తల్లీకూతుళ్ల దారుణ హత్య
ఆర్థిక తగాదాలే కారణం..?
ఆర్థిక తగాదాలు తల్లీకూతుళ్లను (వరుసకు కూతురు) బలిగొన్నాయి. దుండగులు గొంతుకోసి వారిని అతికిరాతకంగా హత్య చేశారు. యాకుత్‌పురా ఇన్‌స్పెక్టర్ యాదగిరిరెడ్డి కథనం ప్రకారం... దారుషిఫా కాలికబర్‌కు చెందిన సయ్యద్ అలీ ఆసారత్ (50) డబీర్‌పురా పోలీసు స్టేషన్‌లో మాజీ రౌడీషీటర్. ఇతనికి కాలికబర్‌లో ఆగా టవర్స్ పేరిట నాలుగు అంతస్తుల భవనం ఉంది. ఈ భవనం సెల్లార్‌లో భార్య సమీనాఫాతిమా(45), కూతురు సింజాలియా (17)తో కలిసి నివాసముంటున్నాడు. కాగా, వ్యాపారం నిమిత్తం ఆసారత్ కొన్ని నెలలుగా సౌదీలో ఉంటున్నాడు. ఇతను గతంలో టోలిచౌకీకి చెందిన అల్తాఫ్, అస్లం అనే అన్నదమ్ముల వద్ద కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. ఈ విషయమై వారితో ఆసారత్‌కు గొడవలు జరిగాయి.
హత్య జరిగిందిలా...
ఆసారత్ సౌదీ వెళ్లడంతో భార్య సమీనా, కూతురితో పాటు తల్లి సఖినా ఫాతిమా (70), చెల్లెలు కూతురు సయ్యదా దానియా (17)తో కలిసి ఉంటోంది. సింజాలియా రాజ్‌భవన్ ప్రాంతంలోని విల్లామేరీ కాలేజీలో చదువుతుండగా.... సయ్యదా దానియా నగరంలోని సెయింట్ జార్జ్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో సమీనా, సయ్యదా దానియా మాత్రమే ఉన్నారు. సింజాలియా కళాశాల నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని రెండు బెడ్‌రూమ్‌లలో సమీనా ఫాతిమా, సయ్యద్ దానియాలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు చేరుకున్నారు. అప్పటికే సమీనా, సయ్యదా దానియాలు మృతి చెందారు. వెనుక డోర్ నుంచి వచ్చిన దుండగులు వీరిని హత్య చేసి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ ఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబసభ్యులను వివరాలు తెలుసుకున్నారు. ఆర్థిక తగాదాలతోనే ఈ హత్యలు జరిగి ఉండవచ్చని డీసీపీ అనుమానం వ్యక్తం చేశారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రప్పించి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు సాయంత్రం 5 గంటలకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.