మే 23న ఏపీ ఎడ్‌సెట్
దరఖాస్తుకు ఈనెల 23 చివరి తేదీ
తిరుపతి సిటీ: శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్‌సెట్-2016ను మే 23వ తేదీన నిర్వహించనున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ టి.కుమారస్వామి తెలిపారు. సోమవారం ఆయన తిరుపతిలోని ఎస్వీయూ ఎడ్‌సెట్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు బీఏ/బీఎస్సీ/బీకాం/బీసీఏ/బీఈ/బీటెక్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించినవారు, ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు ఎడ్‌సెట్ రాసేందుకు అర్హులని పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరి వారికి 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం ఉత్తీర్ణత మార్కులు ఉండాలని పేర్కొన్నారు.
అయితే డీగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు ఈ ఏడాది జూన్ , జూలైల్లో నిర్వహించనున్న కౌన్సెలింగ్ నాటికి ఓరిజనల్ సర్టిఫికెట్లను చూపాల్సి ఉంటుందని తెలిపారు. పరీక్ష కోసం ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పారు. ఏపీ ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేయాల్సి వుంటుందన్నారు. అప్లికేషన్ ఫీజు ఓసీ/బీసీలకు రూ. 400, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈనెల 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు స్వీకరిస్తామని, రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో వుంటుందని, తెలుగు, ఉర్దూ మీడియంలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు కుమారస్వామి తెలిపారు.