సాక్షి, హైదరాబాద్: సమీకృత బీఈడీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభం కానున్నాయి. ఇంటర్ తర్వాత ఒకే సమయంలో డిగ్రీ, బీఈడీ కలిపి పూర్తి చేయవచ్చు. ఈ కోర్సు కాలపరిమితి నాలుగేళ్లు ఉంటుంది. సాధారణంగా బీఈడీ చేయాలంటే మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసి, రెండేళ్ల బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలి. దీనికి మొత్తం ఐదేళ్లు పడుతుంది. కొత్త విధానం వల్ల నాలుగేళ్లలోనే పూర్తి చేసే వీలుంది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా తీసుకొచ్చిన ఈ కోర్సును జాతీయ స్థాయిలో పలు కళాశాలల్లో ప్రవేశపెడుతున్నారు. వీటిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రాత పరీక్ష నిర్వహిస్తుంది.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం అర్ధరాత్రి ఎన్‌టీఏ విడుదల చేసింది. తెలంగాణలో మూడు విద్యా సంస్థలకు నాలుగేళ్ల బీఈడీ కోర్సు నిర్వహించేందుకు అనుమతి లభించింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, వరంగల్ ఎన్‌ఐటీ, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో 250 సీట్లు ఉంటాయి. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాయవచ్చని ఎన్‌టీఏ పేర్కొంది.
ఆధునిక విద్యా బోధనకు అనుగుణంగా సమీకృత బీఈడీ కోర్సును ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించింది. విద్యార్థి మానసిక ధోరణి, ఆన్‌లైన్, డిజిటల్ విద్యా బోధనతో పాటు సరికొత్త మెలకువలతో ఎలా బోధించాలన్న అంశానికి ఈ కోర్సులో అత్యధిక ప్రాధాన్యమిస్తారు. తరగతి గదిలో పాఠాల కన్నా, అనుభవం ద్వారా నేర్చుకునే రీతిలో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు.
ప్రవేశ పరీక్ష ఇలా..
ఇంటర్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు ఈ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. పన్నెండో తరగతి, ఇంటర్ సిలబస్‌లోంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 160 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎన్‌సీఈఆర్‌టీ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది. తెలంగాణలో మూడు కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీకి అనుమతించారు. వీటిలో మొత్తం 250 సీట్లు ఉన్నట్టు ఎన్‌టీఏ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment