medical certificates
-
వర్క్ ఫ్రమ్ హోమ్: ఉద్యోగులకు టీసీఎస్ కీలక ఆదేశాలు
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులకు మరో కీలక సమాచారాన్ని అందించింది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి గుడ్ బై చెప్పేందుకు దాదాపు అన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. టీసీఎస్ కూడా తన ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పిస్తోంది. అయితే ప్రత్యేక కారణాల రీత్యా ఇంటినుంచి పని చేయాలనుకునే వారికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి పనిచేయాల్సి వస్తే.. కంపెనీ అంతర్గత వైద్యుల నిర్ధారణ అవసరం అని తాజాగా వెల్లడించింది. ఆయా ఉద్యోగులు వారి రోగ నిర్ధారణలు, చికిత్సలు, ధృవీకరణ పత్రాలను కంపెనీ-ప్యానెల్ మెడికల్ కమిటీ ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇలా కొంతమంది ఉద్యోగులకు ఇంటినుండి పని చేయడానికి అనుమతి ఇచ్చినట్టు టీసీఎస్ తెలిపింది. (Maiden Pharma వివాదాస్పద మైడెన్కు భారీ షాక్: అక్టోబరు 14 వరకు గడువు) కాగా ఇటీవల ఉద్యోగులకు ఆఫీసులకు రావాలని ఆదేశించిన టీసీఎస్. ఇపుడిక ఉద్యోగుల హాజరును పర్యవేక్షిస్తోంది. వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. కంపెనీ సూపర్వైజర్లు రూపొందించిన రోస్టర్ ప్రకారం, కార్పొరేషన్ తన సిబ్బందిని సెప్టెంబర్ 22న తమ కార్యాలయాలకు రిపోర్ట్ చేయాల్సిందిగా అభ్యర్థించింది. ఇప్పటికే ఆఫీసులకు వస్తున్నారని టీసీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. టీసీఎస్‌లోని 6,16,171 మంది ఉద్యోగులలో మూడింట ఒక వంతు మంది కార్యాలయం నుంచే పనిచేయడం ప్రారంభించారని సోమవారం కంపెనీ త్రైమాసిక ఆదాయ ప్రకటన సందర్భంగా చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. డిసెంబరు నుంచి రోస్టర్ ఆధారిత హాజరు తప్పనిసరిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. (మస్క్ కొత్త బిజినెస్:10వేల బాటిల్స్ విక్రయం, నెటిజన్ల సెటైర్లు) -
ఉద్యోగుల బదిలీలలో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు జిల్లాల కేటాయింపు వ్యవహారంలో నకిలీ అనారోగ్య సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. దీనివల్ల అసలైన వ్యాధిగ్రస్తులకు, దివ్యాంగులకు అన్యాయం జరిగే వీలుందని పలువురు వాపోతున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు, దివ్యాంగులను బదిలీల నుంచి మినహాయించే నిబంధన ఉండటంతో దీన్ని అడ్డం పెట్టుకొని కొందరు నకిలీ వ్యాధులు ఉన్నట్లు సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారనే ఆరోపణలు అన్ని జిల్లాల నుంచి వస్తున్నాయి. అయినా ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వాటన్నింటినీ పరిశీలించడం ఎలా అని ఉన్నతాధికారులు అంటున్నారు. ►వరంగల్ జిల్లాలో 40 మందికిపైగా ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులొచ్చాయని సమాచారం. దీనిపై కలెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఇంతవరకూ విచారణకు కూడా ఆదేశించలేదని ఓ ఉపాధ్యాయుడు తెలిపాడు. ►మేడ్చల్, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ 10 మందికిపైగా టీచర్లు చిన్నచిన్న సర్జరీలు చేయించుకున్నప్పటికీ తమకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లు సర్టిఫికెట్లు పుట్టించి బదిలీలు లేకుండా ప్రయత్నిస్తున్నారని స్థానిక ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఉన్నతాధికారుల బంధువులూ ఉన్నారని చెబుతున్నారు. ►ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో కొందరు ఉపాధ్యాయులు సమర్పించిన పత్రాలపై అధికారుల్లోనూ అనుమానాలున్నట్లు తెలిసింది. సీనియారిటీపైనా సందేహాలు! టీచర్ల సీనియారిటీ జాబితా తయారీపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జరిగిన ప్రమోషన్లు, బదిలీల్లో కొందరు అధికారులు అవినీతికి పాల్పడి సస్పెండైన ఉదంతాలున్నాయని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. ఇలాంటి అధికారులు ప్రస్తుతం పారదర్శకంగా సీనియారిటీ జాబితాను తయారు చేస్తారా? అని ఖమ్మంకు చెందిన ఓ ఉపాధ్యాయుడు అనుమానం వ్యక్తం చేశాడు. కేడర్ స్ట్రెంత్, రోస్టర్ విధానం, వర్కింగ్ పోస్టులు, క్లియర్ వెకెన్సీలు ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ స్పష్టతలేదన్నాడు. జిల్లాలోని వర్కింగ్, ఖాళీ పోస్టులను ఏ దామాషా ప్రకారం భర్తీ చేయనున్నారో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదని గుర్తుచేశాడు. వితంతువులకు, ఒంటిరి మహిళలకు, తీవ్ర వ్యాధిగ్రస్థులకు రక్షణ లేదని, మీడియం పంచాయితీలో సీనియారిటీని ఎలా రూపొందించాలో స్పష్టత ఇవ్వలేదని పలువురు టీచర్లు అంటున్నారు. -
తెరుచుకోనున్న వైష్ణోదేవి ఆలయం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉన్న వైష్ణోదేవి ఆలయం ఆదివారం నుంచి తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కారణంగా మార్చి 18న ఆలయం మూతబడగా, దాదాపు 5 నెలల తర్వాత తెరుచుకోనుంది. మొదటి వారంలో రోజుకు 2,000 మందిని మాత్రమే అనుమతించనున్నామని ఆలయాధికారి రమేశ్‌కుమార్ తెలిపారు. వారిలో 1,900 మందిని జమ్మూకశ్మీర్ నుంచి మరో 100 మందిని బయట రాష్ట్రాల నుంచి అనుమతిస్తామని చెప్పారు. సందర్శకులు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టంచేశారు. ఫేస్ మాస్క్, ఫేస్ కవర్ తప్పనిసరి అని చెప్పారు. వచ్చేవారంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలన్నారు. -
మాయ‘రోగుల’పై సస్పెన్షన్ వేటు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీచర్ల బదిలీల్లో అడ్డదారిలో అనారోగ్యం పేరిట ప్రిఫరెన్షియల్ పాయింట్లు పొందేందుకు ప్రయత్నించిన 17 మంది టీచర్లను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సస్పెండ్ చేశారు. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు జారీచేసిన నలుగురు ప్రభుత్వ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టీచర్ల బదిలీల మార్గదర్శకాలతో కూడిన జీవో 16ను ప్రభుత్వం ఈ నెల 6న విడుదల చేసింది. పూర్వపు మెదక్ జిల్లా పరిధిలో 8,269 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్టైటిల్మెంట్ పాయింట్ల ఆధారంగా సీనియార్టీ జాబితా రూపొందించారు. అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ 195 మంది టీచర్లు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో అదనపు ఎన్టైటిల్మెంట్ పాయింట్లు కోరుతూ ఆన్లైన్లో మెడికల్ సర్టిఫికెట్లు దరఖాస్తుతో సమర్పించారు. పరిశీలనకు కలెక్టర్ ఆదేశం.. జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్లపై ఫిర్యాదులు రావడంతో సంగారెడ్డి కలెక్టర్ పరిశీలనకు ఆదేశించారు. ఈ నెల 16, 18ల్లో 195 మంది టీచర్లు సమర్పించిన సర్టిఫికెట్లను కమిటీ పరిశీలించింది. çపరిశీలనకు 8 మంది టీచర్లు గైర్హాజరు కాగా, 14 మంది తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలింది. దీనిపై పరిశీలన జరిపిన సంగారెడ్డి డీఈఓ విజయలక్ష్మి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించిన 11 మందితో పాటు, పరిశీలనకు గైర్హాజరైన ఆరుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేసిన నలుగురు ప్రభుత్వ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సస్పెన్షన్ వేటు పడిన వారిలో సంగారెడ్డి జిల్లా పరిధిలో ఆరుగురు, మెదక్ జిల్లా పరిధిలో ఏడుగురు, సిద్దిపేట జిల్లా పరిధిలో నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తూ, దురుద్దేశ పూర్వకంగా తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించినందునే ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి వెల్లడించారు. -
రూ.10 వేలకు మాయరోగం
సాక్షి, హైదరాబాద్: బదిలీలో నచ్చిన స్థానాన్ని దక్కించుకునేందుకు కొందరు ఉపాధ్యాయులు దారి తప్పారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో విద్యాశాఖనే బురిడీ కొట్టించారు. ఇలా ఒకరిద్దరు కాదు.. ఏకంగా రెండు వేలకు పైగా టీచర్లు నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించి అడ్డదారిలో పాయింట్లు పొందారు. మెడికల్ బోర్డుల్లోని అధికారుల చేతులు తడిపి ‘లేని రోగాల’ తో సర్టిఫికెట్లు పొందారు. ధ్రువపత్రాల పరిశీలనలో ఈ వ్యవహారం వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం టీచర్ల దరఖాస్తుల్లో ప్రత్యేక పాయింట్ల కోసం వచ్చిన ధ్రువపత్రాల పరిశీలన జరుగుతోంది. జిల్లా విద్యాశాఖ అధికారి సమక్షంలో జరిగే ఈ పరిశీలనకు ‘ప్రిఫరెన్షియల్ కేటగిరీ’కి సంబంధించిన వందలాది టీచర్లు గైర్హాజరవుతున్నారు. ఈ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారు తప్పకుండా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అయితే కొందరు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విద్యాశాఖ అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇందులో నకిలీల బాగోతం బయటపడుతోంది. దరఖాస్తుల పరిశీలనకు ఆయా టీచర్లను ప్రత్యేకంగా పిలిచినప్పటికీ పెద్ద సంఖ్యలో గైర్హాజరు కావడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కొందరు నకిలీ సర్టిఫికెట్‌కు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వెచ్చించినట్లు ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. డబ్బులు కొట్టు.. సర్టిఫికెట్ పట్టు ప్రిఫరెన్షియల్ పాయింట్లకు సంబంధించి పలువురు టీచర్లు దొడ్డిదారిలో సర్టిఫికెట్లు పొందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బదిలీల ప్రక్రియలో ఈ కేటగిరీకి పది పాయింట్లు ఇస్తారు. దీంతో పలువురు టీచర్లు ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగికి వైకల్యం, కుటుంబ సభ్యులకు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు ప్రిఫరెన్షియల్ కేటగిరీలోకి వస్తారు. వారు జిల్లా మెడికల్ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే ఆ మేరకు పాయింట్లు పొందొచ్చు. దీంతో సీనియార్టీ జాబితాలో ముందు వరుసలోకి రావడంతో నచ్చిన చోట లేదా పట్టణ ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలుంటాయి. దీంతో కొందరు మెడికల్ బోర్డుల నుంచి నకిలీ ధ్రువీకరణ పత్రాలు పొందారు. బోర్డులోని కొందరు అధికారుల చేతి తడిపి దీర్ఘకాలిక వ్యాధులు, అధిక శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్లు సంపాదించారు. ఏ జిల్లాలో ఎలా..? నిజామాబాద్ జిల్లాలో గురు, శుక్రవారాల్లో జరిగిన పరిశీలనలో 92 మంది టీచర్లు ప్రిఫరెన్షియల్ కేటగిరీ వద్దంటూ అధికారులకు లిఖితపూర్వకంగా లేఖలిచ్చారు. రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 30 మంది టీచర్లు పరిశీలనకే రాలేదు. విద్యాశాఖాధికారులు వారికి ఫోన్ చేసినా స్పందన రాకపోవడం గమనార్హం. అలాగే కరీంనగర్ జిల్లాలో అధికారులు ఏకంగా 185 మంది టీచర్లను ప్రిఫరెన్షియల్ కోటాలో అనర్హులుగా తేల్చారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల వైకల్యం తక్కువగా ఉన్నా.. 70 శాతానికి మించినట్లు సర్టిఫికెట్లు సమర్పించినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. మొత్తంగా ఈ కేటగిరీ కింద 2 వేల మంది దరఖాస్తులను తిరస్కరించినట్లు సమాచారం. ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్న దరఖాస్తుల పరిశీలనకు జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఆ మెడికల్ సర్టిఫికెట్స్ చెల్లవు
సాక్షి, న్యూఢిల్లీ : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) లేదా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్(ఎస్ఎమ్సీ) ఆమోదం పొందని వ్యక్తి జారీ చేసే మెడికల్ లేదా ఫిట్నెస్ సర్టిఫికెట్స్ చెల్లుబాటు కావని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో ఈ మేరకు రాత పూర్వక సమాధానం ఇచ్చారాయన. పాథలాజీలో పీజీ చేసిన డాక్టర్ మాత్రమే ఫిట్నెస్ లేదా మెడికల్ సర్టిఫికెట్స్‌ను జారీ చేయగలరని చెప్పారు. ఇందుకు గతేడాది డిసెంబర్లో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. ఉత్తర గుజరాత్లో పాథాలజిస్టుల అసోసియేషన్లు వేసిన పిటిషన్‌ను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం పాథాలజీలో పీజీ కలిగిన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ మాత్రమే మెడికల్ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేయగలరని పేర్కొంది. -
ఏజెంట్లే వైద్యులు...!
విజయనగగరం ఫోర్ట్: ఏజెంట్ల తీరు వల్ల రవాణా శాఖాధికారులకు కొత్త తలనొప్పి ఎదురైంది. లైసెన్స్ రెన్యువల్ సమయంలో అర్జీదారులు సమర్పిస్తున్న మెడికల్ సర్టిఫికెట్లలో ఏవి అసలైనవో.. ఏవి నకిలీవో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఏజెంట్లే వైద్యుల పేరుతో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తూ అటు అధికారులు ఇటు వాహనదారులను మోసం చేస్తున్నారు. రూ.50, రూ.100కే మెడికల్ సర్టిఫికెట్లు మంజూరు చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని సర్టిఫికెట్లను రవాణా శాఖధికారులు ఆమోదిస్తూ మరికొన్నింటిని తిరస్కరిస్తుండడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరికి అవసరం.. డ్రైవింగ్ లైసెన్స్ కాలపరమితి అయిన తర్వాత రెన్యువల్ చేసుకునే వారు తప్పకుండా మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. సదరు వ్యక్తి కంటి చూపు బాగుందని, ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యుడు నిర్ధారించి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతే రవాణా శాఖాధికారులు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. సొమ్ము చేసుకుంటున్న దళారులు వాహనదారుల అవసరాలను కొంతమంది ఎజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్ ఇస్తూ వాహనదారులను దోచుకుంటున్నారు. వారం రోజులుగా చాలా నకిలీ సర్టిఫికెట్లను అధికారులు తిరస్కరించారు. దీంతో ఏం జరిగిందో తెలియక దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది ఏజెంట్లు వైద్యుడి పేరిట స్టాంప్ తయారు చేసుకుని నకిలీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోని వైద్యుల పేరిట కూడా సర్టిఫికెట్లు జారీ చేయడం..రిజిస్ట్రేషన్ నంబర్ వేయకపోవడంపై అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వారు నకిలీ సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్నారు. నంబర్ తప్పనిసరి వాహనదారుడి చూపు బాగుండడంతో పాటు ఆరోగ్యంగా ఉన్నట్లు ఎంబీబీఎస్ వైద్యుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. అలాగే అతని రిజిస్ట్రేషన్ నంబరు కూడా వేయాలి. ఫొటోపై కూడా వైద్యుడి స్టాంప్ ఉండాలి. ఇలా లేని సర్టిఫికెట్లను మాత్రం తిరస్కరిస్తాం. – ఎ. దుర్గాప్రసాద్‌రావు, వెహికల్ ఇన్స్పెక్టర్ -
రేపటి నుంచి ‘మెడికల్’ సర్టిఫికెట్ల పరిశీలన
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : ఏపీలో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ సీట్ల (కన్వీనర్ కోటా) కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి 21వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రాథమిక మెరిట్ లిస్టును కూడా విడుదల చేశారు. ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అనుబంధ ప్రభుత్వ, ప్రైవేటు (మైనార్టీ, నాన్ మైనార్టీ), తిరుపతి శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. మెరిట్ ఆర్డర్ వారీగా విజయవాడ, హైదరాబాద్, విశాఖ, తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో హాజరై ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలించుకోవాలి. విజయవాడలో 2, కర్నూలులో 1 కొత్తగా ఏర్పాటు చేశారు. వివరాలకు... హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ / హెచ్‌టీటీపీ://ఏపీఎంఈడీఏడీఎం.ఏపీఎస్సీహెచ్ఈ.ఏసీ.ఇన్ వెబ్సైట్లో పొందవచ్చు. -
అర్హతలు లేవు... అయినా వీరు డాక్టర్లు
ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను తనిఖీ చేసిన అధికారులు 85 మందికి ఎటువంటి అర్హతలు లేవని గుర్తింపు జిల్లా వైద్యాధికారికి నివేదిక పెనమలూరు : మండలంలోని ఎటువంటి వైద్య సర్టిఫికెట్లు లేకుండా వైద్యం చేస్తున్న 85 మందిని అధికారులు గుర్తించారు. ఇటీవల లింగనిర్థారణ వ్యవహారం వెలుగుచూడడంతో ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు మండల ప్రత్యేకాధికారిణి,జిల్లా స్రీ,శిశు సంక్షేమ శాఖ పీడీ కృష్ణకుమారి,ఎంపీడీవో జుజ్జవరపు సునీత కానూరులోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, ఆర్ఎంపీ వైద్యశాలలను గురువారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విస్మయం కలిగించే అంశాలు వెలుగు చూశాయి. మండలంలో 85 ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, ఆర్ఎంపీ ఆస్పత్రులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఉన్న వ్యక్తలు డాక్టర్లలా తెల్లకోటు ధరించి ఉన్నారు. వారు వైద్యులని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేవు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఆస్పత్రులు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రోగులకు పరీక్షలు చేసి మందులు ఇవ్వడం,సెలైన్లు ఎక్కించడం, వైద్యానికి సంబంధించి రోగులకు వారు నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో చేర్చుకోవడం,మెడికల్‌షాపులు కూడా నిర్వహించడాన్ని అధికారులు గుర్తించారు. కానూరులోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల్లోని వైద్యులుగా చెలామణీ అవుతున్న వ్యక్తులను ప్రశ్నించగా వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. పైగా తమ విద్యార్హతలకు సంబంధించి ఎటువంటి సర్టిఫికెట్లు కూడా చూపించలేదు. ఆయా సెంటర్లలో రోగులకు వైద్యసేవలందిస్తున్నట్లు ఫొటోలు కూడా పెట్టడంతో అధికారులు నివ్వెరపోయారు. జిల్లా వైద్యాధికారికి నివేదిక గ్రామాల్లో సందుకొక వైద్య కేంద్ర ఉండటంతో వీటి పై జిల్లా వైద్యాధికారికి నివేదిక పంపుతున్నామని ఎంపీడీవో సునీత తెలిపారు. మండలంలో 85 ఫస్ట్‌ఎయిడ్, ఆర్ఎంపీ కేంద్రాలు ఉండగా ఒక్కదానికి కూడా గుర్తింపులేదన్నారు. పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసి మానేసివారు వైద్యుడిగా చెలామణి అవుతున్నారని చెప్పారు. కానూరులో 18,యనమలకుదరులో16, పెనమలూరులో 13 పోను మిగితావి ఏడు గ్రామాల్లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. -
నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించిన ఉపాధ్యాయుల సస్పెన్షన్
ఖమ్మం, న్యూస్‌లైన్: విద్యాశాఖలో పనిచేస్తున్న వారి ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును ఆసరాగా తీసుకుని నకిలీ మెడికల్ సర్టిఫికెట్లను సమర్పించి బిల్లులు కాజేసిన ఏడుగురు ఉపాధ్యాయులు, ఒక జూనియర్ అసిస్టెంట్‌పై వేటుపడింది. వారిని సస్పెండ్ చేస్తూ బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి రవీంద్రనాధ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై క్రిమినల్చర్యల కోసం పోలీస్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు డీఈవో తెలిపారు. అక్రమార్కులకు సహకరించిన నలుగురు ఉన్నతాధికారులపై చర్యల కోసం ఆర్జేడీకి సిఫారసు చేసినట్లు కూడా తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో బి.వెంకటరత్నం-ఎస్జీటీ, యూపీఎస్ నందిపాడు.., పి.వెంకటేశ్వరరావు-స్కూల్ అసిస్టెంట్, జడ్పీఎస్ఎస్ కందుకూరు.., వి.నగేష్- ఎస్జీటీ, పీఎస్ నాచారం.., టి.వెంగళరావు- ఎస్జీటీ, పీఎస్ నార్లవరం.., ఎం.వెంకటేశ్వర్లు- ఎస్జీటీ, పీఎస్ తిర్లాపురం.., చలమారావు-ఎస్జీటీ, పీఎస్ యర్రబోడు.., పి.జానీ- గ్రేడ్-2 హిందీపండిట్, ముత్తగూడెం.., ఎం.వెంకటేశ్వర్లు- స్కూల్ అసిస్టెంట్, ప్రభుత్వ పాఠశాల, చర్ల ఉన్నారు.