లబ్బీపేట (విజయవాడ తూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైద్య విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఒక మాస్టర్ డిగ్రీతో పాటు మూడు డిగ్రీ కోర్సులను కొత్తగా ప్రవేశపెడుతున్నట్టు వైస్ చాన్సలర్ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ చెప్పారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. పబ్లిక్ హెల్త్‌లో రెండేళ్ల మాస్టర్ డిగ్రీతో పాటు ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ రెండేళ్ల డిగ్రీ, క్రిటికల్ కేర్ మెడిసిన్ ఏడాది, రెండేళ్ల డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఈ కొత్త కోర్సుల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి ప్రవేశం కల్పిస్తామన్నారు.
పరిశోధనలకు ప్రాధాన్యం
తమ యూనివర్సిటీ ఏడాదిగా పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వీసీ చెప్పారు. అందులో భాగంగానే అండర్ గ్రాడ్యుయేషన్ (ఎంబీబీఎస్) చదివే విద్యార్థులకు రీసెర్చ్ స్కాలర్‌షిప్‌గా మొదటి ఏడాది రూ.50 లక్షల చొప్పున ఇస్తున్న దేశంలోనే ఏకైక యూనివర్సిటీ తమదేనన్నారు. పరిశోధనల్లో పరస్పర సహకారం అందించుకునే విధంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్‌ఐఎన్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్), సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. గడచిన 14 ఏళ్లలో 20 మందికే పీహెచ్‌డీలు ప్రదానం చేయగా.. ఈ ఏడాది 44 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
మరో మూడు కొత్త వైద్య కళాశాలలు
విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం 28 (11 ప్రభుత్వ, 17 ప్రైవేటు) వైద్య కళాశాలలు ఉండగా.. కొత్తగా 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. పాడేరు, మచిలీపట్నం, ఒంగోలు వైద్య కళాశాలలు ఏడాదిలో ప్రారంభం కానున్నాయన్నారు. మిగిలినవి రెండు మూడేళ్లలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వైద్య విద్యార్థులకు ఆన్‌లైన్ అటెండెన్స్ ప్రవేశపెట్టామని చెప్పారు. దీనివల్ల ప్రతిరోజూ ఎంతమంది విద్యార్థులు తరగతులు, సదస్సులకు హాజరయ్యారో, ఏడాదిలో ఎన్ని రోజులు హాజరయ్యారో తెలిసిపోతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment