ఎందుకిలా తరచూ తలనొప్పి..?
న్యూరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 33 ఏళ్లు. ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ ఉద్యోగం చేస్తున్నాను. గత కొన్ని రోజుల నుంచి తీవ్రంగా తలనొప్పి వస్తోంది. క్లాస్‌రూమ్‌లో పిల్లల గోల, పని ఒత్తిడితో తరచూ తలనొప్పి వస్తున్నదేమోనని కుటుంబసభ్యులు అంటున్నారు. ఇంటి దగ్గర డాక్టర్‌ను సంప్రదించి కొన్ని మందులు వాడాను. కొంత ఉపశమనం ఉన్నప్పటికీ మళ్లీ తలనొప్పి తీవ్రంగా వస్తోంది. ఇంత ఎక్కువగా తలనొప్పి రాకూడదని ఒకసారి స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలవమని ఫ్రెండ్స్ సలహా ఇస్తున్నారు. అసలు నాకు తలనొప్పి ఎందుకు వస్తోంది? నేనేవరిని సంప్రదించాలి? పరిష్కారం చూపండి. - వీణ, వైజాగ్
తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయి. ప్రధానంగా అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, రక్తప్రసరణలో మార్పులు, మెదడులో కణుతులు లాంటి అనేక కారణాలతో తలనొప్పి తీవ్రంగా రావచ్చు. మీరనుకుంటున్నట్లు వృత్తిరీత్యా వచ్చే తలనొప్పులు కూడా ఉంటాయి. అయితే మీకు ఒకవైపు తలనొప్పి వస్తోందా లేక రెండువైపులా వస్తోందా అన్నది మీ లేఖలో వివరించలేదు. అలాగే మీకు తలనొప్పి వచ్చినప్పుడు తుమ్ములు రావడం, ముక్కు నుంచి నీరు కారడం లాంటి లక్షణాలు ఉన్నాయా అన్న అంశం కూడా తెలుపలేదు. ఒకవేళ మీరు తలనొప్పితో బాధపడుతున్నప్పుడు పైన తెలిపిన లక్షణాలు కూడా ఉంటే మీకు మైగ్రేన్ ఉన్నట్లు భావించవచ్చు. ఎందుకంటే స్త్రీలతో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మీ ఉద్యోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే, పని ఒత్తిడితో మీ తలలోని రక్తనాళాలు ఒత్తిడి గురికావడం వల్ల కూడా మీకీ మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. అలాకాకుండా కేవలం తీవ్రమైన తలనొప్పితో తరచూ బాధపడుతుంటే మాత్రం విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. మీరు వెంటనే నిపుణులైన న్యూరాలజీ స్పెషలిస్ట్‌ను కలవండి. మీ తలనొప్పికి కారణాన్ని తెలుసుకోవడానికి రక్తపరీక్ష, సీటీ స్కాన్ లాంటి కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు.
మీ అసలు కారణాన్ని తెలుసుకొని దాన్ని బట్టి చికిత్స చేస్తారు. ఒకవేళ మీకు మరింకేదైనా క్లిష్టమైన సమస్య ఉన్నా ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన అధునాతనమైన పురోగతి వల్ల మీకు మరింత మెరుగైన చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకుంటూ, మీ జీవనశైలిలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే మీ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ కుటుంబపరంగా, వృత్తిపరంగా ఏమైనా ఒత్తిళ్లు ఉంటే వాటి నుంచి బయటపడేందుకు తగిన ప్రయత్నాలు చేయండి.
డాక్టర్ జి.రాజశేఖర్‌రెడ్డి
సీనియర్ న్యూరో ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సోమాజీగూడ, హైదరాబాద్
బ్రాంకైటిస్ తగ్గుతుందా..?
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 32 ఏళ్లు. కొంతకాలంగా కఫం, దగ్గుతో బాధపడుతున్నాను. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోంది. డాక్టర్ సంప్రదిస్తే బ్రాంకైటిస్ అన్నారు. మందులు వాడుతున్నప్పుడు ఉపశమనం ఉంటోంది. హోమియో ద్వారా సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. - నిరంజన్, మదనపల్లి
శ్వాసనాళాల్లోకి ప్రవేశించి మార్గం ట్రాకియా రెండుగా చీలి ఉంటుంది. వీటిని ‘బ్రాంకై’ అంటారు. ఇవి మళ్లీ అతి సన్నటి భాగాలుగా విభజితమై ఉంటాయి. వీటిని బ్రాంకియోల్స్ అంటారు. ఇవి ఆల్వియోలై అనే అతి సూక్ష్మమైన గాలిగదుల్లోకి ప్రవేశిస్తాయి. ఊపిరితిత్తుల్లోకి చేరే శ్వాసనాళాల లోపలి భాగంలో శ్లేష్మపు పొర ఉంటుంది. ఏ కారణం చేతనైనా వీటిలో వాపునకు గురికావడాన్ని బ్రాంకైటిస్ అంటారు. వారం నుంచి మూడు వారాల పాటు బ్రాంకైటిస్ లక్షణాలు ఉంటే ఆ స్థితిని అక్యూట్ బ్రాంకైటిస్ అని, ఏడాదిలో మూడు నెలల పాటు దగ్గు, తెమడ ఉంటే క్రానిక్ బ్రాంకైటిస్ అని అంటారు. పొగతాగడం, వాతావరణంలో మార్పులు, కాలుష్యం, ఇన్ఫెక్షన్స్ వంటి అనేక కారణాల వల్ల బ్రాంకైటిస్ వస్తుంది. జన్యుసంబంధమైన అంశాలు, సిస్టిక్ ఫైబ్రోసిస్, గుండెజబ్బులు, రోగనిరోధక శక్తి లోపించడం వంటి ఇతర కారణాలతోనూ బ్రాంకైటిస్ వచ్చే అవకాశం ఉంది.
లక్షణాలు : కఫంతో కూడిన దగ్గు; కఫం తెలుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండి కొన్ని సందర్భాంల్లో రక్తంతో కూడిన తెమడ పడుతుండవచ్చు. ఆయాసం, శ్వాస తీసుకునే సమయంలో పల్లికూతల వంటి శబ్దాలు వినిపించడం; నీరసం, గొంతునొప్పి, కండరాల నొప్పి, ముక్కుదిబ్బడ, తలనొప్పి, దీర్ఘకాలంగా దగ్గు వల్ల ఛాతీనొప్పి, జ్వరం వంటి లక్షణాలనూ గమనించవచ్చు.
చికిత్స : అన్ని దశలలోని బ్రాంకైటిస్ సమస్యకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. జెనెటిక్ వైద్య విధానం ద్వారా దీర్ఘకాలికంగా వచ్చే దగ్గు, తెమ వంటి లక్షణాలను తగ్గించడమే గాకుండా శ్వాసనాళంలోని ఇన్‌ఫ్లమేషన్ లేదా వాపును తగ్గించడం జరుగుతుంది. హోమియో మందుల ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరచి బ్రాంకైటిస్‌ను మళ్లీ రాకుండా చేయడం సాధ్యమవుతుంది. రోగి మానసిక, శారీరక లక్షణాలను మాత్రమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, అనువంశీకంగా ఉండే లక్షణాల వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని వైద్యచికిత్స అందించడం ద్వారా కేవలం రోగ లక్షణాలను మాత్రమే కాకుండా వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్