విజయనగగరం ఫోర్ట్: ఏజెంట్ల తీరు వల్ల రవాణా శాఖాధికారులకు కొత్త తలనొప్పి ఎదురైంది. లైసెన్స్ రెన్యువల్ సమయంలో అర్జీదారులు సమర్పిస్తున్న మెడికల్ సర్టిఫికెట్లలో ఏవి అసలైనవో.. ఏవి నకిలీవో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఏజెంట్లే వైద్యుల పేరుతో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తూ అటు అధికారులు ఇటు వాహనదారులను మోసం చేస్తున్నారు. రూ.50, రూ.100కే మెడికల్ సర్టిఫికెట్లు మంజూరు చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని సర్టిఫికెట్లను రవాణా శాఖధికారులు ఆమోదిస్తూ మరికొన్నింటిని తిరస్కరిస్తుండడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఎవరికి అవసరం..
డ్రైవింగ్ లైసెన్స్ కాలపరమితి అయిన తర్వాత రెన్యువల్ చేసుకునే వారు తప్పకుండా మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. సదరు వ్యక్తి కంటి చూపు బాగుందని, ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యుడు నిర్ధారించి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతే రవాణా శాఖాధికారులు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు.
సొమ్ము చేసుకుంటున్న దళారులు
వాహనదారుల అవసరాలను కొంతమంది ఎజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్ ఇస్తూ వాహనదారులను దోచుకుంటున్నారు. వారం రోజులుగా చాలా నకిలీ సర్టిఫికెట్లను అధికారులు తిరస్కరించారు. దీంతో ఏం జరిగిందో తెలియక దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది ఏజెంట్లు వైద్యుడి పేరిట స్టాంప్ తయారు చేసుకుని నకిలీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోని వైద్యుల పేరిట కూడా సర్టిఫికెట్లు జారీ చేయడం..రిజిస్ట్రేషన్ నంబర్ వేయకపోవడంపై అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వారు నకిలీ సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్నారు.
నంబర్ తప్పనిసరి
వాహనదారుడి చూపు బాగుండడంతో పాటు ఆరోగ్యంగా ఉన్నట్లు ఎంబీబీఎస్ వైద్యుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. అలాగే అతని రిజిస్ట్రేషన్ నంబరు కూడా వేయాలి. ఫొటోపై కూడా వైద్యుడి స్టాంప్ ఉండాలి. ఇలా లేని సర్టిఫికెట్లను మాత్రం తిరస్కరిస్తాం. – ఎ. దుర్గాప్రసాద్‌రావు, వెహికల్ ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment