కొత్తపల్లి (కరీంనగర్): కరీంనగర్ శివారు రేకుర్తి, సీతారాంపూర్, సూర్యనగర్ ప్రాంతాల్లో భల్లూకం హడలెత్తించింది. సుమారు 14 గంటల పాటు స్థానికులను బెంబేలెత్తించిన గుడ్డెలుగు.. ఎట్టకేలకు వరంగల్ నుంచి వచ్చిన రెస్క్యూ టీంకు పట్టుబడింది. సుమారు రెండు గంటల పాటు రెస్క్యూ టీంను ముప్పుతిప్పలు పెట్టింది. శనివారం వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో కుక్కతో బయటకు వెళ్లిన సూర్యనగర్ వాసికి ఎలుగు కనిపించింది. కుక్క మొరగడంతో వెనక్కి తగ్గిన ఎలుగుబంటి.. అక్కడి నుంచి రేకుర్తి వైపు వెళ్లింది.
ఎస్సారెస్పీ కెనాల్ మార్గం గుండా ప్రధాన రహదారిపై సంచరిస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం వరంగల్ నుంచి వచ్చిన ఫారెస్ట్ రెస్క్యూ టీం రేకుర్తి సబ్‌స్టేషన్ ప్రాంతంలోని సమ్మక్క గుట్ట పొదల్లో దాగిన ఎలుగుబంటిని పట్టుకునేందుకు వలలు ఏర్పాటు చేసింది. ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే క్రమంలో టీం సభ్యుడిపైకి దూసుకొచ్చింది. ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వలకు చిక్కిన ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, మరో రెండు ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment