అడ్డ‘దారులు’ | Fake Certificate Available In Karimnagar Engineering Colleges | Sakshi
Sakshi News home page

అడ్డ‘దారులు’

Published Tue, Oct 23 2018 7:43 AM | Last Updated on Tue, Oct 23 2018 7:43 AM

Fake Certificate Available In Karimnagar Engineering Colleges - Sakshi

కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఎంటెక్‌ పూర్తిచేసి.. అదే జిల్లాలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు తాను పీహెచ్‌డీ పూర్తిచేశానని తనకు వేతనం పెంచాలని కోరుతూ.. ఇతర రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీకి చెందిన డాక్టరేట్‌ పట్టా తీసుకొచ్చి యాజమాన్యం చేతిలో పెట్టాడు. కంగుతిన్న సదరు యాజమాన్యం.. సదరు అధ్యాపకుడి ఉద్యోగ హాజరును పరిశీలించింది. సెలవులు పెద్దగా పెట్టలేదని గమనించి.. కళాశాలలో పనిచేస్తూనే  పీహెచ్‌డీ ఎలా పూర్తిచేశావని ప్రశ్నించగా.. తెల్లముఖం వేశాడు. చేసేదిలేక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గానే కొనసాగుతున్నాడు. ఇలా ఈ ఒక్క అధ్యాపకుడే కాదు.. జిల్లాకు చెందిన చాలా మంది వివిధ రాష్ట్రాల్లో పీహెచ్‌డీ పూర్తిచేసినట్లు ‘నకిలీ’ సర్టిఫికెట్లు సృష్టించి.. కళా శాలల్లో చేరి.. ఉద్యోగాలు చేస్తున్నారు.

శాతవాహనయూనివర్సిటీ: ఇంజినీరింగ్‌ కళాశాలల అధ్యాపకుల్లో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం దూమారం రేపుతోంది. కొంతమంది డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ పట్టాలు నకిలీవి పట్టుకుని ఉద్యోగాల్లో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయం జేఎన్టీయూ (హెచ్‌) అధికారుల తనిఖీల్లో వెలుగుచూస్తుండడం కలవరపెడుతోంది. హైదరాబాద్‌లోని వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌ స్థాయి హోదాలో పనిచేస్తున్నవారే నకిలీ సర్టిఫికెట్లు పెట్టినట్లు వెలుగుచూడడంతో గవర్నర్‌ సీరియస్‌ అయ్యారు.

రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అధ్యాపకుల సమగ్ర వివరాలతో నివేదిక పంపించాలని ఉన్నత విద్యామండలి అధికారులను ఇటీవల ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు జేఎన్టీయూ అధికారులు ఆయా కళాశాలల్లోని అధ్యాపకులతోపాటు జేఎన్టీయూ పరిధిలోని పలు కళాశాలల్లో పనిచేస్తున్నవారి సర్టిఫికెట్లను తనిఖీ చేస్తోంది. ఇందులోభాగంగా అనేక లొసుగులు బయటపడుతున్నట్లు సమాచారం.

అధికారుల అంచనా ప్రకారం 150 మందికిపైగా అధ్యాపకులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తుండగా.. వీరిలో కరీంనగర్‌ జిల్లాకు చెందినవారూ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జేఎన్టీయూ అధికారులు తనిఖీలకు రమ్మని పిలవగా.. జిల్లాలోని పలు కళాశాలల అధ్యాపకులు వెళ్లకుండా మల్లాగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. అధికారులు పిలిచినా వెళ్లడం లేదంటే వారి సర్టిఫికెట్లు నకిలీవేనా..? అనే సందేహాలు విద్యావేత్తలో వ్యక్తమవుతోంది. అధికారులు స్పందించి.. తనిఖీ ప్రక్రియను వేగవంతం చేసి.. నకిలీలపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

బయటపడనున్న బాగోతం..
ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అధ్యాపకుల నకిలీ సర్టిఫికెట్ల బాగోతం త్వరలోనే బట్టబయలు కానుందని అధికారవర్గాల ద్వారా సమాచారం. తప్పుడు ధ్రువీకరణపత్రాలు సృష్టించిన వారి ఏరివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నకిలీ ధ్రువీకరణపత్రాలతో అధ్యాపకులుగా కొనసాగుతున్నవారితో విద్యాప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి పత్రాలు సృష్టించిన వారిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దాదాపు 30మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. జేఎన్టీయూ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో 150మందికి పైగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని నోటీసులు పంపించగా.. కేవలం 60మందే హాజరయ్యారు. ఇక కరీంనగర్‌లో పనిచేస్తున్న వారు వెళ్లేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.

గవర్నర్‌ ఆదేశాలతో.. 
పీహెచ్‌డీ సర్టిఫికెట్లు నకిలీవీ పెట్టిన అధ్యాపకుల సమగ్ర వివరాలతో నివేదిక పంపించాలని రాష్ట్ర గవర్నర్‌ ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. గతంలోని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన పీహెచ్‌డీ పట్టాలు, కోర్సులు, అభ్యర్థుల సంఖ్య, తదితర వివరాలు పంపించాలని ఉన్నతవిద్యామండలిని కోరారు. ఇందులో ముఖ్యంగా ఏయే యూనివర్సిటీ ఎన్నెన్ని పీహెచ్‌డీలు ప్రదానం చేసింది..? ప్రస్తుతం ఏయే విభాగాల్లో ఎంతమంది పీహెచ్‌డీ చేస్తున్నారు..? ఎన్నేళ్లుగా చేస్తున్నారు..? అనే వివరాలు కోరారు.

దీంతో ఉన్నత విద్యామండలి రెండు నెలల క్రితమే  అన్ని యూనివర్సిటీలకు పీహెచ్‌డీ వివరాలు పంపించాలని ఆదేశించింది. అన్ని యూనివర్సిటీలు సంబంధిత వివరాలు పంపించాయి. ఈ క్రమంలోనే నకీలీల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు జెఎన్‌టీయూ అధికారులు సైతం నకిలీలపై దృష్టి  నోటీసులు పంపించడం, తనిఖీలు చేపట్టడం వంటి చర్యలు చేపడుతోంది. నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని తేలితే కఠినచర్యలు పాల్పడనున్నట్లు సమాచారం.

నకిలీలతో యాజమాన్యాలకే మోసం
కరీంనగర్‌లోని పలు ఇంజినీరింగ్‌ కళాశాలల్లోని కొందరు అధ్యాపకులు తప్పుడు పీహెచ్‌డీ ధ్రువపత్రాలు కలిగి ఉన్నట్లు తీవ్ర ప్రచారం కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లా మొత్తం నకిలీ సర్టిఫికెట్ల బాగోతం హాట్‌టాఫిక్‌గా మారింది. ఇలా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి.. యాజమాన్యాలనే మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతర ప్రదేశాల నుంచి వచ్చినవారు వివిధ కళాశాలల నుంచి తప్పుడు పత్రాలతోనే ఉద్యోగాలు సాధించినట్లు సమాచారం.

నగర సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఒక విభాగానికి చెందిన అధ్యాపకుడు పీహెచ్‌డీ పట్టా కొనుక్కొని వచ్చారని.. అయినా యాజమాన్యం సదరు విభాగం తరఫున డాక్టరేట్‌గా యూనివర్సిటీకి చూపిస్తున్నట్లు సమాచారం. కొందరు అధ్యాపకుల సర్టిఫికెట్ల వ్యవహారం యాజమాన్యాలకు తెలిసినా.. కిమ్మనకుండా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అర్హత ఉన్నవారితోనే విద్యాబోధన జరిగితే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. నకిలీలపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు, విద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement