YAKUTPURA
-
బేరాల్లేవమ్మా.. ఎస్సెస్సీ టు బీటెక్.. ఏదైనా ఒకే రేటు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ కలిగిన విద్యార్థులకు శరాఘాతంగా మారుతున్న నకిలీ విద్యార్హత పత్రాలపై నగర పోలీసులు జంగ్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం ఓ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. గతంలో చిక్కిన నాలుగు ముఠాలు ఆయా వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు జారీ చేయిస్తుండగా... వీళ్లు మాత్రం నకిలీవి తయారు చేసి అమ్మేస్తున్నారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఏదైనా ఒకే రేటుకు విక్రయించేస్తున్నారని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి వెల్లడించారు. యాకుత్‌పురకు చెందిన సయ్యద్ నవీద్ సంతోష్‌నగర్ ప్రాంతంలో ఎంహెచ్ కన్సల్టెన్సీ పేరుతో ఎడ్యుకేషనల్ సేవలు అందించే సంస్థను నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ ప్రభావంతో వ్యాపారం దెబ్బతిన్న ఇతగాడు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. గతేడాది మేలో బషీర్‌బాగ్‌లో క్యూబేజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వీసా ప్రాసెసింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. నిబంధనల ప్రకారం వీసా ప్రాసెసింగ్ చేస్తే ఇతడికి ఎక్కువ లాభాలు రావట్లేదు. మరోపక్క అనేక మంది సరైన విద్యార్హతలు లేని వాళ్లు సైతం వీరి వద్దకు ప్రాసెసింగ్‌కు వస్తున్నారు. దీంతో తానే నకిలీ సర్టిఫికెట్లు రూపొందించి ప్రాసెసింగ్ చేస్తే భారీ లాభాలు ఉంటాయని భావించాడు. చదవండి: ఇకపై జంక్షన్లో చుక్కలే!.. రెడ్ సిగ్నల్ పడగానే డ్రంకన్ డ్రైవ్ డీటీపీలో మంచి పట్టున్న మీర్‌చౌక్ వాసి షేక్ నదీమ్‌ను తన సంస్థలో నియమించుకున్నాడు. జమాల్‌కాలనీకి చెందిన మహ్మద్ అబ్రారుద్దీన్ ఆ తరహా విద్యార్థులను తీసుకువచ్చేవాడు. వారి అవసరాలకు తగ్గట్టు నవీద్ పదో తరగతి నుంచి బీటెక్ వరకు సర్టిఫికెట్లను నదీమ్‌తో తయారు చేయించేవాడు. వీటిని రూ.70 వేల నుంచి రూ.80 వేలకు విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, పి.శ్రీనయ్యలతో కూడిన బృందం దాడి చేసింది. నవీద్, నదీమ్, అబ్రార్‌లతో పాటు సర్టిఫికెట్లు ఖరీదు చేసిన అబ్దుల్ రహీం ఖాన్, అబ్దుల్ కరీం ఖాన్, మహ్మద్ ఇస్మాయిల్ అహ్మద్, మహ్మద్ నాసిర్ అహ్మద్, ఫైసల్ బిన్ షాదుల్లాలను పట్టుకున్నారు. అన్నిరకాల సర్టిఫికెట్లు లభ్యం నిందితుల నుంచి రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు పేరుతో ఉన్న సర్టిఫికెట్లు 4, మహారాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పేరు తో ఉన్న సర్టిఫికెట్లు 4, ఓయూ పేరుతో ఉన్న డిగ్రీలు 3, ఏయూ పేరుతో ఉన్న బీటెక్ పట్టాలు 7, తెలంగాణ యూనివర్శిటీ పేరుతో ఉన్న డిగ్రీలు 30, పుణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో ఉన్న పట్టా ఒకటి స్వాధీనం చేసుకున్నారు. -
వారికి పాజిటివ్ ఎలా వచ్చిందబ్బా?
అతనికి 70 ఏళ్లు. అనారోగ్యంగా ఉంటే చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇటీవల విదేశాల నుంచి రాకపోకలు సాగించలేదు. దాదాపు నెల రోజులుగా ఇంటికే పరిమితమైన యాకుత్‌పురాకు చెందిన ఈ వృద్ధుడికి కరోనా ఎలా సంక్రమించిందో అంతుపట్టడంలేదు. ఇది ఇంకో కేసు... పక్షవాతంతో మంచానికే పరిమితమైపోయిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. రెండు నెలలుగా కాలు కూడా బయటపెట్టని ఈ వ్యక్తికి వైరస్ సంక్రమించినట్లు తేలిన అనంతరం కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వారికి పాజిటివ్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో బాధితుడికి వైరస్ ఎలా సంక్రమించిందనేది తేలక తలపట్టుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా విశ్వరూపం చూపుతున్న కరోనా మహమ్మారి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దగ్గు, తుమ్ములు, జ్వరం లక్షణాలతో బయటపడే ఈ వైరస్.. ఇటీవల ఇలాంటి లక్షణాల్లేనివారికి కూడా సోకుతున్నట్లు పరీక్షల్లో తేలింది. పాజిటివ్ వచ్చిన వారి కుటుంబసభ్యులు లేదా సన్నిహితంగా మెలిగినవారు పరీక్షలు చేయించుకుంటేనే ఇప్పటివరకు పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా కరోనా బాధితులతో సంబంధం లేని వారికీ వైరస్ సంక్రమిస్తున్నట్లు తేలింది. జంటనగరాల్లో ఈ తరహాలో 15 కేసుల వరకు నమోదు కావడంతో ప్రభుత్వానికి వైరస్ మూలాలు కనుగొనడం చిక్కుముడిగా మారింది. దీంతో ఈ మాయదారి వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందిందనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే, మూలాలు లేకుండా కరోనా బారిన పడడంతో ఇంకెంతమందికి ఇలాంటి లక్షణాలున్నాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. -
పబ్లిక్ మేనిఫెస్టో జనం సాక్షిగా- యాకుత్‌పురా
-
భార్యపై కత్తితో దాడిచేసిన భర్త అరెస్ట్
హైదరాబాద్: భార్యపై కత్తితో దాడికి పాల్పడిన భర్తను రెయిన్‌బజార్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్‌కట్టా ఆమన్‌నగర్-బి ప్రాంతానికి చెందిన సయ్యద్ అంజద్(35), గౌసియా బేగం(30)లు దంపతులు. 12 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. హోటళ్లల్లో పని చేస్తూ సయ్యద్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. భార్య భర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరగడంతో అంజద్ పలుమార్లు భార్యపై దాడికి పాల్పడ్డాడు. దీంతో గత నాలుగు నెలలుగా భార్యభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరగడంతో వేరుగా ఉంటున్నారు. ఈ నెల 5వ తేదీన గౌసియా బేగం యాకుత్‌పురా ఇమామ్‌బడా ఆషూర్ఖానా వద్ద నివాసముండే సోదరి పర్వీన్ బేగం ఇంటికి వచ్చింది. అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చిన అంజద్ భార్యతో గొడవ పడి కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన గౌసియా బేగంను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం జరిగిన దాడిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త సయ్యద్ అంజద్‌ను బుధవారం అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. -
కళాశాలకు వెళ్లిన విద్యార్థి అదృశ్యం
యాకుత్‌పురా (హైదరాబాద్) : కళాశాలకని బయటకు వెళ్లిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. మీర్‌చౌక్ పోలీసుల వివరాల ప్రకారం.. మీరాలంమండి ఇచిబేగ్ కమాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షాహజూర్ కుమారుడు మహ్మద్ ఫారూఖ్ అలియాస్ షోహేబ్ (17) సంజయ్ గాంధీ మెమోరియల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్నాడు. ఈ నెల 13న ఫారూఖ్ కళాశాలకని ద్విచక్ర వాహనంపై ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల వద్ద వాకబు చేయగా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కక్షగట్టి మహిళపై కత్తితో దాడి
యాకుత్‌పురా: పాత గొడవల నేపథ్యంలో ఒంటరిగా ఉంటున్న మహిళపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడిన సంఘటన సోమవారం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నారాయణ్‌బాగ్ ప్రాంతానికి చెందిన షౌకత్ అలీ, ఫరీదా బేగం (50) దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలున్నారు. కొన్ని నెలల క్రితం షౌకత్ అలీ చనిపోవడంతో ఫరీదా బేగం ఇద్దరు కూతుళ్ల వివాహం అనంతరం నారాయణ్‌బాగ్‌లోని రెహమాన్‌కు చెందిన ఇంట్లో అద్దెకుంటూ స్థానికంగా ఇళ్లలో పని చేసుకుంటూ జీవిస్తోంది. కాగా, ఫరీదా బేగం ఉంటున్న అద్దె ఇంటి పక్క గదిలో జావేద్ (22) కుటుంబం నివసిస్తోంది. ఫరీదా బేగం, జావేద్ కుటుంబాల మధ్య నీటి సమస్యపై పలుమార్లు గొడవలు తలెత్తడంతో ఇంటి యజమాని కొన్ని నెలల క్రితం జావేద్‌ను ఇల్లు ఖాళీ చేయించాడు. అందుకు కారణమైన ఫరీదాబేగంపై కక్షగట్టిన జావేద్ ఆదివారం అర్ధరాత్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమె గొంతు కొసేందుకు యత్నించగా ఫరీదా ప్రతిఘటించి అరవడంతో గాయపరిచి పరారయ్యాడు. గాయాలపాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారని ఇన్స్పెక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఎస్సై లక్ష్మయ్యలు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నారు. -
విద్యార్థిని అదృశ్యం
యాకుత్‌పురా (హైదరాబాద్) : స్నేహితురాలి ఇంటికని వెళ్లిన ఓ విద్యార్థిని కనిపించకుండాపోయిన సంఘటన భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం ఎస్సై ప్రసాద్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మోయిన్‌బాగ్ ఫతేషానగర్ ప్రాంతానికి చెందిన ఫయీం అహ్మద్ కూతురు ఆయేషా సిద్ధిఖా (17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 7వ తేదీన ఉదయం 11.30 గంటలకు రజానగర్‌లో ఉండే స్నేహితురాలు సనా బేగం వద్దకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లతో పాటు సాధ్యమైనన్నీ ప్రాంతాల్లో వాకబు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో కుటుంబ సభ్యులు భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు పింక్ కలర్ చుడీదార్, బుర్ఖా ధరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు 040-27854798, 7382296634 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
కాలేజీ ముందు విద్యార్థినుల ఆందోళన
యాకుత్‌పురా (హైదరాబాద్) : పరీక్ష ప్రారంభమైనా తమకు హాల్ టిక్కెట్లు ఇవ్వలేదంటూ విద్యార్థినులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన యాకుత్‌పురాలో ఉన్న ఇస్లామియా బీఈడీ కళాశాలలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పరీక్ష ప్రారంభమైనా హాల్ టిక్కెట్లు మంజూరు చేయని యాజమాన్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థినులు కాలేజీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
యువతి అదృశ్యం
యాకుత్‌పురా : టైలరింగ్ శిక్షణ నిమిత్తం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురా చావునీ నాదే అలీ బేగ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అస్రార్ హుస్సేన్, వాషిక్ సుల్తానాల కూతురు రహత్ సుల్తానా (23) రేతికా మసీదు ప్రాంతంలోని మాలన్ బీ మదర్సాలో కొన్ని రోజులుగా టైలరింగ్‌లో శిక్షణ పొందుతోంది. రోజు మాదిరిగానే శిక్షణకు వెళుతున్నానని ఈ నెల 16వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిన రహత్ సుల్తానా ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు శిక్షణ కేంద్రంతో పాటు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారితో చాకిరీ చేయిస్తున్న వ్యక్తి అరెస్ట్
యాకుత్‌పురా (హైదరాబాద్) : చిన్నారితో చాకిరీ చేయిస్తున్న ఓ యజమానిని రెయిన్‌బజార్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్సై వి. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... యాకుత్‌పురా సాదత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఫిర్దోస్ (29) గత కొన్ని రోజులుగా జాఫర్ రోడ్డులో బైక్ మెకానిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ఫరీద్ అన్సారీ (13) అనే బాలుడిని దుకాణంలో చేర్చుకుని పని చేయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న హైదరాబాద్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు రెయిన్‌బజార్ పోలీసుల సహకారంతో బాలుడికి విముక్తి కల్పించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిర్దోస్‌ను అరెస్ట్ చేశారు. -
ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక అదృశ్యం
యాకుత్‌పురా : ఇంట్లో చెప్పకుండా బయటికు వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై వి.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. భవానీనగర్ తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన సయ్యద్ సలీం, షహనాజ్ ఉన్నీసా దంపతుల కూతురు బషీరున్నీసా (16) ఇంట్లోనే ఉంటుంది. ఈ నెల 7వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లింది. చార్మినార్ వద్ద బట్టల దుకాణంలో పని చేసే తల్లి షహనాజ్ ఉన్నీసా రాత్రి ఇంటికి వచ్చేసరికి కుమార్తె కనిపించలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లతో పాటు సాధ్యమైనన్నీ ప్రాంతాల్లో వాకబు చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బస్సు డ్రైవర్‌పై దాడి: ఇద్దరు విద్యార్థుల అరెస్ట్
యాకుత్‌పురా (హైదరాబాద్): ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఇద్దరు విద్యార్థులు దాడి చేసి గాయపరిచారు. మీర్‌చౌక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డబీర్‌పురా కోమటివాడి ప్రాంతానికి చెందిన జాహేద్ హుస్సేన్ (19), బషీర్ అలీ (18) నాంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. శుక్రవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు నాంపల్లి వద్ద ఫలక్‌నుమా డిపోకు చెందిన బస్సు ఎక్కారు. దారుషిఫా వరకు టికెట్టు కొనుగోలు చేశారు. స్టాప్ వచ్చినా బస్సు దిగకుండా మహిళలు వెళ్లే ద్వారం వద్దే నిలబడి ఉన్నారు. దీంతో బస్సు దిగాలని డ్రైవర్ అనడంతో విద్యార్థులు వాగ్వివాదానికి దిగారు. మాటా మాటా పెరగడంతో హుస్సేన్, బషీర్‌లు డ్రైవర్ బాలకృష్ణపై దాడికి పాల్పడ్డారు. గాయపడిన బాలకృష్ణ మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
పేకాట శిబిరంపై దాడి: ఐదుగురి అరెస్ట్
యాకుత్‌పురా (హైదరాబాద్) : ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్సై పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురా నాగబౌలి ప్రాంతానికి చెందిన మహ్మద్ కమర్ (40) కొన్ని రోజులుగా తన ఇంట్లో పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి మరో ఏడుగురితో కలసి పేకాట ఆడుతుండగా రెయిన్‌బజార్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
సెల్‌ఫోన్ చోరీ: జువైనల్ హోమ్‌కు బాలుడు
యాకుత్‌పురా (హైదరాబాద్) : పక్కింట్లో సెల్‌ఫోన్ దొంగిలించిన ఓ బాలుడిని భవానీనగర్ పోలీసులు శుక్రవారం జువైనల్ హోమ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా చాచా గ్యారేజీ ప్రాంతానికి చెందిన బాలుడు (17) పక్కింట్లో ఉండే రుబీనా బేగం ఇంట్లో ఈ నెల 7న రూ.10 వేలు విలువ చేసే సెల్‌ఫోన్‌ను దొంగలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించగా విషయాన్ని వెల్లడించాడు. దాంతో బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. -
వ్యక్తి అదృశ్యం
యాకుత్‌పురా (హైదరాబాద్) : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం ఎస్సై గణేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం... మొఘల్‌పురా ఫైర్ స్టేషన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఎజాజ్ (40) ఈ నెల 16వ తేదీన ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లతో పాటు సాధ్యమైనన్ని ప్రాంతాల్లో వాకబు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఎజాజ్ భార్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
18 తులాల బంగారం చోరీ
యాకుత్‌పురా (హైదరాబాద్) : ఓ ఇంట్లో దొంగలు పడి 18 తులాల బంగారు ఆభరణాలు దొంగలించిన సంఘటన రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం ఎస్ఐ గోవింద్ స్వామి తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా ఆమన్‌నగర్-ఎ ప్రాంతానికి చెందిన ఎం.ఎ. వహీద్, డాక్టర్ సమీనాలు దంపతులు. వీరు తలాబ్‌కట్టాలో గత కొన్నేళ్లుగా సమీనా ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. కాగా గత నెల 17వ తేదీన కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి బీరువాలో ఉన్న 18 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. దీంతో జరిగిన దొంగతనంపై బాధితులు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. అరకోటి బ్రౌన్‌షుగర్ పట్టివేత
ఒకరి అరెస్టు పరారీలో మరో ఇద్దరు యాకుత్‌పురా: మాదకద్రవ్యాలు తరలిస్తున్న ఓ వ్యక్తిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.50 లక్షల విలువ చేసే కిలో బ్రౌన్‌షుగర్, మాండ్రాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. పురానీహవేలిలోని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి, దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఠాగూర్ సుఖ్‌దేవ్ సింగ్‌తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన చిగురు రామచంద్రం (25) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ డాలర్ మార్కెట్ నుంచి వ్యవసాయ పరికరాలు నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో ఇతనికి ఇండోర్‌కు చెందిన మాదకద్రవ్యాలు (డ్రగ్స్) సరఫరాదారుడు సత్పాల్సింగ్(40)తో పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ విక్రయిస్తే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని అత ను రామచంద్రంకు చెప్పాడు. దీంతో రామచంద్రం అతడి వద్ద నుంచి 600 గ్రాముల బ్రౌన్‌షుగర్, 400 గ్రాముల మాండ్రాక్స్ మొత్తం రూ. 50 లక్షల విలువ చేసే కిలో మాదక ద్రవ్యాన్ని తీసుకున్నాడు. కరీంనగర్‌కు చెందిన మోహ న్ (35)కు ఈ మాదకద్రవ్యాలను విక్రయించేందుకు సోమవారం ఉదయం జూబ్లీబస్టాండ్ చేరుకున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు రామచంద్రంను అదుపులోకి తీసుకోగా.. మోహన్ పరారయ్యాడు. పోలీసులు రామచంద్రం వద్ద నుంచి కిలో మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు రామచంద్రంతో పాటు మోహన్, సత్పాల్సింగ్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాదక ద్రవ్యాలను సత్పాల్సింగ్ ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌ల మీదుగా మనదేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సమావేశంలో దక్షిణ మండలం టా స్క్‌ఫోర్స్ ఎస్సైలు జి.మల్లేష్, కె.వెంకటేశ్వ ర్లు, గౌస్ ఖాన్, డి.వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చాంద్ భాషా పాల్గొన్నారు. -
తల్లీకూతుళ్ల దారుణ హత్య
ఆర్థిక తగాదాలే కారణం..? ఆర్థిక తగాదాలు తల్లీకూతుళ్లను (వరుసకు కూతురు) బలిగొన్నాయి. దుండగులు గొంతుకోసి వారిని అతికిరాతకంగా హత్య చేశారు. యాకుత్‌పురా ఇన్స్పెక్టర్ యాదగిరిరెడ్డి కథనం ప్రకారం... దారుషిఫా కాలికబర్కు చెందిన సయ్యద్ అలీ ఆసారత్ (50) డబీర్‌పురా పోలీసు స్టేషన్లో మాజీ రౌడీషీటర్. ఇతనికి కాలికబర్‌లో ఆగా టవర్స్ పేరిట నాలుగు అంతస్తుల భవనం ఉంది. ఈ భవనం సెల్లార్లో భార్య సమీనాఫాతిమా(45), కూతురు సింజాలియా (17)తో కలిసి నివాసముంటున్నాడు. కాగా, వ్యాపారం నిమిత్తం ఆసారత్ కొన్ని నెలలుగా సౌదీలో ఉంటున్నాడు. ఇతను గతంలో టోలిచౌకీకి చెందిన అల్తాఫ్, అస్లం అనే అన్నదమ్ముల వద్ద కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. ఈ విషయమై వారితో ఆసారత్కు గొడవలు జరిగాయి. హత్య జరిగిందిలా... ఆసారత్ సౌదీ వెళ్లడంతో భార్య సమీనా, కూతురితో పాటు తల్లి సఖినా ఫాతిమా (70), చెల్లెలు కూతురు సయ్యదా దానియా (17)తో కలిసి ఉంటోంది. సింజాలియా రాజ్‌భవన్ ప్రాంతంలోని విల్లామేరీ కాలేజీలో చదువుతుండగా.... సయ్యదా దానియా నగరంలోని సెయింట్ జార్జ్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో సమీనా, సయ్యదా దానియా మాత్రమే ఉన్నారు. సింజాలియా కళాశాల నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని రెండు బెడ్రూమ్లలో సమీనా ఫాతిమా, సయ్యద్ దానియాలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు చేరుకున్నారు. అప్పటికే సమీనా, సయ్యదా దానియాలు మృతి చెందారు. వెనుక డోర్ నుంచి వచ్చిన దుండగులు వీరిని హత్య చేసి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ ఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబసభ్యులను వివరాలు తెలుసుకున్నారు. ఆర్థిక తగాదాలతోనే ఈ హత్యలు జరిగి ఉండవచ్చని డీసీపీ అనుమానం వ్యక్తం చేశారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రప్పించి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు సాయంత్రం 5 గంటలకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.