ఖాళీల ‘వర్సిటీ’..!  | Govt Jobs Vacancies In Satavahana University | Sakshi
Sakshi News home page

ఖాళీల ‘వర్సిటీ’..!

Published Fri, May 10 2019 8:30 AM | Last Updated on Fri, May 10 2019 8:30 AM

Govt Jobs Vacancies In Satavahana University - Sakshi

శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్‌): కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో ఎక్కడ చూసినా ఖాళీలే కనిపిస్తున్నాయి. ఏళ్ల నుంచి పోస్టులు ఖాళీగా ఉండడంతో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. యూనివర్సిటీకి ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌(వీసీ) ఉండడంతో రిక్రూట్‌మెంట్‌కు ముందుకు రాకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వం కూడా పెద్దగా దృష్టి సారించకపోవడం కూడా మరో కారణమని విద్యావేత్తల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఖాళీ ఉండడంతో ఉన్న వారిపై పనిభారం పడుతోంది. అభివృద్ధి పనులు కొంతకాలంగా సాగుతున్నా పూర్తిస్థాయి, రెగ్యులర్‌ ఉద్యోగులుంటే అన్ని రకాలుగా యూనివర్సిటీ అభివృద్ధి చెందుతుంది. వరుస ఎన్నికలు కూడా పోస్టుల భర్తీకి అడ్డంకిగా నిలుస్తున్నాయి. పూర్తిస్థాయి వీసీ నియామకం ఆలస్యమైతే ఇన్‌చార్జితోనే రిక్రూట్‌మెంట్‌ చేసి ఖాళీలను భర్తీ చేయాలని వివిధ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

70 శాతం పైగా ఖాళీలే...
యూనివర్సిటీలో టీచింగ్‌ నాన్‌టీచింగ్‌ విభాగాల్లో పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. శాతవాహనలో టీచింగ్‌కు సంబంధించి 65 పోస్టులకు ప్రస్తుతం రెగ్యులర్‌ పోస్టులు 20 మంది మాత్రమే ఉండగా మిగతా 45 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రొఫెసర్లు 10కి 10 ఖాళీలుండగా, అసోసియేట్‌ ప్రొఫెసర్లు16కు 16 ఖాళీలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 37కు 20 మంది ఉండగా, 17 పోస్టులు ఖాళీలున్నాయి. నాన్‌ టీచింగ్‌ విషయానికి వస్తే మొత్తం 51 పోస్టులుండగా 13 పోస్టులు మాత్రమే భర్తీ కాగా 38 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద...
యూనివర్సిటీలో కేటాయించిన పోస్టుల్లోనే దాదాపు టీచింగ్‌లో 70 శాతం వరకు ఖాళీ ఉండగా నాన్‌టీచింగ్‌లో దాదాపు 75 శాతం వరకు  ఖాళీలున్నాయి. ఇవి కాకుండా టీచింగ్‌లో మరో 40కిపైగా పోస్టులు, నాన్‌టీచింగ్‌లో మరో 44 పోస్టులు అవసరమని యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఆయా పోస్టులకు సంబంధించిన ఫైళ్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నట్లు శాతవాహన అధికార వర్గాల సమాచారం. వీటితోపాటు 12బీకి సంబంధించిన దస్త్రాలు కూడా  సీఎం కార్యాలయంలోనే ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు ముగిస్తే కానీ వీటి విషయంలో స్పష్టత రాదని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీ పాలనే గత నాలుగేళ్లకు పైగా కొనసాగుతోంది. ఇన్‌చార్జి వీసీ ఉండగా నియమకాలు చేపట్టేందుకు ముందకు రావడం లేదని తెలుస్తోంది. గతంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు అనేక సార్లు ధర్నాలు చేశాయి. దీంతో ఇన్‌చార్జి పాలనలో నియమాకాలు జరుగుతాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.

ఎన్నికలు ముగిస్తేనే ముందుకు...
యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలంటే ఎన్నికలు ముగిసే వరకు ఆగాల్సిందేనని తెలుస్తోంది. ప్రస్తుతం గత 8 నెలల నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఉండడంతో నియామక, 12బీ గుర్తింపు పక్రియ ముందుకు సాగడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి ఫలితాలు రాగానే మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ కూసేలా ఉంది. ఇదే జరిగితే మరో రెండు మూడు నెలలు భర్తీ పక్రియ పెండింగ్‌ పడుతుందని విద్యావేత్తలు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత రెగ్యులర్‌ వీసీ నియామక ప్రక్రియ ఆలస్యమయితే ఇన్‌చార్జి వీసీతోనైనా నియామకాలు జరిపి ఖాళీగా ఉన్న పోస్టులతోపాటు అవసరమున్న మరిన్ని పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement