మహబూబ్‌నగర్: మీకు పుట్టిన తేదీ తెలియదా.. మీ కూతురికి పెళ్లి వయసు లేకపోయినా కల్యాణలక్ష్మి పథకం కోసం వయస్సు పెంచిన ఆధార్ కార్డు కావాలా.. బీమా సొమ్ము కోసం మరణ ధ్రువీకరణ పత్రం కావాలా.. మీరు చేయాల్సిందంతా ఒక్కటే ప్రభుత్వ ఆధార్ సెంటర్ పేరుతో నకిలీ దందా చేస్తున్న వారిని సంప్రదిస్తే చాలు. వారికి అడిగినంత సొమ్ము ఇచ్చారంటే మీకు కావాల్సిన సర్టిఫికెట్ మీ ముందుంటుంది. అది తెలంగాణకు చెందినదైనా, ఏపీదైనా. ఈ నకిలీ దందా జరుగుతోంది ఎక్కడో కాదు, జోగుళాంబ గద్వాల జిల్లాలోనే. ‘సాక్షి’ పరిశోధనలో ఇటీవల ఈ నకిలీ ధ్రువపత్రాల దందా వెలుగులోకి వచ్చింది.
అవసరాలే ఆసరాగా నకిలీవి సృష్టిస్తూ..
ప్రస్తుతం ప్రతి పథకంలో కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా అవసరముంది. అయితే, గతంలో వివిధ ఆసుపత్రుల్లో ప్రసవాలు అయిన వారు తమ పిల్లల జనన తేదీలను నమోదు చేసుకోలేదు. వారికి ఇప్పుడు ఆధార్‌కార్డు అవసరం ఉండటంతో వారి జనన ధ్రువీకరణ పత్రాలను ఆధార్ కేంద్రం పేరుతో నడుపుతున్న వారు తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జోగుళాంబ గద్వాల ఆస్పత్రి ఇచ్చినట్లు ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తున్నారు.
కానీ ప్రస్తుతం రాష్ట్రం జనన ధ్రువీకరణ పత్రాలన్నీ మీసేవల ద్వారానే అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖ ద్వారా జనన ధ్రువీకరణ పత్రం అందిస్తుండగా.. అక్కడి ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ పేరుతో కర్నూల్ జనరల్ హాస్పిటల్‌లో జన్మించినట్లుగా జనన ధ్రువీకరణ పత్రాన్ని అందించి అటు ప్రజలను, ఇటు అధికారులను మోసం చేస్తున్నారు.
అసలు నకిలీ పత్రాలను అప్‌లోడ్ చేస్తున్నా, అధికారులు పరిశీలించడం లేదా? లేక అధికారులకు తెలిసే జరుగుతుందా అనే అను మానాలెన్నో ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో వందల సర్టిఫికేట్లు, కర్నూల్ జిల్లాలోని వారికి సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులుగా ఈ దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు దారి తీస్తుంది.
అవి నకిలీ ధ్రువపత్రాలు..
రాష్ట్ర ప్రభుత్వం పేరుతో ఇచ్చిన ధ్రువీకరణ పత్రం పూర్తిగా నకిలీది. ప్రస్తుతం జనన ధ్రువీకరణ పత్రాలు అన్ని మీసేవల ద్వారానే అందుతున్నాయి. కొందరు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని చేసే వాటిని సంబంధిత అధికారులు పర్యవేక్షించాలి. ప్రజలు కూడా మోసపోకూడదు. – డాక్టర్ కిషోర్, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాసుపత్రి
దందా జరుగుతోందిలా..
కేవలం పాఠశాలల విద్యార్థులకు, వారి ఆధార్ వివరాలు నమోదు చేయడం కోసం సర్వశిక్షా అభియాన్ ద్వారా జిల్లాలోని పలు విద్యా సంస్థల వద్ద ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ మార్కెట్‌లో నెట్‌వర్క్ సేవల పేరుతో పెద్దఎత్తున షాపులు తెరిచి, అక్కడ ఆధార్ కార్డులు, పేరు మార్పిడి, కొత్త కార్డులు తదితర సవరణలు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది.
కానీ, ఆధార్ కార్డులో సవరణల కోసం, కొత్త కార్డుల కోసం జనన ధ్రువీకరణ పత్రాలు అవసరముంటుంది. నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లకుండా నేరుగా ఆసుపత్రి నుండే ధ్రువీకరణ పత్రాలు వచ్చినట్లు నకిలీ పత్రాలను తయారు చేసి, వాటిని ప్రామాణికంగా తీసుకుని ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేస్తున్నారు.
దీని కోసం రూ.5వేల నుంచి అత్యవసరమైతే మరింత ఎక్కువ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ‘సాక్షి’ పరిశోధనలో ఇలాంటి నకిలీ ధ్రువీకరణ పత్రాలు చాలానే బయటపడ్డాయి. ఆధార్ సైట్‌లో ఉన్న లొసుగులను వాడుకుంటూ తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దానికి అమాయక ప్రజలు బలైపోతున్నారు. రూ.వేలకు వేలు డబ్బులు చిల్లు పెట్టుకుని తీరా అది నకిలీవి అని తెలిసినా చేసేదేమి లేక మౌనంగా ఉండిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment