క్వశ్చన్‌ పేపర్‌ లీకేజీ ఆధారాలు ధ్వంసం | Question Paper Leakage Affair In Satavahana University | Sakshi
Sakshi News home page

Satavahana University: క్వశ్చన్‌ పేపర్‌ లీకేజీ ఆధారాలు ధ్వంసం

Published Sat, Aug 21 2021 12:46 AM | Last Updated on Sat, Aug 21 2021 8:12 AM

Question Paper Leakage Affair In Satavahana University - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/శాతవాహన యూనివర్సిటీ: ఇటీవల శాతవాహన యూనివర్సిటీలో కలకలం రేపిన ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నిందితులు, అనుమానితులు ఆధారాలు ధ్వంసం చేసే పనిలో పడ్డారు. ఈ నెల 18న ఈ వ్యవహారం వెలుగుచూసినా వర్సిటీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో సూత్రధారులు, పాత్రధారులు తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ మల్లేశ్‌ ఈ ఘటనపై నలుగురు సభ్యులతో విచారణ కమిటీ నియమించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే తొమ్మిది మంది విద్యార్థుల నుంచి మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని సీజ్‌ చేశారు. వీటి ఆధారంగా ప్రశ్నపత్రం ఎక్కడ నుంచి లీకైందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఫోన్‌లోని సమాచారం ఆధారంగా కొందరు అనుమానితులను గుర్తించిన కమిటీ వారిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా మొహర్రం, వరలక్ష్మీ వ్రతం, రాఖీపౌర్ణమి కావడంతో ఎవరూ అందుబాటులో లేకుండాపోయారని తెలిసింది. దీంతో కమిటీ విచారణలో పెద్దగా పురోగతి లేదని సమాచారం. 

ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలు కావడమే సమస్య.. 
ఈ వ్యవహారంలో నిందితులు తాము ఫొటోలు తీసి వైరల్‌ చేసిన ప్రశ్నపత్రం పోస్టులను డిలీట్‌ చేశారు. ఆ గ్రూపుల్లోంచి బయటకొచ్చేశారు. ఏకంగా ఫోన్లనే మాయం చేసే పనిలో పడ్డారు. విచారణ ఆలస్యమయ్యే కొద్దీ నిందితులు తప్పించుకునేందుకు మార్గం సుగమం అవుతుందని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వాట్సాప్‌ సందేశాలన్నీ ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలు (పోస్టు చేసిన వ్యక్తి, అవతలి వ్యక్తి మాత్రమే వీటిని చదువగలుగుతారు). మధ్యలో సమాచారం ఇతరులెవరూ చదవలేరు. కానీ.. లీక్‌ చేసిన వ్యక్తి నుంచి ఈ ప్రశ్నపత్రం అనేక విద్యార్థుల గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది.

దీంతో వారంతా దొరికిపోయే ప్రమాదముందన్న ఆందోళనతో కొందరు డిలీట్‌ చేస్తున్నారు. ఈ విషయంలో ఆందోళన అక్కర్లేదని, సీజ్‌ చేసిన ఫోన్లలో కావాల్సినంత సమాచారం ఉందని కమిటీ ధీమాగా ఉంది. అయినా.. ఈ విషయంలో పోలీసు దర్యాప్తుకే మొగ్గుచూపుతోందని సమాచారం. నేడో, రేపో ఈ లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

30 నిమిషాల్లోనే వాట్సాప్‌లో చక్కర్లు 
శాతవాహన వర్సిటీ పరిధిలో 98 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలోని చాలా కాలేజీల విద్యార్థులకు వాట్సాప్‌ ద్వారా లీకైన పేపర్‌ క్షణాల్లో చేరినట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రశ్నపత్రం వర్సిటీ నుంచి అరగంట ముందు ప్రిన్సిపాళ్లకు మెయిల్‌ ద్వారా అందుతుంది. 30 నిమిషాల్లోనే దీన్ని ఆయా సెంటర్లలో వివిధ సబ్జెక్టుల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రింట్లు తీసి పంపిణీ చేస్తారు. కానీ, ఆ రోజు పరీక్షా సమయాని కన్నా ముందే వాట్సాప్‌ గ్రూపుల్లో పేపర్‌ ప్రత్యక్షమైంది. దీంతో 30 నిమిషాల్లోనే పేపర్‌ లీకైందని అధికారులు నిర్ధారించారు.

వర్సిటీ పరీక్షల విభాగం.. చీఫ్‌ సూపరింటెండెంట్‌.. కంప్యూటర్‌ ఆపరేటర్లు.. పరీక్షా కేంద్రంలో వర్సిటీ నుంచి వచ్చే అబ్జర్వర్లు.. ప్రశ్నపత్రాలు పంపిణీ చేసే సిబ్బంది.. ఇన్విజిలేటర్లు.. వీరిలో ఒక ప్రాంతం నుంచే పేపర్‌ లీకయ్యే అవకాశాలున్నాయి. ఇందులో ఎవరు లీక్‌ చేశారో గుర్తిస్తే చిక్కుముడి వీడినట్లే. ఈ నెల 18న వర్సిటీ పరిధిలో మొత్తం 55 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 6వ సెమిస్టర్‌ 17,714 మంది, 4వ సెమిస్టర్‌ 16,710 మంది పరీక్షలు రాశారు. అదేరోజు కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలోని పరీక్షా కేంద్రంలో లీకేజీ ఉదంతం వెలుగుచూసింది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెమి స్టర్‌లో మరిన్ని పేపర్లు లీకయ్యాయన్న ప్రచారం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కలకలం రేపుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement