సాక్షి, అమరావతి: సైన్సు, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇప్పుడు బోధన రంగంలోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఈడీ కోర్సు స్థానంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ–బీఈడీ, బీఏ–బీఈడీ కోర్సులను దేశంలో 42 ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎన్‌ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు ప్రారంభించాయి. మనరాష్ట్రంలో శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఈ కోర్సులను అందిస్తున్నాయి.
ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గత నెలలో నిర్వహించిన జాతీయ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–(ఎన్‌సెట్)–2023కు 16,004 మంది దరఖాస్తు చేసుకోగా 10,136 మంది పరీక్షకు హాజరయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడించి, ఈ నెలలో ప్రవేశ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రకారం.. ఫౌండేషన్(1 నుంచి 2 తరగతులు), ప్రిపరేటరీ (3–5), మిడిల్ స్టేజ్ (6–8), సెకండరీ స్టేజ్ (9–12 తరగతులు)కు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులను అందిస్తున్నారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సెకండరీ స్టేజ్ (9 నుంచి 12వ తరగతి)కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ప్రవేశపెట్టారు.
ఇంటిగ్రేటెడ్ బీఈడీతో ఉన్నత అవకాశాలు
ఎన్‌టీఏ నిర్వహించిన ఎన్‌సెట్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు మూడేళ్ల తర్వాత నాలుగో ఏడాది చదవడం ఇష్టం లేకపోతే కోర్సు నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఇలాంటి వారికి మూడేళ్ల డిగ్రీ పట్టాను అందిస్తారు. నాలుగేళ్ల కోర్సు పూర్తి చేస్తే పీజీ కోర్సులు చదువుకోవచ్చు.
బోధన రంగాన్ని ఎంచుకునేవారికి మంచి అవకాశాలు..
శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ–బీఈడీ, బీఏ–బీఈడీల్లో 50 చొప్పున సీట్లు ఉన్నాయి. బీఎస్సీ–బీఈడీకి 1,988 మంది, బీఏ–బీఈడీకి 1,020 మంది దరఖాస్తు చేసుకున్నారు.
బోధనకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ పోస్టులను కూడా మంజూరు చేసింది. నైపుణ్యం గల టీచింగ్ ఫ్యాకల్టీకి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. ఇప్పటివరకు ఉపాధి కోర్సుగా మాత్రమే ఉన్న బీఈడీ కోర్సు బోధన రంగాన్ని ప్రొఫెషన్‌గా తీసుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తుంది.
– ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు, వైస్ చాన్సలర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment