సాక్షి, హైదరాబాద్: ప్రతిభ కలిగిన విద్యార్థులకు శరాఘాతంగా మారుతున్న నకిలీ విద్యార్హత పత్రాలపై నగర పోలీసులు జంగ్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం ఓ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. గతంలో చిక్కిన నాలుగు ముఠాలు ఆయా వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు జారీ చేయిస్తుండగా... వీళ్లు మాత్రం నకిలీవి తయారు చేసి అమ్మేస్తున్నారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఏదైనా ఒకే రేటుకు విక్రయించేస్తున్నారని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి వెల్లడించారు.
యాకుత్‌పురకు చెందిన సయ్యద్ నవీద్ సంతోష్‌నగర్ ప్రాంతంలో ఎంహెచ్ కన్సల్టెన్సీ పేరుతో ఎడ్యుకేషనల్ సేవలు అందించే సంస్థను నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్ ప్రభావంతో వ్యాపారం దెబ్బతిన్న ఇతగాడు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. గతేడాది మేలో బషీర్‌బాగ్‌లో క్యూబేజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వీసా ప్రాసెసింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. నిబంధనల ప్రకారం వీసా ప్రాసెసింగ్ చేస్తే ఇతడికి ఎక్కువ లాభాలు రావట్లేదు. మరోపక్క అనేక మంది సరైన విద్యార్హతలు లేని వాళ్లు సైతం వీరి వద్దకు ప్రాసెసింగ్‌కు వస్తున్నారు. దీంతో తానే నకిలీ సర్టిఫికెట్లు రూపొందించి ప్రాసెసింగ్ చేస్తే భారీ లాభాలు ఉంటాయని భావించాడు.
చదవండి: ఇకపై జంక్షన్‌లో చుక్కలే!.. రెడ్ సిగ్నల్ పడగానే డ్రంకన్ డ్రైవ్
డీటీపీలో మంచి పట్టున్న మీర్‌చౌక్ వాసి షేక్ నదీమ్‌ను తన సంస్థలో నియమించుకున్నాడు. జమాల్‌కాలనీకి చెందిన మహ్మద్ అబ్రారుద్దీన్ ఆ తరహా విద్యార్థులను తీసుకువచ్చేవాడు. వారి అవసరాలకు తగ్గట్టు నవీద్ పదో తరగతి నుంచి బీటెక్ వరకు సర్టిఫికెట్లను నదీమ్‌తో తయారు చేయించేవాడు. వీటిని రూ.70 వేల నుంచి రూ.80 వేలకు విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, పి.శ్రీనయ్యలతో కూడిన బృందం దాడి చేసింది. నవీద్, నదీమ్, అబ్రార్‌లతో పాటు సర్టిఫికెట్లు ఖరీదు చేసిన అబ్దుల్ రహీం ఖాన్, అబ్దుల్ కరీం ఖాన్, మహ్మద్ ఇస్మాయిల్ అహ్మద్, మహ్మద్ నాసిర్ అహ్మద్, ఫైసల్ బిన్ షాదుల్లాలను పట్టుకున్నారు.
అన్నిరకాల సర్టిఫికెట్లు లభ్యం
నిందితుల నుంచి రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు పేరుతో ఉన్న సర్టిఫికెట్లు 4, మహారాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పేరు తో ఉన్న సర్టిఫికెట్లు 4, ఓయూ పేరుతో ఉన్న డిగ్రీలు 3, ఏయూ పేరుతో ఉన్న బీటెక్ పట్టాలు 7, తెలంగాణ యూనివర్శిటీ పేరుతో ఉన్న డిగ్రీలు 30, పుణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో ఉన్న పట్టా ఒకటి స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment