sathavahana university
-
క్వశ్చన్ పేపర్ లీకేజీ ఆధారాలు ధ్వంసం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/శాతవాహన యూనివర్సిటీ: ఇటీవల శాతవాహన యూనివర్సిటీలో కలకలం రేపిన ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నిందితులు, అనుమానితులు ఆధారాలు ధ్వంసం చేసే పనిలో పడ్డారు. ఈ నెల 18న ఈ వ్యవహారం వెలుగుచూసినా వర్సిటీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో సూత్రధారులు, పాత్రధారులు తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ మల్లేశ్ ఈ ఘటనపై నలుగురు సభ్యులతో విచారణ కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తొమ్మిది మంది విద్యార్థుల నుంచి మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని సీజ్ చేశారు. వీటి ఆధారంగా ప్రశ్నపత్రం ఎక్కడ నుంచి లీకైందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఫోన్లోని సమాచారం ఆధారంగా కొందరు అనుమానితులను గుర్తించిన కమిటీ వారిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా మొహర్రం, వరలక్ష్మీ వ్రతం, రాఖీపౌర్ణమి కావడంతో ఎవరూ అందుబాటులో లేకుండాపోయారని తెలిసింది. దీంతో కమిటీ విచారణలో పెద్దగా పురోగతి లేదని సమాచారం. ఎన్క్రిప్టెడ్ సందేశాలు కావడమే సమస్య.. ఈ వ్యవహారంలో నిందితులు తాము ఫొటోలు తీసి వైరల్ చేసిన ప్రశ్నపత్రం పోస్టులను డిలీట్ చేశారు. ఆ గ్రూపుల్లోంచి బయటకొచ్చేశారు. ఏకంగా ఫోన్లనే మాయం చేసే పనిలో పడ్డారు. విచారణ ఆలస్యమయ్యే కొద్దీ నిందితులు తప్పించుకునేందుకు మార్గం సుగమం అవుతుందని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వాట్సాప్ సందేశాలన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ సందేశాలు (పోస్టు చేసిన వ్యక్తి, అవతలి వ్యక్తి మాత్రమే వీటిని చదువగలుగుతారు). మధ్యలో సమాచారం ఇతరులెవరూ చదవలేరు. కానీ.. లీక్ చేసిన వ్యక్తి నుంచి ఈ ప్రశ్నపత్రం అనేక విద్యార్థుల గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో వారంతా దొరికిపోయే ప్రమాదముందన్న ఆందోళనతో కొందరు డిలీట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆందోళన అక్కర్లేదని, సీజ్ చేసిన ఫోన్లలో కావాల్సినంత సమాచారం ఉందని కమిటీ ధీమాగా ఉంది. అయినా.. ఈ విషయంలో పోలీసు దర్యాప్తుకే మొగ్గుచూపుతోందని సమాచారం. నేడో, రేపో ఈ లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 30 నిమిషాల్లోనే వాట్సాప్‌లో చక్కర్లు శాతవాహన వర్సిటీ పరిధిలో 98 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలోని చాలా కాలేజీల విద్యార్థులకు వాట్సాప్ ద్వారా లీకైన పేపర్ క్షణాల్లో చేరినట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రశ్నపత్రం వర్సిటీ నుంచి అరగంట ముందు ప్రిన్సిపాళ్లకు మెయిల్ ద్వారా అందుతుంది. 30 నిమిషాల్లోనే దీన్ని ఆయా సెంటర్లలో వివిధ సబ్జెక్టుల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రింట్లు తీసి పంపిణీ చేస్తారు. కానీ, ఆ రోజు పరీక్షా సమయాని కన్నా ముందే వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ ప్రత్యక్షమైంది. దీంతో 30 నిమిషాల్లోనే పేపర్ లీకైందని అధికారులు నిర్ధారించారు. వర్సిటీ పరీక్షల విభాగం.. చీఫ్ సూపరింటెండెంట్.. కంప్యూటర్ ఆపరేటర్లు.. పరీక్షా కేంద్రంలో వర్సిటీ నుంచి వచ్చే అబ్జర్వర్లు.. ప్రశ్నపత్రాలు పంపిణీ చేసే సిబ్బంది.. ఇన్విజిలేటర్లు.. వీరిలో ఒక ప్రాంతం నుంచే పేపర్ లీకయ్యే అవకాశాలున్నాయి. ఇందులో ఎవరు లీక్ చేశారో గుర్తిస్తే చిక్కుముడి వీడినట్లే. ఈ నెల 18న వర్సిటీ పరిధిలో మొత్తం 55 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 6వ సెమిస్టర్ 17,714 మంది, 4వ సెమిస్టర్ 16,710 మంది పరీక్షలు రాశారు. అదేరోజు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలోని పరీక్షా కేంద్రంలో లీకేజీ ఉదంతం వెలుగుచూసింది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెమి స్టర్లో మరిన్ని పేపర్లు లీకయ్యాయన్న ప్రచారం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కలకలం రేపుతోంది. -
ఖాళీల ‘వర్సిటీ’..!
శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో ఎక్కడ చూసినా ఖాళీలే కనిపిస్తున్నాయి. ఏళ్ల నుంచి పోస్టులు ఖాళీగా ఉండడంతో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. యూనివర్సిటీకి ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్(వీసీ) ఉండడంతో రిక్రూట్మెంట్కు ముందుకు రాకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వం కూడా పెద్దగా దృష్టి సారించకపోవడం కూడా మరో కారణమని విద్యావేత్తల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఖాళీ ఉండడంతో ఉన్న వారిపై పనిభారం పడుతోంది. అభివృద్ధి పనులు కొంతకాలంగా సాగుతున్నా పూర్తిస్థాయి, రెగ్యులర్ ఉద్యోగులుంటే అన్ని రకాలుగా యూనివర్సిటీ అభివృద్ధి చెందుతుంది. వరుస ఎన్నికలు కూడా పోస్టుల భర్తీకి అడ్డంకిగా నిలుస్తున్నాయి. పూర్తిస్థాయి వీసీ నియామకం ఆలస్యమైతే ఇన్చార్జితోనే రిక్రూట్మెంట్ చేసి ఖాళీలను భర్తీ చేయాలని వివిధ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. 70 శాతం పైగా ఖాళీలే... యూనివర్సిటీలో టీచింగ్ నాన్‌టీచింగ్ విభాగాల్లో పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. శాతవాహనలో టీచింగ్‌కు సంబంధించి 65 పోస్టులకు ప్రస్తుతం రెగ్యులర్ పోస్టులు 20 మంది మాత్రమే ఉండగా మిగతా 45 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రొఫెసర్లు 10కి 10 ఖాళీలుండగా, అసోసియేట్ ప్రొఫెసర్లు16కు 16 ఖాళీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 37కు 20 మంది ఉండగా, 17 పోస్టులు ఖాళీలున్నాయి. నాన్ టీచింగ్ విషయానికి వస్తే మొత్తం 51 పోస్టులుండగా 13 పోస్టులు మాత్రమే భర్తీ కాగా 38 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద... యూనివర్సిటీలో కేటాయించిన పోస్టుల్లోనే దాదాపు టీచింగ్‌లో 70 శాతం వరకు ఖాళీ ఉండగా నాన్‌టీచింగ్‌లో దాదాపు 75 శాతం వరకు ఖాళీలున్నాయి. ఇవి కాకుండా టీచింగ్‌లో మరో 40కిపైగా పోస్టులు, నాన్‌టీచింగ్‌లో మరో 44 పోస్టులు అవసరమని యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఆయా పోస్టులకు సంబంధించిన ఫైళ్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నట్లు శాతవాహన అధికార వర్గాల సమాచారం. వీటితోపాటు 12బీకి సంబంధించిన దస్త్రాలు కూడా సీఎం కార్యాలయంలోనే ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు ముగిస్తే కానీ వీటి విషయంలో స్పష్టత రాదని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఇన్చార్జి వీసీ పాలనే గత నాలుగేళ్లకు పైగా కొనసాగుతోంది. ఇన్చార్జి వీసీ ఉండగా నియమకాలు చేపట్టేందుకు ముందకు రావడం లేదని తెలుస్తోంది. గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు అనేక సార్లు ధర్నాలు చేశాయి. దీంతో ఇన్చార్జి పాలనలో నియమాకాలు జరుగుతాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు ముగిస్తేనే ముందుకు... యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలంటే ఎన్నికలు ముగిసే వరకు ఆగాల్సిందేనని తెలుస్తోంది. ప్రస్తుతం గత 8 నెలల నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఉండడంతో నియామక, 12బీ గుర్తింపు పక్రియ ముందుకు సాగడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి ఫలితాలు రాగానే మున్సిపల్ ఎన్నికల కోడ్ కూసేలా ఉంది. ఇదే జరిగితే మరో రెండు మూడు నెలలు భర్తీ పక్రియ పెండింగ్ పడుతుందని విద్యావేత్తలు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత రెగ్యులర్ వీసీ నియామక ప్రక్రియ ఆలస్యమయితే ఇన్చార్జి వీసీతోనైనా నియామకాలు జరిపి ఖాళీగా ఉన్న పోస్టులతోపాటు అవసరమున్న మరిన్ని పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. -
అడ్డ‘దారులు’
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఎంటెక్ పూర్తిచేసి.. అదే జిల్లాలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు తాను పీహెచ్డీ పూర్తిచేశానని తనకు వేతనం పెంచాలని కోరుతూ.. ఇతర రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీకి చెందిన డాక్టరేట్ పట్టా తీసుకొచ్చి యాజమాన్యం చేతిలో పెట్టాడు. కంగుతిన్న సదరు యాజమాన్యం.. సదరు అధ్యాపకుడి ఉద్యోగ హాజరును పరిశీలించింది. సెలవులు పెద్దగా పెట్టలేదని గమనించి.. కళాశాలలో పనిచేస్తూనే పీహెచ్డీ ఎలా పూర్తిచేశావని ప్రశ్నించగా.. తెల్లముఖం వేశాడు. చేసేదిలేక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానే కొనసాగుతున్నాడు. ఇలా ఈ ఒక్క అధ్యాపకుడే కాదు.. జిల్లాకు చెందిన చాలా మంది వివిధ రాష్ట్రాల్లో పీహెచ్డీ పూర్తిచేసినట్లు ‘నకిలీ’ సర్టిఫికెట్లు సృష్టించి.. కళా శాలల్లో చేరి.. ఉద్యోగాలు చేస్తున్నారు. శాతవాహనయూనివర్సిటీ: ఇంజినీరింగ్ కళాశాలల అధ్యాపకుల్లో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం దూమారం రేపుతోంది. కొంతమంది డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పట్టాలు నకిలీవి పట్టుకుని ఉద్యోగాల్లో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయం జేఎన్టీయూ (హెచ్) అధికారుల తనిఖీల్లో వెలుగుచూస్తుండడం కలవరపెడుతోంది. హైదరాబాద్‌లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్ స్థాయి హోదాలో పనిచేస్తున్నవారే నకిలీ సర్టిఫికెట్లు పెట్టినట్లు వెలుగుచూడడంతో గవర్నర్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుల సమగ్ర వివరాలతో నివేదిక పంపించాలని ఉన్నత విద్యామండలి అధికారులను ఇటీవల ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు జేఎన్టీయూ అధికారులు ఆయా కళాశాలల్లోని అధ్యాపకులతోపాటు జేఎన్టీయూ పరిధిలోని పలు కళాశాలల్లో పనిచేస్తున్నవారి సర్టిఫికెట్లను తనిఖీ చేస్తోంది. ఇందులోభాగంగా అనేక లొసుగులు బయటపడుతున్నట్లు సమాచారం. అధికారుల అంచనా ప్రకారం 150 మందికిపైగా అధ్యాపకులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తుండగా.. వీరిలో కరీంనగర్ జిల్లాకు చెందినవారూ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జేఎన్టీయూ అధికారులు తనిఖీలకు రమ్మని పిలవగా.. జిల్లాలోని పలు కళాశాలల అధ్యాపకులు వెళ్లకుండా మల్లాగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. అధికారులు పిలిచినా వెళ్లడం లేదంటే వారి సర్టిఫికెట్లు నకిలీవేనా..? అనే సందేహాలు విద్యావేత్తలో వ్యక్తమవుతోంది. అధికారులు స్పందించి.. తనిఖీ ప్రక్రియను వేగవంతం చేసి.. నకిలీలపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బయటపడనున్న బాగోతం.. ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుల నకిలీ సర్టిఫికెట్ల బాగోతం త్వరలోనే బట్టబయలు కానుందని అధికారవర్గాల ద్వారా సమాచారం. తప్పుడు ధ్రువీకరణపత్రాలు సృష్టించిన వారి ఏరివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నకిలీ ధ్రువీకరణపత్రాలతో అధ్యాపకులుగా కొనసాగుతున్నవారితో విద్యాప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి పత్రాలు సృష్టించిన వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 30మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. జేఎన్టీయూ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో 150మందికి పైగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని నోటీసులు పంపించగా.. కేవలం 60మందే హాజరయ్యారు. ఇక కరీంనగర్లో పనిచేస్తున్న వారు వెళ్లేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. గవర్నర్ ఆదేశాలతో.. పీహెచ్డీ సర్టిఫికెట్లు నకిలీవీ పెట్టిన అధ్యాపకుల సమగ్ర వివరాలతో నివేదిక పంపించాలని రాష్ట్ర గవర్నర్ ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. గతంలోని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన పీహెచ్డీ పట్టాలు, కోర్సులు, అభ్యర్థుల సంఖ్య, తదితర వివరాలు పంపించాలని ఉన్నతవిద్యామండలిని కోరారు. ఇందులో ముఖ్యంగా ఏయే యూనివర్సిటీ ఎన్నెన్ని పీహెచ్‌డీలు ప్రదానం చేసింది..? ప్రస్తుతం ఏయే విభాగాల్లో ఎంతమంది పీహెచ్డీ చేస్తున్నారు..? ఎన్నేళ్లుగా చేస్తున్నారు..? అనే వివరాలు కోరారు. దీంతో ఉన్నత విద్యామండలి రెండు నెలల క్రితమే అన్ని యూనివర్సిటీలకు పీహెచ్డీ వివరాలు పంపించాలని ఆదేశించింది. అన్ని యూనివర్సిటీలు సంబంధిత వివరాలు పంపించాయి. ఈ క్రమంలోనే నకీలీల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు జెఎన్టీయూ అధికారులు సైతం నకిలీలపై దృష్టి నోటీసులు పంపించడం, తనిఖీలు చేపట్టడం వంటి చర్యలు చేపడుతోంది. నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని తేలితే కఠినచర్యలు పాల్పడనున్నట్లు సమాచారం. నకిలీలతో యాజమాన్యాలకే మోసం కరీంనగర్‌లోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లోని కొందరు అధ్యాపకులు తప్పుడు పీహెచ్డీ ధ్రువపత్రాలు కలిగి ఉన్నట్లు తీవ్ర ప్రచారం కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లా మొత్తం నకిలీ సర్టిఫికెట్ల బాగోతం హాట్‌టాఫిక్‌గా మారింది. ఇలా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి.. యాజమాన్యాలనే మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతర ప్రదేశాల నుంచి వచ్చినవారు వివిధ కళాశాలల నుంచి తప్పుడు పత్రాలతోనే ఉద్యోగాలు సాధించినట్లు సమాచారం. నగర సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఒక విభాగానికి చెందిన అధ్యాపకుడు పీహెచ్డీ పట్టా కొనుక్కొని వచ్చారని.. అయినా యాజమాన్యం సదరు విభాగం తరఫున డాక్టరేట్‌గా యూనివర్సిటీకి చూపిస్తున్నట్లు సమాచారం. కొందరు అధ్యాపకుల సర్టిఫికెట్ల వ్యవహారం యాజమాన్యాలకు తెలిసినా.. కిమ్మనకుండా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అర్హత ఉన్నవారితోనే విద్యాబోధన జరిగితే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. నకిలీలపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు, విద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
స్కాలర్షిప్ దరఖాస్తులకు బ్రేక్!
శాతవాహనయూనివర్సిటీ: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులు 2018–19 విద్యాసంవత్సరంలో కొత్తగా ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. కానీ.. దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఇంటర్నెట్ కేంద్రాలను ఆశ్రయిస్తే సంబంధిత కళాశాలలు, కోర్సుల వివరాలు లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కారణమేం టని కళాశాలల యాజమాన్యాలను ప్రశ్నిస్తే.. యూనివర్సిటీ అధికారులు, ఈ–పాస్ అధికా రుల చేతుల్లో ఉంటుందని చెబుతున్నారు. ఈనెల 30తో కొత్త దరఖాస్తుల గడువు ముగుస్తుండడంతో విద్యార్థులు కలవరపడుతున్నారు. జూలై 1న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెలాఖరున ముగియనుంది. కానీ.. నేటికీ కొత్తగా కోర్సుల్లో చేరిన డిగ్రీ విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ ఈ–పాస్‌లో కళాశాలల వివరాలు లేకపోవడంతో సాధ్యపడడం లేదు. ఏటా యూనివర్సి టీ అధికారులు అనుబంధ హోదా పక్రియ ముగి సిన తర్వాత హోదా దక్కిన కళాశాలల వివరాల ను ఈ–పాస్‌కు అనుసంధానం చేయాల్సి ఉం టుంది. అయితే నేటికీ ఈ ప్రక్రియ పూర్తికాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు తలపట్టుకుంటున్నారు. యూనివర్సిటీ అధికారులు, ఈ–పాస్ అధికారులు ఈ విషయంలో జా ప్యం వీడి వెంటనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోనేలా వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాలని విద్యార్థులు, వి ద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యమవుతున్న పక్రియ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తీసుకున్న వారు ఉపకారవేతనాల దరఖాస్తుకు సిద్ధమయ్యారు. ఆ ప్రక్రియ ప్రారంభమై దాదాపు 70 రోజులు గడిచినా ఇంతవరకు దరఖాస్తు చేసుకోనే వీలులేకపోవడంతో ప్రతిరోజూ ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ల డం.. నిరాశతో తిరిగి రావడం విద్యార్థుల వంతవుతోంది. కొందరు విద్యార్థులు ఆయా కళాశాలల యాజమాన్యాలను ఆశ్రయిస్తే.. యూనివర్సిటీ, ఈ పాస్ అధికారుల చేతులో ఉంటుందని సర్దిచెబుతూ వస్తున్నారు. కానీ అసలు విషయం మరో లా ఉంది. శాతవాహన యూనివర్సిటీ అధికారులకే ఈపాస్‌కు సంబంధించిన లాగిన్ సమాచారం లేకపోవడంతోనే కళాశాలల వివరాలు అనుసంధానం కాలేదని సమాచారం. కేవలం శాతవాహనకే కాకుండా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఇలాగే ఉన్నట్లు సమాచారం. ఈ పాస్ అధికారులు యూనివర్సిటీ అధికారులకు కావాల్సిన లాగిన్ సమాచారమిస్తేనే కళాశాలల వివరాలు ఈ–పాస్‌లో నమోదయ్యే అవకాశముంటుంది. తర్వాత యథావిధిగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది. అనుసంధానం పూర్తయ్యేదెన్నడో...! ఉపకార వేతనాల దరఖాస్తులు ప్రారంభం రోజులు గడుస్తున్నా నేటికీ అవకాశం లేకపోవడంతో డిగ్రీ మొదటి సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపాస్ అధికారులు యూనివర్సిటీ అధికారులకు అనుసంధానికి కావాల్సిన సమాచారం ఇవ్వకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ జాప్యానికి కారణమవుతుందని అధికారులు చెబుతున్నారు. అనుబంధ హోదా ప్రకటించిన తర్వాత ఆయా కళాశాలలు, కోర్సుల వివరాలను యూనివర్సిటీ అధికారులు అనుసంధానం చేస్తేనే విద్యార్థులకు దరఖాస్తులు చేసుకునే అవకాశముంటుంది. గడువు ఈనెల 30 వరకు ఉందిగానీ శాతవాహన అధికారులకే లాగిన్ సమాచారం లేకపోవడంతో అనుసంధానం ఆలస్యమవడం ఖాయమని తెలుస్తోంది. కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ–పాస్ అధికారులు, యూనివర్సిటీలకు లాగిన్ సమాచారమందిస్తాయని, అనంతరం అనుసంధాన ప్రక్రియ జరుగుతుందని, అప్పటి వరకు విద్యార్థులు వేచిచూడక తప్పదని అధికారవర్గాల ద్వారా సమాచారం. ఈ–పాస్ అధికారులు సత్వరమే స్పందించి దరఖాస్తుల ప్రక్రియలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మేలు చేకూర్చాలని విద్యార్థులు కోరుతున్నారు. లాగిన్ సమాచారం రాలేదు... ఈ ఏడాది డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్నవారికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఈ పాస్ అధికారుల నుంచి శాతవాహనకు లాగిన్ సమాచారం రాలేదు. కళాశాలల సమాచారం అనుసం«ధానం చేయలేదు. శాతవాహనతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఇలాగే ఉంది. కాకతీయ, శాతవాహన పరిధిలోని పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. అయిన తర్వాత లాగిన్ సమాచారం వచ్చి అనుసంధానం చేసే అవకాశాలుంటాయి. – ఉమేష్‌కుమార్, శాతవాహన రిజిస్ట్రార్ -
ఫలించని ‘దోస్త్’ ప్రయత్నాలు!
శాతవాహనయూనివర్సిటీ (కరీంనగర్): డిగ్రీలో ‘దోస్త్’ అధికారులు అందించిన ప్రత్యేక దశ ప్రవేశాల ప్రయత్నం ఫలించలేదు. శాతవాహన యూనివర్సిటీలో సీట్ల భర్తీ వేల సంఖ్యలో పెరుగుతుందని ఆశించినా వారి ఆలోచనలు తారుమారై 330 సీట్లకే పరిమితమైంది. ఇందులోనూ కేవలం 253 సీట్లు మాత్రమే అభ్యర్థులతో నిర్ధారించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సుల్లో సీట్ల భర్తీ సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఐదు దశల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఎంసెట్‌తో సహా వివిధ కోర్సుల కౌన్సెలిం గ్లో పూర్తై.. అందులో సీట్లు రానివారు ప్రత్యేక దశ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరుతారని భావించినా.. సీట్ల సంఖ్యలో మాత్రం వృద్ధి కనిపించలేదు. కళాశాల మార్పిడి, అంతర్గత కోర్సుల మార్పిడికి అవకాశం ఇచ్చినా సీట్ల సంఖ్య పెరగలేదు. ఎస్‌యూ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కలుపుకుని 113 కళాశాలల్లో 45,471 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వివిధ కోర్సుల్లో కలుపుకుని సోమవారం సాయంత్రం వరకు 21,886 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వర్సిటీలు 1041 కళాశాలల్లో కలుపుకుని ప్రత్యేకదశలో కేవలం 2,578 సీట్ల భర్తీ అయ్యాయి. ఇందులో ఎస్‌యూది 10 శాతమే. ప్రైవేటు కళాశాలలు కొత్తవారితోపాటు వివిధ కళాశాలల్లో చేరినవారికి ఎన్ని ఆఫర్లు ప్రకటించినా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్ల మార్పు జరగకపోవడంతో యాజమాన్యాల్లో నిరాశ నెలకొంది. సగం కూడా నిండలేదు దోస్త్ అధికారులు ప్రత్యేక దశతో పాటు ఐదు దశలు ప్రవేశాలకు అనుమతించినా ఆశించిన స్థాయిలో సీట్ల భర్తీ పెరగలేదు. శాతవాహన యూనివర్సిటీలో నాలుగేళ్లుగా డిగ్రీ ప్రవేశాలు నేలచూపులు చూస్తున్నాయి. గతంలో పలుమార్లు సీట్ల భర్తీ తీరును పరిశీలిస్తే.. భర్తీ కంటే ఖాళీగా మిగిలిన సీట్లే ఎక్కువగా ఉన్నాయి. వర్సిటీ పరి«ధిలోని 18 ప్రభుత్వ కళాశాలలు, 96 ప్రవేట్ కళాశాలల్లో కలుపుకుని బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం వంటి కోర్సుల్లో 45,471 సీట్లు ఉన్నాయి. మొదటిదశ 13,177 సీట్లు కేటాయించారు. రెండోదశలో 5,743 సీట్ల కేటాయింపుతో నిరాశ పరిచింది. మూడోదశ కేటాయింపు పూర్తయిన తర్వాత యూనివర్సిటీ వ్యాప్తంగా 20,023 సీట్లు కేటాయించగా.. 33.85 భర్తీ శాతం నమోదైంది. గతంలో ఇచ్చిన నాలుగు దశలో 20,350 సీట్లవరకు భర్తీ అయ్యింది. ప్రత్యేక దశ ద్వారా కేవలం 300 సీట్లు కేటాయించగా.. 253 సీట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ఐదుగంటల వరకు 21,886 సీట్లు కన్ఫర్మ్ చేసుకోగా.. చివరగా ఈ విద్యాసంవత్సరం యూనివర్సిటీలో 23,585 సీట్లు మిగిలాయి. కళాశాలలకు నిరాశే సీట్ల నింపుకోవడానికి అవస్థలు పడిన పలు ప్రైవేట్ కళాశాలలు.. ప్రత్యేక దశ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశపడ్డాయి. కొత్తవారిని, వివిధ కళాశాలల్లో సీటు పొందినవారిపై ఆఫర్ల వర్షం కురిపించి ఆకర్షించాలని చేసిన ప్రయత్నాలు పారలేదు. కొందరు విద్యార్థులు మారుదామని ప్రయత్నించినా.. గతంలో సీటు వచ్చిన కళాశాలలు మాయమాటలు, వివిధ ఆఫర్లు ప్రకటించి ఆయా సీట్లు చేజారిపోకుండా జాగ్రత్తపడినట్లు సమాచారం. పీఆర్వోలు, లెక్చరర్లు, మధ్యవర్తుల ద్వారా ప్రవేశాలు పెంచుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఒకటి, రెండు దశల్లోనే అనుకున్న రీతిలో సీట్లను సంపాదించగలిగాయి. ఆ తర్వాత జరిగిన మూడుదశల్లో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఏదేమైనా మున్ముందు డిగ్రీ కోర్సులు చేయడానికి ముందుకు వచ్చేవారి సంఖ్య ఏటేటా పడిపోతోందని విద్యారంగనిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకనుగుణంగా ఎప్పుటికప్పుడు కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ డిగ్రీకి పూర్వ వైభవం తీసుకురావాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
గవర్నర్‌కు పీహెచ్డీ వివరాలు
శాతవాహనయూనివర్సిటీ (కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీలోని పీహెచ్డీ కోర్సులకు సంబంధించిన వివరాలు నేడు గవర్నర్‌కు చేరనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనిర్సిటీలోని పీహెచ్డీ ప్రవేశాలు, కోర్సులతో పాటు పూర్తి సమాచారాన్ని ఉన్నత విద్యామండలి సేకరిస్తోంది. ఇటీవల గవర్నర్ నరసింహన్, విద్యాశాఖ మంత్రితో కలిసి పాల్గొన్న ఓ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డిని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన పీహెచ్డీ ప్రవేశాలు, పట్టాలు, కోర్సులు, అభ్యర్థుల సంఖ్యతో పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 20లోపు సంబంధిత సమాచారాన్ని అందించాలని అన్ని వర్సిటీలకు లేఖలు రాసారు. నేడు పీహెచ్డీ వివరాలను శాతవాహన యూనివర్సిటీ అధికారులు ఉన్నత విద్యామండలికి పంపించనున్నారు. గతంలో ప్రవేశాలు, కొనసాగుతున్న పరిశోధనల వివరాలు, అభ్యర్థుల సంఖ్య, ఇటీవల పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇచ్చిన నోటిఫికేషన్‌తో సమగ్ర వివరాలు అందించనున్నారు. పీహెచ్డీ స్థాయిని దిగజార్చొద్దని.. డాక్టర్ ఆఫ్ ఫిలాసపీ(పీహెచ్డీ) సాధారణ డిగ్రీ కాదు. భవిష్యత్తరాలకు ఉపయోగపడే ఓ పరిశోధన. దీని స్థాయిని దిగజార్చవద్దని, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా ప్రవేశాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న విషయాన్ని గవర్నర్ నరసింహన్ తీవ్రంగా పరిగణించారు. దీంతో ఇటీవల ఉన్నత విద్యామండలి చైర్మన్‌తో జరిగిన ఒక సమావేశంలో ఇప్పటి వరకు ఏఏ యూనివర్సిటీ ఎన్నెన్ని పీహెచ్‌డీలు ప్రదానం చేసింది..? ప్రస్తుతం ఏఏ యూనివర్సిటీలలో ఏఏ విభాగాల్లో ఎంతమంది పీహెచ్డీ చేస్తున్నారు. ఎన్నేళ్లుగా చేస్తున్నారు..? అనే సమగ్ర వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని గవర్నర్ సూచించారు. ఆరు విభాగాల్లో పీహెచ్డీ.. శాతవాహనయూనివర్సిటీలో 2015– 16 సంవత్సరంలో పీహెచ్డీ కోర్సు ప్రారంభమైంది. ఉర్దూ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సోషియాలజీ, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో కలుపుకుని 14 మంది నమోదవగా.. దాదాపు 11మందే కోర్సును కొనసాగిస్తున్నారని సమాచారం. ఈ విద్యా సంవత్సరం కూడా పీహెచ్డీ నోటిఫికేషన్‌ను శాతవాహనయూనివర్సిటీ నెలక్రితమే ప్రకటించింది. దరఖాస్తులకు ఈ నెల 14తేదీ వరకు అనుమతించింది. సెట్‌తో పాటు వివిధ పరీక్షల ఫలితాలు వెలువడే వరకు గడువును పొడగించాలని వివిధ విద్యార్థి సంఘాలు, పీహెచ్డీ అభ్యర్థులు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్ళారు. ఇటీవల మళ్ళీ దరఖాస్తుల గడువును ఈ నెల 30 తేదీ వరకు పొడగిస్తూ ప్రకటన వెలువరించారు. ఐదేళ్లు దాటిన వారి ప్రవేశాలు రద్దు... నాలుగైదేళ్లకు మించి పీహెచ్‌డీకి సమయం ఇవ్వకూడదని ఉన్నతవిద్యామండలి నిబంధనలు విధించనుంది. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం అమలు చేసేందుకే శాతవాహనతో పాటు వివిధ యూనివర్సిటీల నుండి సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నారు. ఐదేళ్ళు దాటినవారి ప్రవేశాలు రద్దు చేయాలని , అలాంటి వారు ఎందరున్నారో తేల్చాలని వైస్ ఛాన్సిలర్లకు ఆదేశాలు అందాయి. పీహెచ్డీ ప్రవేశాలను నట్,స్లెట్ ప్రతిభ ఆధారంగా చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని గవర్నర్ ఇటీవల స్పష్టం చేశారు. పీహెచ్డీ ప్రవేశాల్లో ఒక్కో యూనివర్సిటీ ఒక్కో తీరును ప్రదర్శిస్తోంది. అన్ని ఒకే రకమైన నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే త్వరలోనే శాతవాహన పీహెచ్డీ ప్రవేశాలు కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని యూనివర్సిటీల నిబంధనల ప్రకారమే సాగనున్నాయి. పీహెచ్డీ వివరాలపై రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డిని సంప్రదించగా ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం వారు కోరిన సమాచారాన్ని సోమవారం పంపుతున్నట్లు వివరించారు. -
‘శాతవాహనలో అక్రమాలపై మౌనం ఎందుకు?’
హైదరాబాద్: శాతవాహన యూనివర్శిటీ లో జరిగిన అవినీతిపై సర్కార్ పెద్దల మౌనం వెనుక అంతర్యం ఏమిటని పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ ప్రశ్నించారు. వర్సిటీలో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని ఆరోపించారు. అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారనే విషయం సమాచార హక్కు ద్వారా తేలిందని వెల్లడించారు. ఈ అక్రమ నియామకాల్లో మంత్రి కడియం శ్రీహరికి వాటా ఉందని ఆరోపించారు. వర్సిటీలో మూడేళ్లుగా ఇంటర్నల్ ఆడిట్ జరగనే లేదని వివరించారు. గత మూడేళ్లలో రూ.300 కోట్ల మేర అవినీతి జరిగిందని తెలిపారు. మంత్రి కడియం శ్రీ హరిపైనా ఇంచార్జి వీసీ జనార్దన్ రెడ్డితో పాటు వీసీ కోమల్ రెడ్డి పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థను ఉద్దరిస్తానని చెప్పిన కేసీఆర్ యూనివర్సిటీ లో జరుగుతున్న ఈ అవినీతిపై ఎందుకు స్పందించరన్నారు. ఆయన స్పందించకపోతే కాంగ్రెస్ పక్షాన న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. -
బీఈడీకి జోష్
శాతవాహన యూనివర్సిటీ : కొంతకాలంగా విద్యార్థులు పెద్దగా శ్రద్ధ చూపని బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుకు ఈ ఏడాది డిమాండ్ పెరిగింది. ఈ కోర్సును రెండేళ్లకు పెంచాలని ఇటీవల కేంద్రం నిర్ణయించడం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతుందన్న ప్రచారం నేపథ్యంలో సీట్లకు గిరాకీ పెరిగింది. గతేడాది రూ.30 వేలు ఉన్న సైన్స్ సీటు ఇప్పుడు రూ.70 వేలు పలుకుతోంది. ఆర్ట్స్ విభాగంలో బీఈడీ సీటు రూ. లక్షల్లో పలుకుతోంది. కౌన్సెలింగ్ నిర్వహించకముందే మేనేజ్మెంట్ సీట్లపై బేరసారాలు మొదలయ్యాయి. కళాశాలల యాజమాన్యాలు ఇదే అదనుగా భావిస్తూ రేట్లు పెంచుతున్నాయి. జిల్లాలో బీఈడీ సీట్లకు పెరిగిన డిమాండ్‌పై కథనం.. రెండేళ్ల కోర్సుతో.. సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకానికి కేవలం డీఈడీ చేసిన అభ్యర్థులే అర్హులనే ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో బీఈడీ కోర్సు ఆదరణ తగ్గింది. బీఈడీ కోర్సు నిర్వహణలో ఆర్థిక భారాన్ని డీఈడీ కోర్సుతో సర్దుకునేందుకు ఒకే ప్రాంగణంలో కళాశాలల యాజమన్యాలు ఈ రెండు కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇటీవల కాలంలో బీఈడీ కోర్సు రెండేళ్ల ప్రతిపాదన రావడంతో ఇప్పుడు బీఈడీ సీట్లకు రెక్కలొచ్చాయి. రెండింతలు బీఈడీ కళాశాలల్లోని మేనేజ్మెంట్ సీట్ల ధరలు గతం తో పోలిస్తే రెండింతలయ్యాయి. గతంలో మ్యాథ్స్, సై న్స్ సీట్లు దాదాపు రూ.30వేల నుంచి రూ.45 వేల వర కు పలికాయి. ప్రస్తుతం అవే సీట్లు రూ.70 వేలకు చేరా యి. ఆర్ట్స్ సీట్ల ధరలు వింటే మైండ్ బ్లాక్ కావాల్సిందే. కౌన్సెలింగ్ విషయంలో నేటికి స్పష్టత లేకున్నా అభ్యర్థులు మాత్రం ముందుగానే సీట్లను దక్కించుకునే పనిలో పడ్డారు. కరీంనగర్‌లోని అనేక కళాశాలల్లో మహిళలు సీట్లు తీసుకునేందుకు శ్రద్ధ వహించడంతో యాజమాన్యాలు రేట్లు పెంచుతున్నాయి. కౌన్సెలింగ్‌పై సందిగ్ధత బీఈడీ కౌన్సెలింగ్‌పై ఇప్పటికీ అధికారిక ఉత్తర్వులు రాలేదు. గత నెల ప్రవేశాలు జరుగుతాయని భావించి నా, అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కౌన్సెలింగ్ విషయంలో అధికారిక ప్రకటన రాకముందు ఎప్పుడు నిర్వహించేది తేల్చలేమని కేయూ అధికారులు పేర్కొంటున్నారు. 2013-14 విద్యాసంవత్సరం బీఈ డీ పరీక్షలు సెప్టెంబ ర్లో ఉన్నందున అక్టోబర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలున్నా య ని బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో బీఈడీ కళాశాలల సీట్ల వివరాలు.. జిల్లాలో 19 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 1,940 సీట్లు ఉన్నాయి. ప్రతీ కళాశాలలో 20 శాతం సీట్లను కళాశాల మేనేజ్మెంట్ కోటా కింద అమ్ముకునేందుకు అవకాశం ఉంది. రెండేళ్ల ప్రచారం నేపథ్యం లో కరీంనగర్‌తోపాటు శివారులోని బీఈడీ కళాశాలల్లో అధికంగా సీట్లు అమ్ముడుపోయే అవకాశాలున్నాయి. రంగంలోకి ఇతర రాష్ట్రాల పీఆర్వోలు స్వరాష్ట్రంలో సీటు రేటు అధికంగా ఉంటుందనే విషయాన్ని చెబుతూ ఇతర రాష్ట్రాల బీఈడీ కళాశాలల పీఆ ర్వోలు జిల్లా వాసులను బుట్టలో వేసే పనుల్లో పడ్డారు. మా కళాశాలలో చేరితే రికార్డ్స్ రాయనవసరం లేదని, కళాశాలకు హాజరుకావాల్సి అవసరమే లేదని మభ్యపె డుతున్నారు. పరీక్షల సమయంలో ఆయా ప్రాంతాలలో హాస్టల్ వసతితో కలుపుకుని రూ.50 వేలతో కోర్సు పూర్తి చేయవచ్చని ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంగా లక్షల రూపాయల వ్యాపారం సాగుతోంది. ప్రవేశాల క్రమంలో పీఆర్వోలు చెబుతున్నది ఒకలా ఉంటే.. పరీక్షల సమయంలో మరొకలా ఉండి అభ్యర్థులు ఇబ్బందులు పడ్డ ఘటనలు సైతం ఉన్నాయి. -
ఈ తప్పెవరిది?
‘విద్యార్థులకు పీజీ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ఉందనే విషయూన్ని కళాశాలల యూజమాన్యాలు ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేది. అప్పటికప్పుడు మార్కుల జాబితా ఇవ ్వడానికి అవి చేతితో రాసిచ్చేవి కావు. విద్యార్థుల అవసర నిమిత్తం మెమోలను ప్రింట్ చేరుుంచడానికి యూనివర్సిటీలోని ఓ అధికారికి బాధ్యతలు అప్పగించాం. దానికంటే ఇంకా మేం చేసేది ఏముంటది. సమాచారాన్ని సకాలంలో అందిస్తే ఏదైనా చర్య తీసుకునే వీలుండేది.’ - కడారు వీరారెడ్డి, శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ‘పీజీ కౌన్సెలింగ్ గురించి శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి భరత్‌కు తెలిపాం. ఆయన సరైన సమయంలో స్పందించలేదు. విద్యార్థులు వెళ్లి కలిసినా.. ప్రత్యామ్నాయ మార్గాలు చూపలేదు. చివరి క్షణంలో తాము ఏదో చేశామని చెప్పుకోవడానికి ఓ లెటర్ కౌన్సెలింగ్ రోజు సాయంత్రం 3 గంటలకు ఇస్తే అప్పటికప్పుడు ఒరిజినల్ లెటర్‌ను హైదరాబాద్‌కు ఎలా చేరవేసేది. ముందుగానే మార్కుల మెమోలు ఇస్తే బాగుండేది.’ - గాయత్రీదేవి, రాజరాజేశ్వర సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్, వేములవాడ శాతవాహన యూనివర్సిటీ : జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర సంస్కృత కళాశాలలో పలువురు విద్యార్థులు 2013-14లో డిగ్రీ పూర్తిచేశారు. పీజీలో ప్రవేశం పొందడానికి ఉస్మానియూ వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాశారు. దాదాపు అందరు విద్యార్థులు వందలోపు ర్యాంకు సాధించారు. అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నచందంగా పీజీ సెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయూరు. సంస్కృత కళాశాలనుంచి విద్యార్థులకు మార్కు లు జాబితా అందకపోవడమే దీనికి కారణం. అధికారుల నిర్లక్ష్యంతో ఉన్నత విద్యకు నోచుకోలేకపోయూమని విద్యార్థులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన విద్యార్థులు వీరే... ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఏ ప్రవేశపరీక్షలో ర్యాంకులు సాధించి కౌన్సెలింగ్‌కు అర్హత కోల్పోయిన వారి లో నగేశ్(వర్సిటీ 6వ ర్యాంకు), బ్రహ్మచారి (వర్సిటీ 7వ ర్యాంకు), ప్రసాద్ (23వ), రాజేశ్ (45వ ర్యాంకు), సాగర్ (59వ ర్యాంకు), రవి (123వ ర్యాంకు) సాధించారు. కౌన్సెలింగ్ సమ యం వరకు కళాశాల నుంచి వీరికి మార్కుల మెమోలు అందలేదు. ఫలితంగా ఉన్నత విద్య కు దూరమయ్యూరు. మొదటి కౌన్సెలింగ్‌లోనే దాదాపు సీట్లన్నీ భర్తీ కావడంతో కనీసం రెండో కౌన్సెలింగ్‌లోనైనా సీటు దక్కుతుందనే ఆశ లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగాలి... ఫలితాలు ప్రకటించిన నెల రోజుల్లోపు యూనివర్సిటీ అధికారులు మార్కుల జాబితా అందించాల్సి ఉంటుంది. శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిగ్రీ పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించారు. జూన్ 25న ఫలితాలు విడుదలచేశారు. వాస్తవానికి ఈనెల 25వ తేదీలోపు మార్కుల జాబితా యూనివర్సిటీ అధికారులు ఆయూ కళాశాలలకు అందించాలి. మార్కుల జాబితా పొందాలంటే కళాశాలల వారు వర్సిటీ సూచించినా నిర్ణీత నమూనాలో విద్యార్థుల సమాచారం అందించాల్సి ఉంటుంది. నామినల్ రోల్స్ విధిగా సమర్పించాలని నిబంధన ఉంది. పరస్పర విరుద్ధ ఆరోపణలు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉందనే విషయాన్ని ముందుగా తమకు సమాచారం ఇచ్చి ఉంటే తప్పనిసరిగా మార్కుల జాబితాను అందించే వాళ్లమని యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. వారం క్రితమే శాతవాహన యూనివర్సిటీలో పరీక్షల నియంత్రణ అధికారికి కౌన్సెలింగ్ గురించి తెలిపామని ఆయన సరైన సమయంలో స్పందించలేదని, కౌన్సెలింగ్ రేపు అనగా యూనివర్సిటీకి విద్యార్థులతో వెళ్లినా మార్కుల జాబితాలు లేకున్నా కంట్రోలర్ ప్రత్యామ్నాయ మార్గాలు చూపలేదని వేములవాడ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ అంటున్నారు. కౌన్సెలింగ్ రోజు విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కంట్రోలర్‌ను అభ్యర్థించడంతో సాయంత్రం 3 గంటలకు కంట్రోలర్ ఓ లెటర్ అందించారని, దానిని హుటాహుటిన మెయిల్ ద్వారా విద్యార్థులకు పంపినా లాభం లేకుండా పోరుుందని పేర్కొంటున్నారు. ఇలా ఎవరికి వారు తమదే కరెక్టు అంటే తమదేనని వాదిస్తున్నారు. వీరి నిర్లక్ష్యానికి విద్యార్థులు ఉజ్వల భవిష్యత్‌కు దూరమయ్యూరు.