ఆత్మవిశ్వాసమే ఆయుధంగా..
ఆమెకు కంటిచూపు లేదు. అయినా బాధపడలేదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంది. ఎవరిపై ఆధారపడకుండా జీవితంలో స్థిరపడాలనుకుంది. పట్టుదలతో ముందుకు సాగింది. కుటుంబపోషణలో నేను సైతం అంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. పులివెందుల ఎస్‌బీఐ కాలనీలో నివాసముంటున్న వెంకటమహేశ్వరి సొంతగ్రామం వేముల మండలం కె.కె.కొట్టాల. ఈమె తల్లిదండ్రులు ఈశ్వరయ్య, లక్ష్మిదేవి. ఈమె పుట్టుకతోనే అంధురాలు. చూపు లేకపోవడంతో ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆమె ఏమాత్రం ఎదురుచూడలేదు. చదువుకుని ఉన్నత స్థితికి చే రాలని నిర్ణయించుకుంది. అనంతపురం జిల్లాలో అంధుల పాఠశాలలో చేరింది. బ్రెయిలీ లిపిలో విద్య నేర్చుకుంది.
ఆ తర్వాత కళ్యాణదుర్గంలో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసింది. టీచర్ ఉద్యోగం వచ్చే వరకు మిన్నకుండకుండా బ్యాక్‌లాగ్ కోటాలో పులివెందుల మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా ఉద్యోగం సాధించింది. రూ. 15 వేలు వేతనం తీసుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. ఆమెను న్యూస్‌లైన్ పలకరిస్తే.. ఆత్మవిశ్వాసం.. స్థైర్యంతో భవిష్యత్తులో ఉపాధ్యాయురాలిని కావాలన్నదే తన లక్ష్యమంది. తనలాగా కళ్లులేని వారి గురించి తెలిస్తే వారికి తనవంతు సహాయం.. సహకారం అందిస్తాన ంటోంది.