంఈడీలను కొత్త సిలబస్, నిబంధనలతో పునఃప్రారంభించడానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) ఆమోదం తెలిపింది. గతేడాది దూరవిద్య విధానాన్ని ఎన్సీటీఈ తాత్కాలికంగా నిలిపివేసింది. 2015 ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం దూరవిద్యలో బీఈడీ చదవాలంటే రెండేళ్ల బోధన అనుభవం ఉండాలి. -
మే 23న ఏపీ ఎడ్‌సెట్
దరఖాస్తుకు ఈనెల 23 చివరి తేదీ తిరుపతి సిటీ: శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్‌సెట్-2016ను మే 23వ తేదీన నిర్వహించనున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ టి.కుమారస్వామి తెలిపారు. సోమవారం ఆయన తిరుపతిలోని ఎస్వీయూ ఎడ్‌సెట్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు బీఏ/బీఎస్సీ/బీకాం/బీసీఏ/బీఈ/బీటెక్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించినవారు, ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు ఎడ్‌సెట్ రాసేందుకు అర్హులని పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరి వారికి 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం ఉత్తీర్ణత మార్కులు ఉండాలని పేర్కొన్నారు. అయితే డీగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు ఈ ఏడాది జూన్ , జూలైల్లో నిర్వహించనున్న కౌన్సెలింగ్ నాటికి ఓరిజనల్ సర్టిఫికెట్లను చూపాల్సి ఉంటుందని తెలిపారు. పరీక్ష కోసం ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పారు. ఏపీ ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేయాల్సి వుంటుందన్నారు. అప్లికేషన్ ఫీజు ఓసీ/బీసీలకు రూ. 400, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈనెల 23వ తేదీ వరకు ఆన్లైన్లో ధరఖాస్తులు స్వీకరిస్తామని, రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో వుంటుందని, తెలుగు, ఉర్దూ మీడియంలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు కుమారస్వామి తెలిపారు. -
నేటి నుంచి ‘బీఈడీ’సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణా కోర్సు బీఈడీ ప్రవేశాలలో 2015-16 విద్యా సంవత్సరానికి సోషల్ స్టడీస్ మెథడాలజీ విద్యార్థులకు సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని టీఎస్ఎడ్సెట్ కన్వీనర్ ప్రొ.పి.ప్రసాద్ ఓ ప్రకనటనలో తెలి పారు. దీనికోసం జంటనగరాలలో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పూర్తి వివరాల కోసం టీఎస్ఎడ్సెట్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. -
ఇక ఇంటర్నల్స్ !
►డీఎడ్, బీఎడ్‌లో భారీగా సంస్కరణలు ► ప్రతి సబ్జెక్ట్‌లో 70 మార్కులకే రాత పరీక్ష, 30 మార్కులు ఇంటర్నల్స్కే ►డిగ్రీలో 50 శాతం మార్కులుంటేనే బీఎడ్‌లో ప్రవేశం ►ఇంటర్ తర్వాత నాలుగేళ్ల బీఎడ్ కోర్సుపైనా కసరత్తు ►ఈనెల 26న ఉత్తరాది రాష్ట్రాలతో ఎన్సీటీఈ సమావేశం ►కొత్త మార్పులు 2015 నుంచి అమలు ? సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణ కోర్సుల్లో భారీగా సంస్కరణలు రాబోతున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎంఎడ్)లో సమూల మార్పులకు, భారీ సంస్కరణలకు జాతీయ ఉపాధ్యాయ విద్యాశిక్షణ మండలి (ఎన్సీటీఈ) శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఏడాది కాల పరిమితి కలిగిన బీఎడ్, ఎంఎడ్ కోర్సులను రెండేళ్ల కోర్సులుగా మార్చబోతోంది. ఇంటర్మీడియెట్తోనూ రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, నాలుగేళ్ల బీఎడ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. అంతేకాక పరీక్షల విధానంలోనూ మార్పులు తెస్తోంది. ఇకపై ఇంటర్నల్స్‌కు కూడా మార్కులను కేటాయిస్తారు. బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో ప్రతి సబ్జెక్టులో 30 శాతం మార్కులను ఇంటర్నల్స్‌కు ఇవ్వనుండగా, 70 శాతం మార్కులకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఉపాధ్యాయ శిక్షణలో నాణ్యత పెంచేందుకు జస్టిస్ వర్మ కమిటీ చేసిన సిఫారసుల అమలులో భాగంగా 2015లో ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయ శిక్షణలో సంస్కరణలపై ఈనెల 26న బెంగళూరులో ఉత్తరాది రాష్ట్రాలతో ఎన్సీటీఈ ఒక సమావేశం నిర్వహిస్తోంది. ఇవీ మార్పులు.. - బీఎడ్, ఎంఎడ్‌ను రెండేళ్ల కోర్సుగా చేస్తారు. - ప్రస్తుతం జనరల్ అభ్యర్థులకు డిగ్రీ కోర్సులో 50 శాతం, బీసీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే బీఎడ్‌లో చేరవచ్చు. ఇకపై ఎవరికైనా 50 శాతం మార్కులు రావాల్సిందే. - ప్రవేశ పరీక్షలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది. - విద్యార్థులకు, అధ్యాపకులకు 80 శాతం హాజరు ఉండాలి. టీచింగ్ ప్రాక్టీస్‌కు 90 శాతం హాజరుండాలి. - ప్రస్తుతం 40 రోజులు మాత్రమే ఉన్న స్కూల్ ఇంటర్న్‌షిప్‌ను (టీచింగ్ ప్రాక్టీస్) 16 వారాలకు పెంచుతారు. ప్రథమ సంవత్సరంలో 4 వారాలు, ద్వితీయ సంవత్సరంలో 12 వారాలు ఉంటుంది. మొదటి సంవత్సరంలో ఒకవారం విద్యా బోధన, మరోవారం కమ్యూనిటీ అనుభవాలు, రెండు వారాలు టీచింగ్ ప్లానింగ్‌కు కేటాయిస్తారు. మిగతా వారాలు ప్రాజెక్టు వర్కులు ఉంటాయి. - కంటిన్యూస్ ఇంటర్నల్ అసెస్మెంట్ (సీఐఏ) ఉంటుంది. ఇందులో విద్యార్థులకు గ్రేడ్స్/మార్క్స్ ఉంటాయి. వీటికి 30 శాతం మార్కులు ఉంటాయి. మిగతా 70 శాతం మార్కులు రాత పరీక్షకు ఉంటాయి. - నాలుగేళ్ల బీఎడ్ ఇంటిగ్రేటెడ్ కోర్సుకు ఎన్సీటీఈ యోచిస్తోందని, దీనిని ఐదేళ్లకు పెంచాలని ప్రొఫెసర్ గంటా రమేశ్, ప్రైవేట్ బీఎడ్ కాలేజెస్ అసోసియేషన్‌కు చెందిన తాళ్ల మల్లేశం సూచిస్తున్నారు. -
డీఈడీ జోరులో బీఈడీ బేజారు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ)కు క్రమంగా ఆదరణ తగ్గిపోతోంది. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టుకు బీఈడీ అభ్యర్థులు అర్హులు కాదని రెండేళ్ల క్రితం కోర్టు తేల్చినప్పటినుంచి కళాశాలల్లో ఏటా విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. గతేడాది ఏకంగా 103 సీట్లు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజామాబాద్‌అర్బన్ : బీఈడీ కోర్సుకు ఒకప్పుడు చాలా డిమాండ్ ఉండేది. పోటీ తీవ్రంగా ఉండేది. మన రాష్ట్రంలో సీటు లభించనివారు ఇతర రాష్ట్రాలకు వెళ్లి లక్షల్లో ఫీజులు చెల్లించి బీఈడీ చదివేవారు. రాష్ట్రంలోనూ మేనేజ్మెంట్ కోటా కింద సీటు కోసం లక్ష రూపాయల వరకు వెచ్చించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఈ కోర్సును ఎంచుకునే వారి సంఖ్య పడిపోతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం రెండేళ్ల పాటు ఉపాధ్యాయ శిక్షణపొందిన(డీఈడీ)వారే ఎస్జీటీ పోస్టులకు అర్హులని సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం తేల్చి చెప్పినప్పటినుంచి బీఈడీ కళాశాలలు వెలవెలపోతున్నాయి. ఈ ఏడాది బీఈడీ ఎంట్రెన్స్ పరీక్ష ఏడున్నర వేల మంది రాయగా.. డీఈడీ 26 వేల మంది రాయడం కోర్సుల డిమాండ్‌ను తెలియజేస్తోంది. 1,100 సీట్లు.. జిల్లాలో 11 బీఈడీ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో వంద చొప్పున సీట్లున్నాయి. ఇందులో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద, 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. గతంలో మేనేజ్మెంట్ సీట్లకోసం కూడా తీవ్ర పోటీ ఉండేది. కౌన్సెలింగ్ పూర్తి కాకముందే మేనేజ్మెంట్ కోటా సీట్లు అయిపోయేవి. లక్ష రూపాయలకుపైగా చెల్లించి సీటు పొందేవారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులన్న కోర్టు తీర్పు కారణంగా ఈ సీట్లు భర్తీ కావడం గగనంగా మారింది. మైనారిటీ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి. సీట్లు భర్తీ కావడం కోసం యాజమాన్యాలు నానా పాట్లు పడుతున్నాయి. ఉన్నత విద్యాశాఖ కన్వీనర్‌తో మాట్లాడి పలుమార్లు ప్రవేశాల గడువును పొడిగించుకుంటున్నా ప్రయోజనం ఉండడం లేదు. కన్వీనర్ కోటా కింద రూ. 16,500 ఫీజు వసూలు చేస్తారు. అదే రేటుకు మేనేజ్మెంట్ సీటు ఇస్తామన్నా కొన్ని సీట్లు మిగిలిపోతుండడం గమనార్హం. 2013-14 విద్యాసంవత్సరంలో జిల్లాలోని బీఈడీ కళాశాలల్లో 103 సీట్లు మిగిలిపోయాయి. ఇలా సీట్లు మిగిలిపోవడానికి బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత లేకపోవడంతోపాటు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ) పోస్టులు చాలా తక్కువగా ఉండడమూ కారణమే. 2012 డీఎస్సీలో జిల్లాలో 71 ఎస్ఏ పోస్టులను భర్తీ చేయగా 1,100 వరకు ఎస్జీటీ పోస్టులను భర్తీ చేశారు. ఎస్జీటీ పోస్టులకు పోటీ లేకపోగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వేలాది మంది పోటీ పడ్డారు. డీఈడీకి పెరుగుతున్న ఆదరణ ఓవైపు బీఈడీ కళ తప్పుతుండగా మరోవైపు డీఈడీకి ఏటా ఆదరణ పెరుగుతోంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డైట్ కళాశాల ఒక్కటి మాత్రమే ఉంది. ఏడు ప్రైవేట్ కళాశాలలున్నాయి. ప్రతి ప్రైవేట్ కళాశాలలో 50 చొప్పున సీట్లున్నాయి. ఇందులో 40 సీట్లను కౌన్సెలింగ్ ద్వారా, మిగిలిన పది సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. రెండేళ్లుగా ఈ కోర్సుకు డిమాండ్ బాగా పెరిగింది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డీఈడీ అభ్యర్థులే అర్హులని కోర్టు తీర్పు ఇవ్వడం, పోస్టులు ఎక్కువ, పోటీ తక్కువ ఉండడంతో విద్యార్థులు ఈ కోర్సువైపు ఆసక్తి చూపుతున్నారు. డీఈడీకి పోటీ పెరుగుతోంది ఎస్జీటీ పోస్టులకు డీఈడీ చేసినవారే అర్హులని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ కోర్సుకు డిమాండ్ పెరిగింది. ఎస్ఏ పోస్టులకన్నా ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా భర్తీ చేస్తుండడమూ ఈ కోర్సుకు డిమాండ్ పెరగడానికి కారణమే. - థామసయ్య, ప్రిన్సిపాల్, ఇందూరు బీఈడీ, డీఈడీ కళాశాల, బోధన్ ఎస్ఏ పోస్టులు పెంచాలి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉన్నాయి. బీఈడీ పూర్తి చేసినవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ కోర్సు చేసినవారు చాలా మంది నిరుద్యోగులుగా ఉండిపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి ఎస్ఏ పోస్టులు పెంచాలి. - వెనిగల్ల సురేశ్, జిల్లా అధ్యక్షుడు,బీఈడీ టీచర్స్ అసోసియేషన్ ఇందూరు -
నేడు ఎడ్‌సెట్ ఫలితాల విడుదల
విశాఖపట్నం: బీఈడి కోర్సుల్లో ప్రవేశాలకు గతనెల 30న నిర్వహించిన ఎడ్‌సెట్-2014 ఫలితాలను గురువారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏయూలో సాయంత్రం 6.30 గంటలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జి.జగదీష్‌రెడ్డి ర్యాంకులను విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఫలితాలను విద్యార్థులు www.apedcet.org, www.apsche.org, www.andhrauniversity.edu.in వెబ్సైట్ల నుంచి పొందవచ్చని తెలిపారు. ప్రవేశాల కౌన్సెలింగ్ విధివిధానాలను ఉన్నత విద్యామండలి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. -
నేడు ఎడ్‌సెట్
-
నేడు ఎడ్‌సెట్
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్-2014కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో శుక్రవారం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం మొత్తం 2,597 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం నెల్లూరు నగరంలో 2,322 మందికి ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలో వీఆర్ లా కళాశాల, సర్వోదయ కళాశాల, పాత మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న మోడల్ హైస్కూల్, దర్గామిట్టలోని సెయింట్‌జోసఫ్ పాఠశాల, డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. కావలి పట్టణంలోని జవహర్‌భారతి కళాశాల్లో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. ఈ పరీక్షల కోసం జిల్లా స్పెషల్ పరిశీలకురాలిగా తిరుపతి నుంచి ఇందిరాప్రసూన నియమితులయ్యారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంటముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోమని తెలిపారు. -
వెబ్సైట్లో.. ఎడ్‌సెట్ హాల్‌టికెట్లు
30న పరీక్ష... నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నోఎంట్రీ హైదరాబాద్, న్యూస్‌లైన్: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 42 నగరాల్లోని 349 కేంద్రాల్లో ఈ నెల 30న నిర్వహించే ఎడ్‌సెట్-2014 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను వెబ్సైట్లో ఉంచినట్టు కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు బుధవారం తెలిపారు. విద్యార్థులు www.apedcet.org వెబ్సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిర్ణీత సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరుగుతుందని, సమాధానాలను హెచ్‌బీ పెన్సిల్‌తో మాత్రమే గుర్తించాల్సి ఉంటుందని వివరించారు. హాల్‌టికెట్‌పై ఫొటో రాని పక్షంలో విద్యార్థులు తమ వెంట గెజిటెడ్ అధికారి సంతకం చేసిన రెండు ఫోటోలు తీసుకుని రావాలని సూచించారు. ఈదఫా ఎడ్‌సెట్‌కు 1,65,781 మంది దరఖాస్తు చేయగా, ఉర్దూ మాధ్యమం వారికి కర్నూలు, హైదరాబాద్‌లలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తున్నారు. -
నేటితో ముగియనున్న ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్-2014 ప్రవేశ పరీక్షకు రూ. 500 అపరాధ రుసుముతో దరఖాస్తులకు గడువు మంగళవారంతో ముగియనుంది. ఇప్పటివరకు ఎడ్‌సెట్‌కు 1,67,093 దరఖాస్తులు వచ్చాయని, ఆసక్తి ఉన్నవారు మంగళవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రవేశ పరీక్షకు హాజరై, అర్హత సాధించిన వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం అందుతుందని చెప్పారు. ఈ పరీక్ష 30న జరగనుంది. వివరాలకు 83329 48791, 76710 22096 నంబర్లలో సంప్రదించవచ్చు.