అర్హతలు లేవు... అయినా వీరు డాక్టర్లు
ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను తనిఖీ చేసిన అధికారులు
85 మందికి ఎటువంటి అర్హతలు లేవని గుర్తింపు
జిల్లా వైద్యాధికారికి నివేదిక
పెనమలూరు : మండలంలోని ఎటువంటి వైద్య సర్టిఫికెట్లు లేకుండా వైద్యం చేస్తున్న 85 మందిని అధికారులు గుర్తించారు. ఇటీవల లింగనిర్థారణ వ్యవహారం వెలుగుచూడడంతో ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు మండల ప్రత్యేకాధికారిణి,జిల్లా స్రీ,శిశు సంక్షేమ శాఖ పీడీ కృష్ణకుమారి,ఎంపీడీవో జుజ్జవరపు సునీత కానూరులోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, ఆర్‌ఎంపీ వైద్యశాలలను గురువారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విస్మయం కలిగించే అంశాలు వెలుగు చూశాయి. మండలంలో 85 ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, ఆర్‌ఎంపీ ఆస్పత్రులు ఉన్నట్లు గుర్తించారు.
ఇందులో ఉన్న వ్యక్తలు డాక్టర్లలా తెల్లకోటు ధరించి ఉన్నారు. వారు వైద్యులని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేవు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఆస్పత్రులు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రోగులకు పరీక్షలు చేసి మందులు ఇవ్వడం,సెలైన్‌లు ఎక్కించడం, వైద్యానికి సంబంధించి రోగులకు వారు నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో చేర్చుకోవడం,మెడికల్‌షాపులు కూడా నిర్వహించడాన్ని అధికారులు గుర్తించారు. కానూరులోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ల్లోని వైద్యులుగా చెలామణీ అవుతున్న వ్యక్తులను ప్రశ్నించగా వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. పైగా తమ విద్యార్హతలకు సంబంధించి ఎటువంటి సర్టిఫికెట్లు కూడా చూపించలేదు. ఆయా సెంటర్లలో రోగులకు వైద్యసేవలందిస్తున్నట్లు ఫొటోలు కూడా పెట్టడంతో అధికారులు నివ్వెరపోయారు.
జిల్లా వైద్యాధికారికి నివేదిక
గ్రామాల్లో సందుకొక వైద్య కేంద్ర ఉండటంతో వీటి పై జిల్లా వైద్యాధికారికి నివేదిక పంపుతున్నామని ఎంపీడీవో సునీత తెలిపారు. మండలంలో 85 ఫస్ట్‌ఎయిడ్, ఆర్‌ఎంపీ కేంద్రాలు ఉండగా ఒక్కదానికి కూడా గుర్తింపులేదన్నారు. పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసి మానేసివారు వైద్యుడిగా చెలామణి అవుతున్నారని చెప్పారు. కానూరులో 18,యనమలకుదరులో16, పెనమలూరులో 13 పోను మిగితావి ఏడు గ్రామాల్లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.