
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేశంలో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్‌ఎంజీ) ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణం వెలుగు చూసింది. దాంతో సీబీఐ మన రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని 91 నగరాలు, పట్టణాల్లో గురువారం విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఎఫ్‌ఎంజీ ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది.
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు మనదేశంలో వైద్యవృత్తి చేపట్టాలంటే ఎఫ్‌ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) ఈ పరీక్ష నిర్వహిస్తుంది. కాగా, ఇందులో ఉత్తీర్ణులు కాకుండానే ఉత్తీర్ణులైనట్టుగా దేశంలో 73మంది ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్టు సీబీఐ గుర్తించింది.
ఆ ఫేక్ సర్టిఫికెట్లను ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లు సైతం ఆమోదించడం గమనార్హం. దీనిపై సీబీఐ ఈ నెల 22న కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఈ ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమేయం ఉన్న పలువురు ఎఫ్‌ఎంజీ గ్రాడ్యుయేట్లు, అందుకు సహకరించిన మెడికల్ కౌన్సిళ్లు, వైద్య సంస్థలను గుర్తించింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ ప్రకటించింది.
మన రాష్ట్రంలోనూ నకిలీ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్
ఎఫ్‌ఎంజీ ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణానికి సంబంధించి విజయవాడలోని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ కార్యాలయంలో సీబీఐ అధికారులు ఈ నెల 23న తనిఖీలు నిర్వహించారు. 12 గంటలపాటు ఏకబిగిన కొనసాగిన ఈ సోదాల్లో 2014 నుంచి 18 మధ్య విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న వైద్యుల వివరాలను పరిశీలించారు.
ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు కొనసాగుతున్నంతసేపు కార్యాలయంలో అధికారులు, సిబ్బందిని బయటకు కూడా పంపించలేదు. కాగా గురువారం విజయవాడలోని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌తోపాటు విశాఖపట్నంలోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment