యాకుత్‌పురా (హైదరాబాద్) : స్నేహితురాలి ఇంటికని వెళ్లిన ఓ విద్యార్థిని కనిపించకుండాపోయిన సంఘటన భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం ఎస్సై ప్రసాద్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మోయిన్‌బాగ్ ఫతేషానగర్ ప్రాంతానికి చెందిన ఫయీం అహ్మద్ కూతురు ఆయేషా సిద్ధిఖా (17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 7వ తేదీన ఉదయం 11.30 గంటలకు రజానగర్‌లో ఉండే స్నేహితురాలు సనా బేగం వద్దకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది.
అనంతరం తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లతో పాటు సాధ్యమైనన్నీ ప్రాంతాల్లో వాకబు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో కుటుంబ సభ్యులు భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు పింక్ కలర్ చుడీదార్, బుర్ఖా ధరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు 040-27854798, 7382296634 నంబర్లలో సంప్రదించాలన్నారు.