PhD graduates
-
సక్సెస్ స్టోరీ: ‘నాకోసం అమ్మ చెవికమ్మలు తీసిచ్చింది’
ఆ కుర్రాడి పేరు పసుపులేటి లక్ష్మీ నారాయణ. గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల మండలం, జానపాడు అతడి సొంతూరు. సౌత్ కొరియాలోని కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ (కిమ్స్)లో ‘మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆగస్టు 25న పీహెచ్డీ పట్టా అందుకోనున్నాడు. జానపాడు ప్రభుత్వ పాఠశాలలో మొగ్గ తొడిగి సౌత్ కొరియాలోని జియోన్‌గ్సాంగ్ నేషనల్ యూనివర్సి టీలో వికసించిన ఓ విజయకథనం ఇది. లక్ష్మీనారాయణ తల్లిదండ్రుల ఆకాంక్ష వారి ముగ్గురు పిల్లలనూ విద్యావంతులను చేసింది. ‘మా పిల్లల జీవితం మాలాగ సున్నపుబట్టీలో మగ్గిపోకూడదు’ అనుకున్నారు. పిల్లలను పనిలోకి పంపించకుండా బడిలోకి పంపించారు. ఆ నిర్ణయం ఈ రోజు దేశానికి ఒక విద్యావంతుడిని ఇచ్చింది. భావితరానికి ఒక ఆవిష్కర్తను తయారు చేసింది. ‘చదువుకి పేదరికం అడ్డు కాకూడదు’ అని స్వర్గీయ వైఎస్ఆర్ తలంపే తనకీ జీవితాన్ని ఇచ్చిందన్నాడు లక్ష్మీనారాయణ. పేదింట్లో పుట్టిన కారణంగా తెలివి ఉండి చదువుకు దూరం అయ్యే దుస్థితి ఎవరికీ రాకూడదని చెప్పడమే కాకుండా ఆయన ట్రిపుల్ ఐటీలను స్థాపించి, చురుకైన పిల్లలకు ఉచితంగా విద్యనందించే ఏర్పాటు చేశాడు. ఆ ట్రిపుల్ ఐటీలు పెట్టిన మరుసటి ఏడాది లక్ష్మీనారాయణ టెన్త్ పూర్తి చేయడం కాకతాళీయమే కావచ్చు. సీటు సంపాదించుకోగలిగిన మార్కులు తెచ్చుకున్నది మాత్రం చదువు పట్ల అతడి తృష్ణ, తల్లిదండ్రుల ఆకాంక్ష అతడి మనసులో వేసిన ముద్ర మాత్రమే. జానపాడులో లక్ష్మీ నారాయణ చదువుకున్న ప్రభుత్వపాఠశాల ఆరేళ్లు అన్నీ ఉచితమే! 2019లో నూజివీడు ట్రిపుల్ ఐటీలో చేరిన లక్ష్మీనారాయణ ఇంటర్, బీటెక్ పూర్తి చేశాడు. ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకునే వరకు తల్లిదండ్రులకు రూపాయి ఖర్చులేకుండా చదువు పూర్తి చేసుకోగలిగానని చెప్పాడు. మెటలర్జీ సబ్జెక్టు ఇష్టం, పరిశోధన పట్ల అతడికి ఉన్న ఆసక్తికి అదే ఊరి నుంచి సౌత్ కొరియా వెళ్లి పరిశోధన చేస్తున్న హరిబాబు మార్గదర్శనం నారాయణ ప్రయాణానికి మంచి ఆసరా అయింది. సౌత్ కొరియాలోని యూనివర్సిటీలలో సీటు కోసం అప్లయ్ చేశాడు. స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. అమ్మ చెవికమ్మలు తీసిచ్చింది! సౌత్ కొరియాకు ప్రయాణం కావాలి... యూనివర్సిటీకి వెళ్లే వరకైన ఖర్చులకు డబ్బు కావాలి. మరో దారి లేదు... తల్లి చెవికమ్మలు తీసి అమ్మింది. అవీ చాలలేదు. దొరికిన చోట అప్పు తెచ్చాడు తండ్రి. మొత్తం ముప్పై వేలు చేతిలో పెట్టారు. ‘‘చాలామందికి అది చాలా చిన్న మొత్తమే కావచ్చు. నాకది కోటానుకోట్ల కంటే ఎక్కువ. నా కోసం మా అమ్మ చెవి కమ్మలు తీస్తుంటే వద్దనాలనిపించింది. అయితే ఆ క్షణంలో అమ్మ మాత్రం ఏ మాత్రం బాధపడలేదు. నాకు విదేశంలో సీటు వచ్చినందుకు అమ్మానాన్న పడుతున్న ఆనందం నా బాధ్యతను మరింతగా పెంచింది. జీవితంలో తొలిసారి విమానం ఎక్కాను. మంచి స్కాలర్షిప్ రావడంతో అక్కడ ఖర్చులు పోను డబ్బు మిగిలేది. ఏడాదిన్నరలో అప్పులు తీర్చేసి, అమ్మకు కొత్త కమ్మలు కొనుక్కోవడానికి డబ్బు పంపాను. మా అమ్మకేమో నేను ట్రిపుల్ ఐటీలో సీటు తెచ్చుకున్న క్షణాలు ఆనందక్షణాలు, నేను మాత్రం అమ్మకు కమ్మల కోసం డబ్బు పంపినప్పుడు సంతోషంగా ఫీలయ్యాను. అమ్మానాన్న అన్నలతోనారాయణ(కుడి చివర) త్రీడీ శోధన లక్ష్మీ నారాయణ ఆరేళ్లలో 23 పబ్లికేషన్ లు సమర్పించాడు. మెటలర్జీలో టైటానియం త్రీడీ ప్రింటింగ్‌లో సాగుతున్న అతడి పరిశోధనలు ఏరోస్పేస్ రంగంలోనూ, వైద్య విభాగంలోనూ మంచి ఆవిష్కరణలు కానున్నాయి. గుండె వాల్వులు, మోకాలు, బోన్ రీప్లేస్మెంట్ అమర్చే లోహపు పరికరాల తయారీలో మంచి ఫలితాలనిస్తాయి. ఏరో స్పేస్‌లో పెద్ద మెషినరీలో రిపేర్ వస్తే ఆ యంత్రాన్ని డిస్మాంటిల్ చేయాల్సిన పని లేకుండా పని చేయని భాగానికి మాత్రమే మరమ్మతు చేయడం సాధ్యమవుతుంది. ఒక్క ఫొటో ఉండేది! టెన్త్ క్లాస్ పూర్తయ్యే నాటికి లక్ష్మీ నారాయణకు అమ్మానాన్నలతో తాను మాత్రమే ఉన్న ఫొటో ఒకే ఒక్కటి ఉండేది. టెన్త్‌లో టాపర్ అయిన సందర్భంగా స్థానిక వార్తా పత్రికల వాళ్లు పేపర్లో ప్రచురణ కోసం ఆ ఫొటో తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆ ఫొటో కూడా వాళ్ల దగ్గర లేదు. పెద్దన్నయ్య పెళ్లి సమయానికి ట్రిపుల్ ఐటీలో ఉండడం, అక్కడ ఏడాదికి వారం రోజులు మాత్రమే సెలవులు ఉండడంతో పెళ్లికి రాలేకపో వడం, రెండవ అన్నయ్య పెళ్లికి కొరియా నుంచి రాలేకపోవడంతో ఇప్పటికీ అమ్మానాన్నలతో మరో ఫొటో తీసుకునే అవకాశం రాలేదని చెప్పాడు.డబ్బు లేకపోవడం కారణంగా దూరమయ్యేది సౌకర్యాలు, విలాసాలు మాత్రమే కాదు... అందమైన జ్ఞాపకాలు కూడా. లక్ష్మీ నారాయణ మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి దశలోనూ తనను ఎవరో ఒకరు నడిపించారని, ‘లక్ష్మీ నారాయణ రెజ్యూమ్ చూసి ఇంప్రెస్ అయ్యాను. ఒక పరిశోధకుడిని తయారు చేయగలననే నమ్మకం కలిగింది. అందుకే సీటుకు రికమండ్ చేశాను’ అని జింజు యూనివర్సిటీ ప్రొఫెసర్ సుబ్బారెడ్డి అన్న మాటలను గుర్తు చేసుకున్నాడు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: వల్లెం మల్లికార్జునరెడ్డి, పిడుగురాళ్ల రూరల్ -
ఉన్నత చదువు చదివి ఇంత పనిచేశాడా!
సాక్షి, మెదక్: ఉన్నత చదువులు చదవడంతో పాటు ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసిన చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామానికి చెందిన గుడికాడి లింగాగౌడ్ డ్రగ్ వ్యాపారం చేస్తూ హైదారాబాద్‌లో పట్టుబడడం చర్చనీయంశంగా మారింది. సోమవారం లింగంగౌడ్‌తో పాటు అతని బంధువైన ఏఆర్ కానిస్టేబుల్ రామకృష్ణాగౌడ్ను సైబరాబాద్ డీసీపీ పద్మజారెడ్డి అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా చిన్నశంకరంపేట మండలంలో ఈ విషయం చర్చనీయమైంది. ఉన్నత చదువులతో పాటు గౌరవ ప్రథమైన కుటుంబ నేపథ్యం ఉన్న లింగాగౌడ్ వక్రమార్గం పట్టడం పలువురిని విస్మయానికి గురిచేసింది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతంలో లాబోరేటరీ నడుపుతున్నట్లు స్థానికులకు, పరిచయస్తులకు చెప్పుకునే లింగాగౌడ్ ఒక్కసారిగా 8 కోట్ల విలువ జేసే అల్పోజంతో పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఏ నోట విన్న లింగంగౌడ్ ఉదాంతం విని్పంచింది. -
అడ్డ‘దారులు’
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఎంటెక్ పూర్తిచేసి.. అదే జిల్లాలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు తాను పీహెచ్డీ పూర్తిచేశానని తనకు వేతనం పెంచాలని కోరుతూ.. ఇతర రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీకి చెందిన డాక్టరేట్ పట్టా తీసుకొచ్చి యాజమాన్యం చేతిలో పెట్టాడు. కంగుతిన్న సదరు యాజమాన్యం.. సదరు అధ్యాపకుడి ఉద్యోగ హాజరును పరిశీలించింది. సెలవులు పెద్దగా పెట్టలేదని గమనించి.. కళాశాలలో పనిచేస్తూనే పీహెచ్డీ ఎలా పూర్తిచేశావని ప్రశ్నించగా.. తెల్లముఖం వేశాడు. చేసేదిలేక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానే కొనసాగుతున్నాడు. ఇలా ఈ ఒక్క అధ్యాపకుడే కాదు.. జిల్లాకు చెందిన చాలా మంది వివిధ రాష్ట్రాల్లో పీహెచ్డీ పూర్తిచేసినట్లు ‘నకిలీ’ సర్టిఫికెట్లు సృష్టించి.. కళా శాలల్లో చేరి.. ఉద్యోగాలు చేస్తున్నారు. శాతవాహనయూనివర్సిటీ: ఇంజినీరింగ్ కళాశాలల అధ్యాపకుల్లో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం దూమారం రేపుతోంది. కొంతమంది డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పట్టాలు నకిలీవి పట్టుకుని ఉద్యోగాల్లో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయం జేఎన్టీయూ (హెచ్) అధికారుల తనిఖీల్లో వెలుగుచూస్తుండడం కలవరపెడుతోంది. హైదరాబాద్‌లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్ స్థాయి హోదాలో పనిచేస్తున్నవారే నకిలీ సర్టిఫికెట్లు పెట్టినట్లు వెలుగుచూడడంతో గవర్నర్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుల సమగ్ర వివరాలతో నివేదిక పంపించాలని ఉన్నత విద్యామండలి అధికారులను ఇటీవల ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు జేఎన్టీయూ అధికారులు ఆయా కళాశాలల్లోని అధ్యాపకులతోపాటు జేఎన్టీయూ పరిధిలోని పలు కళాశాలల్లో పనిచేస్తున్నవారి సర్టిఫికెట్లను తనిఖీ చేస్తోంది. ఇందులోభాగంగా అనేక లొసుగులు బయటపడుతున్నట్లు సమాచారం. అధికారుల అంచనా ప్రకారం 150 మందికిపైగా అధ్యాపకులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తుండగా.. వీరిలో కరీంనగర్ జిల్లాకు చెందినవారూ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జేఎన్టీయూ అధికారులు తనిఖీలకు రమ్మని పిలవగా.. జిల్లాలోని పలు కళాశాలల అధ్యాపకులు వెళ్లకుండా మల్లాగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. అధికారులు పిలిచినా వెళ్లడం లేదంటే వారి సర్టిఫికెట్లు నకిలీవేనా..? అనే సందేహాలు విద్యావేత్తలో వ్యక్తమవుతోంది. అధికారులు స్పందించి.. తనిఖీ ప్రక్రియను వేగవంతం చేసి.. నకిలీలపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బయటపడనున్న బాగోతం.. ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుల నకిలీ సర్టిఫికెట్ల బాగోతం త్వరలోనే బట్టబయలు కానుందని అధికారవర్గాల ద్వారా సమాచారం. తప్పుడు ధ్రువీకరణపత్రాలు సృష్టించిన వారి ఏరివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నకిలీ ధ్రువీకరణపత్రాలతో అధ్యాపకులుగా కొనసాగుతున్నవారితో విద్యాప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి పత్రాలు సృష్టించిన వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 30మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. జేఎన్టీయూ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో 150మందికి పైగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని నోటీసులు పంపించగా.. కేవలం 60మందే హాజరయ్యారు. ఇక కరీంనగర్లో పనిచేస్తున్న వారు వెళ్లేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. గవర్నర్ ఆదేశాలతో.. పీహెచ్డీ సర్టిఫికెట్లు నకిలీవీ పెట్టిన అధ్యాపకుల సమగ్ర వివరాలతో నివేదిక పంపించాలని రాష్ట్ర గవర్నర్ ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. గతంలోని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన పీహెచ్డీ పట్టాలు, కోర్సులు, అభ్యర్థుల సంఖ్య, తదితర వివరాలు పంపించాలని ఉన్నతవిద్యామండలిని కోరారు. ఇందులో ముఖ్యంగా ఏయే యూనివర్సిటీ ఎన్నెన్ని పీహెచ్‌డీలు ప్రదానం చేసింది..? ప్రస్తుతం ఏయే విభాగాల్లో ఎంతమంది పీహెచ్డీ చేస్తున్నారు..? ఎన్నేళ్లుగా చేస్తున్నారు..? అనే వివరాలు కోరారు. దీంతో ఉన్నత విద్యామండలి రెండు నెలల క్రితమే అన్ని యూనివర్సిటీలకు పీహెచ్డీ వివరాలు పంపించాలని ఆదేశించింది. అన్ని యూనివర్సిటీలు సంబంధిత వివరాలు పంపించాయి. ఈ క్రమంలోనే నకీలీల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు జెఎన్టీయూ అధికారులు సైతం నకిలీలపై దృష్టి నోటీసులు పంపించడం, తనిఖీలు చేపట్టడం వంటి చర్యలు చేపడుతోంది. నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని తేలితే కఠినచర్యలు పాల్పడనున్నట్లు సమాచారం. నకిలీలతో యాజమాన్యాలకే మోసం కరీంనగర్‌లోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లోని కొందరు అధ్యాపకులు తప్పుడు పీహెచ్డీ ధ్రువపత్రాలు కలిగి ఉన్నట్లు తీవ్ర ప్రచారం కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లా మొత్తం నకిలీ సర్టిఫికెట్ల బాగోతం హాట్‌టాఫిక్‌గా మారింది. ఇలా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి.. యాజమాన్యాలనే మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతర ప్రదేశాల నుంచి వచ్చినవారు వివిధ కళాశాలల నుంచి తప్పుడు పత్రాలతోనే ఉద్యోగాలు సాధించినట్లు సమాచారం. నగర సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఒక విభాగానికి చెందిన అధ్యాపకుడు పీహెచ్డీ పట్టా కొనుక్కొని వచ్చారని.. అయినా యాజమాన్యం సదరు విభాగం తరఫున డాక్టరేట్‌గా యూనివర్సిటీకి చూపిస్తున్నట్లు సమాచారం. కొందరు అధ్యాపకుల సర్టిఫికెట్ల వ్యవహారం యాజమాన్యాలకు తెలిసినా.. కిమ్మనకుండా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అర్హత ఉన్నవారితోనే విద్యాబోధన జరిగితే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. నకిలీలపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు, విద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
పీహెచ్‌డీల్లో భారత్ ఘనత
హైదరాబాద్ దేశ ఆర్థికాభివృద్ధికి విద్య ఎంతో దోహదం చేస్తుంది. ప్రత్యేకించి ఆయా రంగాల్లో పరిశోధన ఆ దేశ భవిష్యత్తుకు మరెంతగానో ఉపకరిస్తుంది. ఈ కోణంలో పరిశీలిస్తే ఉన్నత విద్య కోసం అనేక దేశాలు ప్రతి ఏటా ఎంతో ఖర్చు చేస్తున్నాయి. అయితే వీటిల్లో ప్రతి ఏటా ఏ దేశంలో ఎక్కువగా డాక్టరేట్ డిగ్రీ (పీహెచ్ డీ) లు వస్తున్నాయి. పరిశోధనా రంగంలో అత్యధిక పీహెచ్ డీలు సాధిస్తున్న దేశాలకు సంబంధించి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) తాజాగా నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అమెరికా దేశంలో అత్యధికంగా డాక్టరేట్ డిగ్రీలు పొందుతున్నారు. ఉన్నత విద్యపై కమిటీ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నలాజికల్ పాలసీ (సీఎస్టీపీ) 14 సెప్టెంబర్ 2016 లో రూపొందించిన నివేదికను ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపిరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) ఆమోదించింది. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘంగా పిలిచే ప్రతిష్టాత్మక ఓఈసీడీలో 35 దేశాలు సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నివేదిక ప్రకారం 2014 సంవత్సరంలో ఒక్క అమెరికాలోనే 67,449 మంది గ్రాడ్యుయేట్లు పీహెచ్డీ పట్టాలు సాధించారు. ఆ తర్వాత జర్మనీ రెండో స్థానంలో నిలిచింది. జర్మనీలో 28,147 మంది విద్యార్థులు పీహెచ్ డీ పట్టా సాధించగా, యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో 25,020 పీహెచ్ డీ పట్టా పొందారు. ఈ క్రమంలో భారతదేశం కూడా అగ్రదేశాల స్థానంలో నిలువడం గమనార్హం. అమెరికా, జర్మనీ, బ్రిటన్ ల తర్వాత భారతదేశం నాలుగో స్థానంలో నిలిచింది. 2014లో భారత్ నుంచి 24,300 మంది విద్యార్థులు పీహెచ్ డీ పట్టా సాధించారు. ఉన్నత విద్యకు ప్రాధాన్యతనిచ్చే జపాన్ ఈ విషయంలో వెనుకబడి ఉంది. అమెరికాలో సాధించే పట్టాలతో పోల్చితే నాలుగోవంతు కూడా జపాన్ లో లభించలేదు. జపాన్ దేశం ఆ ఏడాదిలో 16,039 మంది విద్యార్థులు పీహెచ్ డీ పట్టాలు సాధించగలిగారు. ఇకపోతే, ఫ్రాన్స్ (13,729), దక్షిణ కొరియా (12,931) ఆరు, ఏడు స్థానాల్లో నిలిచాయి. ఎనిమది, తొమ్మిదవ స్థానాల్లో స్పెయిన్ (10,889), ఇటలీ (10,678) ఉన్నాయి. ఆస్ట్రేలియా (8,400) పదో స్థానంలో ఉంది. అయితే, ఆయా దేశాల్లోని జనాభా నిష్పత్తితో పోల్చితే మాత్రం ఈ స్థానాల్లో చాలా మార్పులు ఉంటాయని ఓఈసీడీ పేర్కొంది. పెరుగుతున్న డాక్టరేట్లు గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచ వ్యాప్తంగా డాక్టరేట్ సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఓఈసీడీ దేశాల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగిందని నివేదిక తెలిపింది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నత విద్య శిక్షణ విషయంలో ప్రమాణాలను చాలా వరకు మెరుగుపరుచుకుంటున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. అందుకు భారతదేశంలో డాక్టరేట్లు పెరగడమే అందుకు నిదర్శమని నివేదిక పేర్కొంది. డాక్టరేట్ (పీహెచ్ డీ) డిగ్రీలు ప్రధానంగా సైన్స్ రంగంలోనే ఎక్కువగా లభిస్తున్నాయి. ఓఈసీడీ దేశాల్లో డాక్టరేట్ డిగ్రీలు సాధిస్తున్న వారిలో దాదాపు 40 శాతం సైన్స్, టెక్నాలటీ, ఇంజనీరింగ్, మాథమేటిక్స్ (ఎస్ టీ ఈ ఎం) రంగాల్లోనే ఉంటున్నాయి. (హెల్త్ కూడా ఇందులో ఉంది). అయితే ఫ్రాన్స్ (59 శాతం), కెనడా (55 శాతం), చైనా (55 శాతం) గ్రాడ్యుయేట్లు నేచురల్ సైన్సెస్, ఇంజనీరింగ్ రంగాల్లో మాత్రమే ఉంటున్నాయని నివేదిక తెలిపింది.