గ్లెన్ బ్రిగ్స్
విందులు.. వినోదాలు.. నజరానాలు.. ఆతిథ్యాలు.. పైరవీలు.. పోలీసులతో ఓ నకిలీ సర్టిఫికెట్ల దొంగ నెరిపిన సత్సంబంధాలు కోకొల్లలు. ఒంటిపై 70 తులాల బంగారం.. తిరుపతిలో విలాసవంతమైన భవనం.. చేతిలో పోలీసులు.. చెలరేగిపోయాడీ ఆంగ్లో ఇండియన్. దొంగలతో చేయి కలిపితే జైలుకెళ్లడం తప్పితే ఏముంటుందని.. ఏకంగా పోలీసులనే తన బుట్టలో వేసుకున్నాడు. వాళ్ల అవసరాలు తీరుస్తూ.. తన వ్యవహారాలను చక్కబెట్టుకున్న తీరుకు పోలీసు ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. చిన్నాచితక స్థాయిలో కాకుండా ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈ కేటుగాని మాయలో పడటం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : నకిలీ సర్టిఫికెట్ల తయారీలో ఆరితేరిన గ్లెన్ బ్రిగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తుండగా.. ఇందులో పోలీసులకు కూడా భాగస్వామ్యం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. జిల్లాలోని నలుగురు డీఎస్పీలు ఈయనతో సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది. విందులు, వినోదాల్లో పాల్గొనడంతో పాటు నజరానాలు కూడా అందుకున్నట్టు సమాచారం. జిల్లా కేంద్రంలోని ఓ విభాగంలో పనిచేసే డీఎస్పీతో పాటు మూడు సబ్ డివిజన్లకు చెందిన ముగ్గురు డీఎస్పీలు గ్లెన్ బ్రిగ్స్‌తో కలిసి విందులు చేసుకుని.. పోస్టింగుల కోసం పైరవీలు చేయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. సదరు నేరస్తుడి నుంచి బైకులు, ల్యాప్‌టాప్‌లను కూడా కొంతమంది పోలీసులు నజరానాగా పొందినట్టు విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
గుంతకల్లు నియోజకవర్గంలోని ఒక ఎస్‌ఐకి ల్యాప్‌టాప్ నజరానాగా అందించి కావాల్సిన పనులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల తయారీలో తనదైన శైలిని గ్లెన్ కనబరిచారని.. తరగతుల వారీగానే కాకుండా యూనివర్సిటీల వారీగా ప్రత్యేక ఫైళ్లను తయారు చేసుకుని ఇంట్లో భద్రపరచుకున్నట్టు తెలుస్తోంది. ఎక్కడా అనుమానం రాకుండా సదరు బోర్డు లేదా యూనివర్సిటీ ఇచ్చే ఒరిజినల్ సరి్టఫికెట్లలాగై తయారు చేయడమే కాకుండా సరి్టఫికెట్‌కు ఇచ్చే సిరీస్‌ను కూడా అదే క్రమంలో ఉంచి అనుమానం రాకుండా తయారు చేశారని విచారణలో తేలింది. మరోవైపు గుంతకల్లులోని అప్పటి అధికార పార్టీ నేత ద్వారా పైరవీ చేసి ఓ డీఎస్పీతో పాటు పలువురు పోలీసులకు పోస్టింగ్‌లు ఇప్పించినట్టు కూడా తెలుస్తోంది.
బెయిల్ ఇప్పిస్తామంటూ..
కేవలం నకిలీ సరి్టఫికెట్ల తయారీతో ఆగిపోకుండా ఏకంగా కోర్టులో బెయిల్ ఇప్పిస్తానని కూడా గ్లెన్ డబ్బు వసూలు చేసినట్టు తెలుస్తోంది. జిల్లాలో ఒక హత్య కేసులో నిందితునికి ఈ విధంగానే బెయిల్ వచ్చేలా మధ్యవర్తిగా ఉండి రూ.30 లక్షలు ఇప్పించి పని కానిచ్చారని సమాచారం. ఈ వ్యవహారంలో కూడా పోలీసులు కొన్ని వివరాలు సేకరించి.. నివేదికను తయారుచేసి కోర్టు ముందు ఉంచనున్నట్టు సమాచారం.
తిరుపతి కేంద్రంగా..
తిరుపతిలోని తన ఇల్లు కేంద్రంగా గ్లెన్ పోలీసులతో సత్సంబంధాలు నెరిపినట్లు తెలుస్తోంది. అక్కడికి ఏదైనా డ్యూటీకి వెళ్లిన పోలీసులకు తన ఇంట్లోనే ఆతిథ్యం ఇవ్వడంతో పాటు భారీగా విందులు, వినోదాలు ఏర్పాటు చేసేవాడు. తద్వారా జిల్లాలోని నలుగురు డీఎస్పీలతో పాటు సుమారు 10 మంది సీఐల వరకు తన గుప్పిట్లో పెట్టుకుని కావాల్సిన వ్యవహారాలు నడిపినట్టు తెలుస్తోంది.
లోతుగా విచారణ
పవర్ బ్రోకర్‌గా వ్యవహరించి పోలీసులకు నజరానాలు ఇస్తూ తన పనులు కానిచ్చుకోవడం ద్వారా గ్లెన్ భారీగా ఆర్జించినట్టు తెలుస్తోంది. ఏకంగా తన ఒంటిపై 70 తులాల బంగారం ధరించడమే కాకుండా తిరుపతిలో భారీగా పొలాలు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేయనుండటంతో ఎవరెవరి జాతకాలు బయటకొస్తాయోననే అంశంపై పోలీసుశాఖలో ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో గ్లెన్‌కు సంబంధించి నకిలీ సరి్టఫికెట్ల తయారీలోనూ పోలీసులకు సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. అంతేకాకుండా సదరు పోలీసులతో జరిపిన వాట్సాప్ చాట్ వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
గ్లెన్ ఇంట్లో కానిస్టేబుల్ ఫొటో
వాస్తవానికి ఆంగ్లో ఇండియన్ అయిన గ్లెన్ బ్రిగ్స్ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు ఉన్నాయి. అసహజ లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు ఇష్టపడే వాడని తెలుస్తోంది. ఇందులో భాగంగా గుంతకల్లులోని ఒక పోలీసు కానిస్టేబుల్‌తో అసహజ లైంగిక సంబంధాలు నెరిపినట్టు సమాచారం. అంతేకాకుండా సదరు కానిస్టేబుల్ ఫొటోను ఏకంగా తిరుపతిలోని తన ఇంట్లో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సదరు కానిస్టేబుల్‌కు అవసరమైనవన్నీ ఈయనే సర్దుబాటు చేసేవారని కూడా విచారణలో తేలినట్టు సమాచారం. మరో కానిస్టేబుల్‌కు కూడా బైకు ఇవ్వడమే కాకుండా నిరంతరం అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇన్నోవా కారును కొద్ది మంది పోలీసులకు ప్రొటోకాల్ వాహనంగా కూడా వినియోగించారని.. ఇందులో భాగంగా వాహనంపై పోలీసు వెహికల్ బోర్డు కూడా పెట్టుకుని చక్కర్లు కొట్టినట్టు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment