పీహెచ్‌డీల్లో భారత్ ఘనత
హైదరాబాద్
దేశ ఆర్థికాభివృద్ధికి విద్య ఎంతో దోహదం చేస్తుంది. ప్రత్యేకించి ఆయా రంగాల్లో పరిశోధన ఆ దేశ భవిష్యత్తుకు మరెంతగానో ఉపకరిస్తుంది. ఈ కోణంలో పరిశీలిస్తే ఉన్నత విద్య కోసం అనేక దేశాలు ప్రతి ఏటా ఎంతో ఖర్చు చేస్తున్నాయి. అయితే వీటిల్లో ప్రతి ఏటా ఏ దేశంలో ఎక్కువగా డాక్టరేట్ డిగ్రీ (పీహెచ్ డీ) లు వస్తున్నాయి. పరిశోధనా రంగంలో అత్యధిక పీహెచ్ డీలు సాధిస్తున్న దేశాలకు సంబంధించి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) తాజాగా నివేదిక విడుదల చేసింది.
ఆ నివేదిక ప్రకారం అమెరికా దేశంలో అత్యధికంగా డాక్టరేట్ డిగ్రీలు పొందుతున్నారు. ఉన్నత విద్యపై కమిటీ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నలాజికల్ పాలసీ (సీఎస్టీపీ) 14 సెప్టెంబర్ 2016 లో రూపొందించిన నివేదికను ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపిరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) ఆమోదించింది. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘంగా పిలిచే ప్రతిష్టాత్మక ఓఈసీడీలో 35 దేశాలు సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నివేదిక ప్రకారం 2014 సంవత్సరంలో ఒక్క అమెరికాలోనే 67,449 మంది గ్రాడ్యుయేట్లు పీహెచ్డీ పట్టాలు సాధించారు. ఆ తర్వాత జర్మనీ రెండో స్థానంలో నిలిచింది. జర్మనీలో 28,147 మంది విద్యార్థులు పీహెచ్ డీ పట్టా సాధించగా, యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో 25,020 పీహెచ్ డీ పట్టా పొందారు.
ఈ క్రమంలో భారతదేశం కూడా అగ్రదేశాల స్థానంలో నిలువడం గమనార్హం. అమెరికా, జర్మనీ, బ్రిటన్ ల తర్వాత భారతదేశం నాలుగో స్థానంలో నిలిచింది. 2014లో భారత్ నుంచి 24,300 మంది విద్యార్థులు పీహెచ్ డీ పట్టా సాధించారు. ఉన్నత విద్యకు ప్రాధాన్యతనిచ్చే జపాన్ ఈ విషయంలో వెనుకబడి ఉంది. అమెరికాలో సాధించే పట్టాలతో పోల్చితే నాలుగోవంతు కూడా జపాన్ లో లభించలేదు. జపాన్ దేశం ఆ ఏడాదిలో 16,039 మంది విద్యార్థులు పీహెచ్ డీ పట్టాలు సాధించగలిగారు.
ఇకపోతే, ఫ్రాన్స్ (13,729), దక్షిణ కొరియా (12,931) ఆరు, ఏడు స్థానాల్లో నిలిచాయి. ఎనిమది, తొమ్మిదవ స్థానాల్లో స్పెయిన్ (10,889), ఇటలీ (10,678) ఉన్నాయి. ఆస్ట్రేలియా (8,400) పదో స్థానంలో ఉంది. అయితే, ఆయా దేశాల్లోని జనాభా నిష్పత్తితో పోల్చితే మాత్రం ఈ స్థానాల్లో చాలా మార్పులు ఉంటాయని ఓఈసీడీ పేర్కొంది.
పెరుగుతున్న డాక్టరేట్లు
గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచ వ్యాప్తంగా డాక్టరేట్ సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఓఈసీడీ దేశాల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగిందని నివేదిక తెలిపింది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నత విద్య శిక్షణ విషయంలో ప్రమాణాలను చాలా వరకు మెరుగుపరుచుకుంటున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. అందుకు భారతదేశంలో డాక్టరేట్లు పెరగడమే అందుకు నిదర్శమని నివేదిక పేర్కొంది.
డాక్టరేట్ (పీహెచ్ డీ) డిగ్రీలు ప్రధానంగా సైన్స్ రంగంలోనే ఎక్కువగా లభిస్తున్నాయి. ఓఈసీడీ దేశాల్లో డాక్టరేట్ డిగ్రీలు సాధిస్తున్న వారిలో దాదాపు 40 శాతం సైన్స్, టెక్నాలటీ, ఇంజనీరింగ్, మాథమేటిక్స్ (ఎస్ టీ ఈ ఎం) రంగాల్లోనే ఉంటున్నాయి. (హెల్త్ కూడా ఇందులో ఉంది). అయితే ఫ్రాన్స్ (59 శాతం), కెనడా (55 శాతం), చైనా (55 శాతం) గ్రాడ్యుయేట్లు నేచురల్ సైన్సెస్, ఇంజనీరింగ్ రంగాల్లో మాత్రమే ఉంటున్నాయని నివేదిక తెలిపింది.