జగిత్యాల: జిల్లాలో ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు పర్యవేక్షకులుగా సారంగాపూర్ మండలంలోని 10 మంది ఉపాధ్యాయులను మార్చి 15 నుంచి ఏప్రిల్ 1 వరకు రిలీవ్ చేశారు. దీంతో వారు మార్చి 14న మధ్యాహ్నం 2 గంటలకు సదరు పరీక్ష కేంద్రాల్లో రిపోర్ట్ సైతం చేశారు. కానీ వీరిలో కొందరు టీచర్లు అటు ఇంటర్మీడియట్ పరీక్షల పర్యవేక్షణకు, ఇటు పాఠశాలలకు వెళ్లలేదు.
అన్నీ ప్రెజెంట్ అని వేసుకున్నారు..
ఇంటర్మీడియట్ పరీక్షల పర్యవేక్షణకు వెళ్లిన టీచర్లు తిరిగి పాఠశాలల్లో జాయిన్ అయ్యే సమయంలో హెచ్‌ఎంలకు, హెచ్‌ఎంలే అయితే ఎంఈవోలకు డ్యూటీ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంటుంది. కానీ అవి అందజేయకుండానే ఉపాధ్యాయులు తమ విధుల్లో చేరారు. 15 రోజులకు సంబంధించిన జీతం సైతం తీసుకున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘ఇన్విజిలేషన్‌కు వెళ్లలేదు’ అనే శీర్షికన వార్త ప్రచురితం కావడంతో సంబంధిత ఎంఈవో ఈ నెల 15వ తేదీలోపు డ్యూటీ సర్టిఫికెట్లు అందించాలని వారిని ఆదేశించారు. దీంతో కొందరు అందజేశారు.
వీరిలో పర్యవేక్షకులుగా పనిచేయనప్పటికీ ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి, ఎంఈవోకు అందించినట్లు తెలిసింది. రిలీజ్ ఆర్డర్‌లో ఇంటర్మీడియట్ అధికారులు కంప్యూటర్ షీట్‌లో అబ్‌సెంట్, ప్రెజెంట్ వేశారు. కానీ కొందరు టీచర్లు వాటిని జిరాక్స్ తీసుకొని, చేతితో అన్నీ ప్రెజెంట్ అని వేసుకున్నారు. కాగా, మార్చి 15 నుంచి వీరు విధుల్లో చేరుతున్నట్లు ఉండగా డ్యూటీ సర్టిఫికెట్‌లో మాత్రం 10 నుంచే వెళ్లినట్లు పెట్టారు.
అలాగే పేర్లను అధికారులు పెన్నుతో రాయగా కొందరు కంప్యూటర్ షీట్‌లో టైప్ చేసుకున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వారు డ్యూటీ సర్టిఫికెట్లు తయారు చేసి, అందజేశారు. ఇవి ఫేక్ డ్యూటీ సర్టిఫికెట్లు అని స్పష్టంగా తెలుస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ చేపడితే నిజానిజాలు బయటపడతాయన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై సారంగాపూర్ ఎంఈవో భీమయ్యను వివరణ కోరగా డ్యూటీ సర్టిఫికెట్లు తీసుకొని, డీఈవోకు పంపించామని, ఆయన పరిశీలిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment