శాతవాహన యూనివర్సిటీ
శాతవాహనయూనివర్సిటీ (కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీలోని పీహెచ్‌డీ కోర్సులకు సంబంధించిన వివరాలు నేడు గవర్నర్‌కు చేరనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనిర్సిటీలోని పీహెచ్‌డీ ప్రవేశాలు, కోర్సులతో పాటు పూర్తి సమాచారాన్ని ఉన్నత విద్యామండలి సేకరిస్తోంది. ఇటీవల గవర్నర్ నరసింహన్, విద్యాశాఖ మంత్రితో కలిసి పాల్గొన్న ఓ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డిని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన పీహెచ్‌డీ ప్రవేశాలు, పట్టాలు, కోర్సులు, అభ్యర్థుల సంఖ్యతో పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 20లోపు సంబంధిత సమాచారాన్ని అందించాలని అన్ని వర్సిటీలకు లేఖలు రాసారు. నేడు పీహెచ్‌డీ వివరాలను శాతవాహన యూనివర్సిటీ అధికారులు ఉన్నత విద్యామండలికి పంపించనున్నారు. గతంలో ప్రవేశాలు, కొనసాగుతున్న పరిశోధనల వివరాలు, అభ్యర్థుల సంఖ్య, ఇటీవల పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇచ్చిన నోటిఫికేషన్‌తో సమగ్ర వివరాలు అందించనున్నారు.
పీహెచ్‌డీ స్థాయిని దిగజార్చొద్దని..
డాక్టర్ ఆఫ్ ఫిలాసపీ(పీహెచ్‌డీ) సాధారణ డిగ్రీ కాదు. భవిష్యత్‌తరాలకు ఉపయోగపడే ఓ పరిశోధన. దీని స్థాయిని దిగజార్చవద్దని, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా ప్రవేశాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న విషయాన్ని గవర్నర్ నరసింహన్ తీవ్రంగా పరిగణించారు. దీంతో ఇటీవల ఉన్నత విద్యామండలి చైర్మన్‌తో జరిగిన ఒక సమావేశంలో ఇప్పటి వరకు ఏఏ యూనివర్సిటీ ఎన్నెన్ని పీహెచ్‌డీలు ప్రదానం చేసింది..? ప్రస్తుతం ఏఏ యూనివర్సిటీలలో ఏఏ విభాగాల్లో ఎంతమంది పీహెచ్‌డీ చేస్తున్నారు. ఎన్నేళ్లుగా చేస్తున్నారు..? అనే సమగ్ర వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని గవర్నర్ సూచించారు.
ఆరు విభాగాల్లో పీహెచ్‌డీ..
శాతవాహనయూనివర్సిటీలో 2015– 16 సంవత్సరంలో పీహెచ్‌డీ కోర్సు ప్రారంభమైంది. ఉర్దూ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సోషియాలజీ, కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో కలుపుకుని 14 మంది నమోదవగా.. దాదాపు 11మందే కోర్సును కొనసాగిస్తున్నారని సమాచారం. ఈ విద్యా సంవత్సరం కూడా పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ను శాతవాహనయూనివర్సిటీ నెలక్రితమే ప్రకటించింది. దరఖాస్తులకు ఈ నెల 14తేదీ వరకు అనుమతించింది. సెట్‌తో పాటు వివిధ పరీక్షల ఫలితాలు వెలువడే వరకు గడువును పొడగించాలని వివిధ విద్యార్థి సంఘాలు, పీహెచ్‌డీ అభ్యర్థులు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్ళారు. ఇటీవల మళ్ళీ దరఖాస్తుల గడువును ఈ నెల 30 తేదీ వరకు పొడగిస్తూ ప్రకటన వెలువరించారు.
ఐదేళ్లు దాటిన వారి ప్రవేశాలు రద్దు...
నాలుగైదేళ్లకు మించి పీహెచ్‌డీకి సమయం ఇవ్వకూడదని ఉన్నతవిద్యామండలి నిబంధనలు విధించనుంది. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం అమలు చేసేందుకే శాతవాహనతో పాటు వివిధ యూనివర్సిటీల నుండి సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నారు. ఐదేళ్ళు దాటినవారి ప్రవేశాలు రద్దు చేయాలని , అలాంటి వారు ఎందరున్నారో తేల్చాలని వైస్ ఛాన్సిలర్‌లకు ఆదేశాలు అందాయి. పీహెచ్‌డీ ప్రవేశాలను నట్,స్లెట్ ప్రతిభ ఆధారంగా చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని గవర్నర్ ఇటీవల స్పష్టం చేశారు. పీహెచ్‌డీ ప్రవేశాల్లో ఒక్కో యూనివర్సిటీ ఒక్కో తీరును ప్రదర్శిస్తోంది. అన్ని ఒకే రకమైన నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే త్వరలోనే శాతవాహన పీహెచ్‌డీ ప్రవేశాలు కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని యూనివర్సిటీల నిబంధనల ప్రకారమే సాగనున్నాయి. పీహెచ్‌డీ వివరాలపై రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డిని సంప్రదించగా ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం వారు కోరిన సమాచారాన్ని సోమవారం పంపుతున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment