దివంగత సీఎం వైఎస్, ఆయన తనయుడు జగన్ పాలనలో వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత
అందుకే వైఎస్సార్ పేరు నామకరణం
కక్ష సాధింపులో భాగంగా వైఎస్సార్ పేరు తొలగింపు
సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన వైద్యసేవలు, విద్యార్థులకు వైద్య విద్యను అందించడంలో పూర్తి నిర్లక్ష్యం వహించిన చంద్రబాబు హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పునకు మాత్రం అత్యుత్సాహం చూపించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడుసార్లు సీఎంగా చేసిన బాబు ఏనాడు ప్రభుత్వ వైద్య రంగాన్ని పట్టించుకోలేదు. పైగా ప్రైవేటు వైద్య కళాశాలలను, ప్రైవేటు ఆసుపత్రులను ప్రోత్సహించి వైద్య వృత్తిని వ్యాపారం చేశారు.
కానీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ, 108, 104 వ్యవస్థలను ప్రవేశపెట్టి వైద్యశాఖను బలోపేతం చేశారు. ఆయన తనయుడైన జగన్ గడిచిన ఐదేళ్లలో వైద్యరంగం రూపురేఖలు మార్చారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. అలాగే, నాడు–నేడుతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఆధునీకరించారు.
ఈ నేపథ్యంలోనే.. వైద్య రంగాన్ని పేదలకు చేరువ చేసిన వైఎస్సార్ పేరును హెల్త్ యూనివర్శిటీకి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెట్టింది. దీనికితోడు ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టి వైఎస్ జగన్ ఆదర్శంగా నిలిచారు. కానీ, రాజకీయ కక్ష సాధింపునకు కొనసాగింపుగా బాబు వైఎస్సార్ పేరును తొలగించి ఎన్టీఆర్ పేరు పెడుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు తప్పుబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment