సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పోలీసుల బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరో ఐదారు నెలల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు పూర్తిచేసింది. ఇక తరువాత స్థాయిలో ఉన్న ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్– ఇన్‌స్పెక్టర్ల స్థాయి అధికారుల బదిలీలపై కొంతకాలంగా హోంశాఖ కసరత్తు చేస్తోంది.
మరోవైపు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ కమిషనరేట్, రామగుండం కమిషనరేట్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో కిందిస్థాయిలో ఎస్సైల బదిలీలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇక కీలకమైన సీఐ, ఏసీపీల బదిలీల విషయంలో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎవరిని ఎక్కడ నియమించాలన్న విషయంలో ఇటు ఉన్నతాధికారులు, అటు హోంశాఖ పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం అధికారుల ట్రాక్ రికార్డుతోపాటు, సమర్ధతపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
అమ్మో..! ఆ నియోజకవర్గమా?
ఉమ్మడి జిల్లాలో మూడు జిల్లాల్లో విస్తరించిన ఓ నియోజకవర్గం పేరు చెబితేనే.. పోలీసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక్కడ విధులు నిర్వహించాలంటే సిఫారసు లేఖలు తప్పనిసరి. వాటితో విధుల్లో చేరిన పోలీసులను ఇప్పటికీ సిఫారసు లేఖలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు 10 నెలలు డ్యూటీ చేసిన అనంతరం మరో అధికారికి ఆ స్థానంలో లేఖలు ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పలువురు ఎస్సై, సీఐలు చేతులు కాల్చుకున్నారు. తాజాగా కూడా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని సమాచారం. ఇటీవల కూడా జరిగిన బదిలీల్లోనూ ఇలాగే తమకు అన్యాయం జరిగిందని కొందరు, జరగనుందని మరికొందరు పోలీసులు బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఇంటలిజెన్స్ విభాగం ఇప్పటికే సీఎం కార్యాలయానికి సైతం చేరవేసిందని సమాచారం. అందుకే.. ఆ నియోజకవర్గం పేరు చెబితేనే.. పోలీసులు బెంబేలెత్తిపోతున్నారు.
మూడేళ్ల నిబంధన కీలకం..!
క్రితంసారి జరిగినట్లుగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు వన్‌సైడ్‌గా జరిగే అవకాశాలు చాలా తక్కువ. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీల నుంచి మునుపటి కంటే పోటీ అధికంగా ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికలలో సున్నితమైన, కీలకమైన నియోజకవర్గాల్లో ప్రతిభావంతులైన అధికారులకు పోస్టింగులు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నియామకాన్ని రద్దు చేస్తూ.. కేంద్రం ఆయన్ని ఏపీ కేటాయించింది. దీంతో ప్రభుత్వం డీజీపీ విషయంలోనూ ఆచితూచి వ్యవహరించి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలే అప్పగించింది.
ట్రాన్స్ ఫర్స్ లో పాలిట్రిక్స్
ప్రస్తుతం కేంద్రం–రాష్ట్రం మధ్య పరస్పర రాజకీయ ఆధితప్య పోరు తీవ్రమైన నేపథ్యంలో పోస్టింగుల విషయంలో ఎక్కడా సాంకేతిక పరమైన లోపాలు, పొరబాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే.. ఇటీవల జరిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ల విషయంలోనూ జాగరుకతతో వ్యవహరించింది. ఇందులో భాగంగానే.. కరీంనగర్ సీపీగా సుబ్బారాయుడు, రామగుండం సీపీగా రెమా రాజేశ్వరి, సిరిసిల్ల ఎస్పీగా అఖిల్‌మహాజన్, జగిత్యాల ఎస్సీగా భాస్కర్‌లను నియమించి మొత్తం ఉమ్మడి జిల్లా పోలీసు బాసులను ఏకకాలంలో మార్చింది. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం.. గత ఎన్నికల సమయంలో పనిచేసిన రెవెన్యూ, పోలీసు అధికారులు లేదా మూడేళ్లకు మించి ఒకే కుర్చీలో విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు స్థాన చలనం తప్పేలా లేదు. ఈ విషయంలో ఇప్పటికే కొన్నిస్థానాల్లో ఎస్సై ర్యాంకు ఆఫీసర్లను ఉన్నతాధికారులు మార్చారు కూడా.
లేఖల కోసం ఏసీపీలు, సీఐల పైరవీలు..!
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం డీఎస్పీల జాబితాను ఇప్పటికే తెప్పించుకుంది. అదే సమయంలో కరీంనగర్, రామగుండం కమిషనరేట్లతోపాటు సిరిసిల్ల, జగిత్యాల పోస్టింగుల కోసం పలువురు డీఎస్పీలు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా చాలాకాలంగా పోస్టింగులు లేకుండా లూప్‌లైన్లలో ఉంటున్న అధికారులు తమకు తెలిసిన నాయకుల ద్వారా ఈసారి ఎలాగైనా పోస్టింగ్ దక్కించుకోవాలని నేతల లేఖలు సంపాదించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు సైతం తాము పనిచేసే నియోజకవర్గం, జిల్లాను కుదిరితే జోన్ సైతం మారేందుకు వెనకాడటం లేదు. తమకు తెలిసిన నాయకుడు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా సరే.. వెళ్లి వెంటనే చేరిపోతున్నారు. ఇదే రకంగా ఇప్పటికే పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు జోన్లు మారి మరీ విధుల్లో జాయినయ్యారు.
కరీంనగర్‌లో విచిత్రం..!
కరీంనగర్ కమిషనరేట్ విషయానికి వస్తే.. ఇక్కడ పోలీసుల తీరు విచిత్రంగా ఉంటుంది. ఇక్కడే ఎ స్సైలుగా సర్వీసులో చేరిన కొందరు ఇప్పటికీ ఏ సీపీలుగా కొనసాగుతున్నారు. వీరికి బదిలీ గండం వెంటాడుతుండటంతో లూప్‌లైన్‌లోకి వెళ్లాలా ? లేక అలవాటు ప్రకారం.. ఐదారు నెలలు మరో ప్రాంతానికి బదిలీపై వెళ్లి.. సరిగ్గా ఎన్నికల ముందు తిరిగి రావాలా? అన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి కరీంనగర్‌ను వదిలేందుకు వీరంతా ససేమీరా అంటున్నారు. అందుకే.. ఏ చిన్న అవకాశం దొరికినా.. దాన్ని సద్వినియోగ పరచుకుని ఇక్కడే రిటైర్ అవ్వాలని కంకణం కట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment