MBBS / BEDS course
-
ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఎన్సీసీ రిజర్వేషన్‌కు పిల్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో ఎన్సీసీ విద్యార్థులకు 1 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, డాక్టర్ వైఎస్సార్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైఎస్సార్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, ఎన్సీసీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022–23 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో ఎన్సీసీ సర్టిఫికెట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఫెడరేషన్ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసయ్య నర్సింహ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం ఎన్సీసీ విద్యార్థులకు 1 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కవిత గొట్టిపాటి వాదనలు వినిపిస్తూ.. ఎన్సీసీ కోటా విషయంలో అధికారులు ప్రభుత్వ జీవో ప్రకారం నడుచుకోవడం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. బాధిత విద్యార్థులు వస్తే ఈ వ్యవహారంపై తగిన విధంగా స్పందిస్తామని తెలిపింది. ఇది సర్వీసు వివాదమని, ఇలాంటి వ్యవహారంలో పిల్ దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. అయినా కూడా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది. కవిత జోక్యం చేసుకుంటూ.. ప్రవేశాలు జరుగుతున్నాయని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్‌ను కొట్టేయకుండా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది. నోటీసులు జారీ చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని పేర్కొంది. -
వైద్య విద్యలో కొత్త కోర్సులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైద్య విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఒక మాస్టర్ డిగ్రీతో పాటు మూడు డిగ్రీ కోర్సులను కొత్తగా ప్రవేశపెడుతున్నట్టు వైస్ చాన్సలర్ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ చెప్పారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. పబ్లిక్ హెల్త్‌లో రెండేళ్ల మాస్టర్ డిగ్రీతో పాటు ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ రెండేళ్ల డిగ్రీ, క్రిటికల్ కేర్ మెడిసిన్ ఏడాది, రెండేళ్ల డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఈ కొత్త కోర్సుల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి ప్రవేశం కల్పిస్తామన్నారు. పరిశోధనలకు ప్రాధాన్యం తమ యూనివర్సిటీ ఏడాదిగా పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వీసీ చెప్పారు. అందులో భాగంగానే అండర్ గ్రాడ్యుయేషన్ (ఎంబీబీఎస్) చదివే విద్యార్థులకు రీసెర్చ్ స్కాలర్‌షిప్‌గా మొదటి ఏడాది రూ.50 లక్షల చొప్పున ఇస్తున్న దేశంలోనే ఏకైక యూనివర్సిటీ తమదేనన్నారు. పరిశోధనల్లో పరస్పర సహకారం అందించుకునే విధంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్), సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. గడచిన 14 ఏళ్లలో 20 మందికే పీహెచ్‌డీలు ప్రదానం చేయగా.. ఈ ఏడాది 44 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. మరో మూడు కొత్త వైద్య కళాశాలలు విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం 28 (11 ప్రభుత్వ, 17 ప్రైవేటు) వైద్య కళాశాలలు ఉండగా.. కొత్తగా 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. పాడేరు, మచిలీపట్నం, ఒంగోలు వైద్య కళాశాలలు ఏడాదిలో ప్రారంభం కానున్నాయన్నారు. మిగిలినవి రెండు మూడేళ్లలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వైద్య విద్యార్థులకు ఆన్లైన్ అటెండెన్స్ ప్రవేశపెట్టామని చెప్పారు. దీనివల్ల ప్రతిరోజూ ఎంతమంది విద్యార్థులు తరగతులు, సదస్సులకు హాజరయ్యారో, ఏడాదిలో ఎన్ని రోజులు హాజరయ్యారో తెలిసిపోతుందన్నారు. -
రేపటి నుంచి ‘మెడికల్’ సర్టిఫికెట్ల పరిశీలన
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : ఏపీలో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ సీట్ల (కన్వీనర్ కోటా) కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి 21వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రాథమిక మెరిట్ లిస్టును కూడా విడుదల చేశారు. ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అనుబంధ ప్రభుత్వ, ప్రైవేటు (మైనార్టీ, నాన్ మైనార్టీ), తిరుపతి శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. మెరిట్ ఆర్డర్ వారీగా విజయవాడ, హైదరాబాద్, విశాఖ, తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో హాజరై ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలించుకోవాలి. విజయవాడలో 2, కర్నూలులో 1 కొత్తగా ఏర్పాటు చేశారు. వివరాలకు... హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ / హెచ్‌టీటీపీ://ఏపీఎంఈడీఏడీఎం.ఏపీఎస్సీహెచ్ఈ.ఏసీ.ఇన్ వెబ్సైట్లో పొందవచ్చు.