సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు జిల్లాల కేటాయింపు వ్యవహారంలో నకిలీ అనారోగ్య సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. దీనివల్ల అసలైన వ్యాధిగ్రస్తులకు, దివ్యాంగులకు అన్యాయం జరిగే వీలుందని పలువురు వాపోతున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు, దివ్యాంగులను బదిలీల నుంచి మినహాయించే నిబంధన ఉండటంతో దీన్ని అడ్డం పెట్టుకొని కొందరు నకిలీ వ్యాధులు ఉన్నట్లు సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారనే ఆరోపణలు అన్ని జిల్లాల నుంచి వస్తున్నాయి. అయినా ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వాటన్నింటినీ పరిశీలించడం ఎలా అని ఉన్నతాధికారులు అంటున్నారు.
►వరంగల్ జిల్లాలో 40 మందికిపైగా ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులొచ్చాయని సమాచారం. దీనిపై కలెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఇంతవరకూ విచారణకు కూడా ఆదేశించలేదని ఓ ఉపాధ్యాయుడు తెలిపాడు.
►మేడ్చల్, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ 10 మందికిపైగా టీచర్లు చిన్నచిన్న సర్జరీలు చేయించుకున్నప్పటికీ తమకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లు సర్టిఫికెట్లు పుట్టించి బదిలీలు లేకుండా ప్రయత్నిస్తున్నారని స్థానిక ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఉన్నతాధికారుల బంధువులూ ఉన్నారని చెబుతున్నారు.
►ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో కొందరు ఉపాధ్యాయులు సమర్పించిన పత్రాలపై అధికారుల్లోనూ అనుమానాలున్నట్లు తెలిసింది.
సీనియారిటీపైనా సందేహాలు!
టీచర్ల సీనియారిటీ జాబితా తయారీపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జరిగిన ప్రమోషన్లు, బదిలీల్లో కొందరు అధికారులు అవినీతికి పాల్పడి సస్పెండైన ఉదంతాలున్నాయని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. ఇలాంటి అధికారులు ప్రస్తుతం పారదర్శకంగా సీనియారిటీ జాబితాను తయారు చేస్తారా? అని ఖమ్మంకు చెందిన ఓ ఉపాధ్యాయుడు అనుమానం వ్యక్తం చేశాడు.
కేడర్ స్ట్రెంత్, రోస్టర్ విధానం, వర్కింగ్ పోస్టులు, క్లియర్ వెకెన్సీలు ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ స్పష్టతలేదన్నాడు. జిల్లాలోని వర్కింగ్, ఖాళీ పోస్టులను ఏ దామాషా ప్రకారం భర్తీ చేయనున్నారో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదని గుర్తుచేశాడు. వితంతువులకు, ఒంటిరి మహిళలకు, తీవ్ర వ్యాధిగ్రస్థులకు రక్షణ లేదని, మీడియం పంచాయితీలో సీనియారిటీని ఎలా రూపొందించాలో స్పష్టత ఇవ్వలేదని పలువురు టీచర్లు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment