సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ), తెలంగాణ విశ్వ విద్యాలయం (టీయూ), మహారాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్‌సైట్ల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేసి.. నకిలీవి తయారు చేస్తూ అవసరమున్న వారికి విక్రయిస్తోంది ఓ కన్సల్టెన్సీ. రూ.50 వేల నుంచి రూ.75 వేలకు ఆయా వర్సిటీల బీటెక్, డిగ్రీ, ఇంటర్ సర్టిఫికెట్లను విక్రయిస్తున్నట్లు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ దృష్టికి రావటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
వీరి నుంచి ఏయూకు చెందిన 130, టీయూకు చెందిన 63, మహారాష్ట్ర ఇంటర్ బోర్డుకు చెందిన 27 నకిలీ సర్టిఫికెట్లను, 6 కంప్యూటర్లు, 4 ల్యాప్‌టాప్‌లు, 2 హెచ్‌పీ ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. నగర సీపీ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు. యాకుత్‌పురా దోభీఘాట్‌కు చెందిన సయ్యద్ నవీద్ అలియాస్ ఫైసల్ (30)కు బషీర్‌బాగ్‌లోని బాబుఖాన్ ఎస్టేట్స్ 7వ అంతస్తులో క్యూబెస్ ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కన్సల్టెన్సీ ఉంది.
ఇందులో గౌలిపురకు చెందిన సయ్యద్ ఓవైస్ అలీ అలియాస్ ఓవైస్ (22) డీటీపీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ కన్సల్టెన్సీ డీటీపీ వర్క్, వీసా ప్రాసెసింగ్, సర్టిఫికేషన్ వర్క్స్ వంటి అన్ని రకాల ఆన్‌లైన్ సేవలను అందిస్తోంది. కరోనా నేపథ్యంలో వ్యాపారం నష్టాల్లో ఉండటంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జులై నుంచి నకిలీ సర్టిఫికెట్లు, సాలరీ స్లిప్‌లు, మెడికల్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, జాబ్ ఆఫర్, రిలీవింగ్ లెటర్లు వంటివి తయారు చేస్తూ.. అవసరం ఉన్న కస్టమర్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఆయా యూనివర్సిటీ వెబ్‌సైట్ల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని అభ్యర్థుల పేర్లు, రోల్ నంబర్లను ఫొటోషాప్, డీటీపీ వర్క్‌తో ఎడిట్ చేసి నకిలీవి తయారు చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేయడానికి వెళ్లే ప్రైవేట్ ఉద్యోగులకు, అల్రెడీ చేస్తున్న వారికి అంతర్గత ప్రమోషన్ల కోసం ఈ నకిలీ సర్టిఫికెట్లను విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
అలాగే యూకేలోని టీసైడ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బ్లాక్‌పోల్, యూనివర్సిటీ ఆఫ్ లా, స్కాంట్లాండ్‌లోని హెరియట్‌వాట్ యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ షిల్లెర్, యూనివర్సిటీ ఆఫ్ కన్కార్డియాలలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయని టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ డీసీపీ పి. రాధాకిషన్ రావు తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న నిందితులు నవీద్, సయ్యద్ ఓవైస్ అలీలపై సైఫాబాద్, అబిద్ రోడ్, ముషీరాబాద్, నిజామాబాద్‌లోని డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
(చదవండి: ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ తుపాను బీభత్సం.. 21 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment