ఇక ఇంటర్నల్స్ !
►డీఎడ్, బీఎడ్‌లో భారీగా సంస్కరణలు
► ప్రతి సబ్జెక్ట్‌లో 70 మార్కులకే రాత పరీక్ష, 30 మార్కులు ఇంటర్నల్స్‌కే
►డిగ్రీలో 50 శాతం మార్కులుంటేనే బీఎడ్‌లో ప్రవేశం
►ఇంటర్ తర్వాత నాలుగేళ్ల బీఎడ్ కోర్సుపైనా కసరత్తు
►ఈనెల 26న ఉత్తరాది రాష్ట్రాలతో ఎన్‌సీటీఈ సమావేశం
►కొత్త మార్పులు 2015 నుంచి అమలు ?
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణ కోర్సుల్లో భారీగా సంస్కరణలు రాబోతున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎంఎడ్)లో సమూల మార్పులకు, భారీ సంస్కరణలకు జాతీయ ఉపాధ్యాయ విద్యాశిక్షణ మండలి (ఎన్‌సీటీఈ) శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఏడాది కాల పరిమితి కలిగిన బీఎడ్, ఎంఎడ్ కోర్సులను రెండేళ్ల కోర్సులుగా మార్చబోతోంది. ఇంటర్మీడియెట్‌తోనూ రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, నాలుగేళ్ల బీఎడ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది.
అంతేకాక పరీక్షల విధానంలోనూ మార్పులు తెస్తోంది. ఇకపై ఇంటర్నల్స్‌కు కూడా మార్కులను కేటాయిస్తారు. బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో ప్రతి సబ్జెక్టులో 30 శాతం మార్కులను ఇంటర్నల్స్‌కు ఇవ్వనుండగా, 70 శాతం మార్కులకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఉపాధ్యాయ శిక్షణలో నాణ్యత పెంచేందుకు జస్టిస్ వర్మ కమిటీ చేసిన సిఫారసుల అమలులో భాగంగా 2015లో ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయ శిక్షణలో సంస్కరణలపై ఈనెల 26న బెంగళూరులో ఉత్తరాది రాష్ట్రాలతో ఎన్‌సీటీఈ ఒక సమావేశం నిర్వహిస్తోంది.
ఇవీ మార్పులు..
- బీఎడ్, ఎంఎడ్‌ను రెండేళ్ల కోర్సుగా చేస్తారు.
- ప్రస్తుతం జనరల్ అభ్యర్థులకు డిగ్రీ కోర్సులో 50 శాతం, బీసీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే బీఎడ్‌లో చేరవచ్చు. ఇకపై ఎవరికైనా 50 శాతం మార్కులు రావాల్సిందే.
- ప్రవేశ పరీక్షలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది.
- విద్యార్థులకు, అధ్యాపకులకు 80 శాతం హాజరు ఉండాలి. టీచింగ్ ప్రాక్టీస్‌కు 90 శాతం హాజరుండాలి.
- ప్రస్తుతం 40 రోజులు మాత్రమే ఉన్న స్కూల్ ఇంటర్న్‌షిప్‌ను (టీచింగ్ ప్రాక్టీస్) 16 వారాలకు పెంచుతారు. ప్రథమ సంవత్సరంలో 4 వారాలు, ద్వితీయ సంవత్సరంలో 12 వారాలు ఉంటుంది. మొదటి సంవత్సరంలో ఒకవారం విద్యా బోధన, మరోవారం కమ్యూనిటీ అనుభవాలు, రెండు వారాలు టీచింగ్ ప్లానింగ్‌కు కేటాయిస్తారు. మిగతా వారాలు ప్రాజెక్టు వర్కులు ఉంటాయి.
- కంటిన్యూస్ ఇంటర్నల్ అసెస్‌మెంట్ (సీఐఏ) ఉంటుంది. ఇందులో విద్యార్థులకు గ్రేడ్స్/మార్క్స్ ఉంటాయి. వీటికి 30 శాతం మార్కులు ఉంటాయి. మిగతా 70 శాతం మార్కులు రాత పరీక్షకు ఉంటాయి.
- నాలుగేళ్ల బీఎడ్ ఇంటిగ్రేటెడ్ కోర్సుకు ఎన్‌సీటీఈ యోచిస్తోందని, దీనిని ఐదేళ్లకు పెంచాలని ప్రొఫెసర్ గంటా రమేశ్, ప్రైవేట్ బీఎడ్ కాలేజెస్ అసోసియేషన్‌కు చెందిన తాళ్ల మల్లేశం సూచిస్తున్నారు.