రేపటి నుంచి ‘మెడికల్’ సర్టిఫికెట్ల పరిశీలన
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : ఏపీలో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ సీట్ల (కన్వీనర్ కోటా) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి 21వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రాథమిక మెరిట్ లిస్టును కూడా విడుదల చేశారు.
ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అనుబంధ ప్రభుత్వ, ప్రైవేటు (మైనార్టీ, నాన్ మైనార్టీ), తిరుపతి శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. మెరిట్ ఆర్డర్ వారీగా విజయవాడ, హైదరాబాద్, విశాఖ, తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో హాజరై ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలించుకోవాలి. విజయవాడలో 2, కర్నూలులో 1 కొత్తగా ఏర్పాటు చేశారు. వివరాలకు... హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్ / హెచ్‌టీటీపీ://ఏపీఎంఈడీఏడీఎం.ఏపీఎస్‌సీహెచ్‌ఈ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.