pothuraju
-
పోతరాజు అవతారమెత్తిన రాహుల్.. కొరడాతో విన్యాసం
సాక్షి, సంగారెడ్డి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోతరాజు అవతారం ఎత్తారు. ఆయన తలపెట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పోతురాలు రాహుల్‌ను కలిశారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలు, పోతురాజుల గురించి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాహుల్‌కు వివరించారు. ఈ క్రమంలో పోతరాజుల నుంచి కొరడా అందుకున్న రాహుల్ దానితో కొట్టుకున్నారు. రాహుల్ చేసిన విన్యాసానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అవాక్కయ్యారు. మరోవైపు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలో ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగుతోంది.. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారురు. ఏఐసీసీ, రాష్ట్ర అగ్రనేతలు ఆయన వెంట నడుస్తున్నారురు. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించగా.. బీహెచ్ఈఎల్ లింగంపల్లి వద్ద కాంగ్రెస్ ముఖ్యనేతలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రామచంద్రాపురం, పటాన్చెరు మీదుగా ముత్తంగి వరకు సుమారు 11 కి.మీ పాదయాత్ర కొనసాగింది. చదవండి: రాజాసింగ్‌పై వందకుపైగా క్రిమినల్ కేసులు -
ఒకేసారి 108 పోతరాజుల విన్యాసాలు
హైదరాబాద్: రాంగోపాల్‌పేట్ డివిజన్ నల్లగుట్టలో ఆదివారం జరిగిన తొట్టెల ఊరేగింపులో ఒకేసారి 108 మంది పోతరాజులు చేసిన విన్యాసాలు చూపరులను అలరించాయి. స్థానికనేత కేశబోయిన మనోహర్ యాదవ్ తన తాత బలరాం యాదవ్ జ్ఞాపకార్థం పీజీరోడ్ జవహార్‌నగర్‌లోని పోచమ్మ దేవాలయం నుంచి నల్లగుట్టలోని కనకదుర్గమ్మ ఆలయం వరకు ఫలహార బండి, తొట్టెల ఊరేగింపును నిర్వహించారు. పీజీరోడ్ జవహార్‌నగర్‌లోని పోచమ్మ దేవాలయం నుంచి నల్లగుట్టలోని కనకదుర్గమ్మ ఆలయం వరకు కొనసాగిన ఈ ఊరేగింపునకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఈ ఊరేగింపులో పోతరాజులు తమ వీరంగాలు, డప్పులు దరువులు, నృత్యాలతో అలరించారు. వీరితో పాటుగా 20 బృందాలకు చెందిన 625 మంది కళాకారులు పాల్గొన్నారు. మల్లన్న డప్పులు, కోలాటాలు, విచిత్ర వేషాలు, రాధా కృష్ణుల వేషధారణ, పులివేషాలతో వీరంతా చూపరులను అలరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ 108 మంది పోతరాజులతో ఎక్కడ ఫలహార బండి ఊరేగింపు జరగలేదని దేశంలో తొలిసారిగా తాము నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, యూనివర్శల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను వారికి సమర్పిస్తామని అటు తర్వాత రికార్డుల్లోకి ఎక్కుతాయని చెప్పారు. -
పోతరాజుల పోసాని
ఒళ్లంతా పసుపు.. కుంకుమలు.. చేతిలో చర్నాకోల.. కళ్లకు కాటుక. నోటిలో నిమ్మకాయలు.. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు.. బోనాల ఉత్సవాల్లో పోతరాజుల సందడి అంతా ఇంతా కాదు. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతరలో పోతరాజు వేషధారణలో పోసాని కుటుంబానికి వందేళ్ల చరిత్ర ఉంది. ఇప్పటికీ ఆ కుటుంబానికి చెందినవారే అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పోతరాజు వేషధారణతో అలరిస్తున్నారు. చాంద్రాయణగుట్ట :మేకలబండకు చెందిన ‘పోసాని’ కుటుంబం నుంచి ఎనిమిది మంది పోతరాజు వేషధారణ వేశారు. 1908లో ఆలయంలో బోనాలు ప్రారంభమైన కొన్నేళ్ల నుంచే ఈ కుటుంబ సభ్యులు పోతరాజు వేషధారణ వేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే వంశానికి చెందిన నాలుగో తరం వారు వంశపారంపర్యంగా పోతరాజు వేషధారణలో కొనసాగుతున్నారు. పోసాని బాబయ్య అలియాస్ సింగారం బాబయ్యతో ఈ అంకానికి శ్రీకారం చుట్టారు. బాబయ్య తమ్ముడు ఎట్టయ్య, బాబయ్య కుమారుడు లింగమయ్య, లింగమయ్య తమ్ముడు సత్తయ్య, లింగమయ్య కుమారుడు బాబురావు, బాబురావు సోదరుడు సుధాకర్, హేమానంద్.. ఇలా ఇప్పటి వరకు ఏడుగురు ఒకే వంశం నుంచి పోతరాజు వేషధారణ వేశారు. 2015 బోనాల నుంచి బాబురావు కుమారుడు పోసాని అశ్విన్ పోతరాజు వేషధారణ వేస్తున్నారు. పోసాని వంశం నుంచి మూడో తరానికి చెందిన బాబురావు 30 ఏళ్ల పాటు పోతరాజుగా తనదైన ముద్ర వేయడం గమనార్హం. అమ్మవారి ఆశీస్సులతోనే.. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతోనే 30 ఏళ్ల పాటు పోతరాజుగా రాణించాను. దీంతో నన్నందరూ ‘పోతరాజు బాబురావు’ అని పిలుస్తుంటే ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంటుంది. – పోతరాజు (పోసాని) బాబురావు ఎంతో సంతోషాన్నిచ్చింది.. నాలుగేళ్లుగా పోతరాజు వేషధారణ వేస్తున్నాను. ఘటస్థాపన రోజు నుంచి నియమ నిష్టలతో ఉంటూ అమ్మవారి ధ్యానంలో గడుపుతున్నాను. అమ్మవారి కరుణతోనే పోతరాజు వేసే అవకాశం దక్కిందని భావిస్తున్నా. – పోసాని అశ్విన్, ప్రస్తుత పోతరాజు పోతరాజు అంటే ఏమిటి.. పోతరాజంటే ఏడుగురు అక్కల ముద్దుల తమ్ముడు. అమ్మవారిని పొలిమేర నుంచి గ్రామంలోని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు, అనంతరం సాగనంపేటప్పుడు రక్షణగా ముందు నడుస్తూ ఉంటాడు. డప్పు చప్పుళ్లకనుగుణంగా ఆనందంతో నృత్యం చేస్తూ స్వాగతిస్తుంటాడు. ఏడుగురు అక్కాచెల్లెళ్లు అయిన అమ్మవార్లకు ఈ పోతురాజంటే అమితానందం. దీంతో ఆయన సూచించిన రహదారిలో నడుస్తూ దేవాలయానికి తరలి వస్తారు. ఆయన గావుతో శాంతించి పొలిమేర దాటుతారు. -
ఈ యోధుడి త్యాగానికి విలువేది
పశ్చిమగోదావరి,దెందులూరు: స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వీరులు వారు. మన భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పోరాడిన సమర యోధులు. ఈ రోజున వారి త్యాగానికి మాత్రం విలువ శూన్యం. అందుకు ఉదాహరణే దెందులూరు నియోజకవర్గం రామారావుగూడెంకు చెందిన గాంధేయ వాది, శతాధిక వృద్ధుడు నేతల పోతురాజు. స్వాతంత్య్ర సమరయోధులు, సీనియర్ సిటిజన్లకు అన్ని రాయితీలు, ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం మాత్రం ఆయనను నిర్లక్ష్యం చేసింది. 103 ఏళ్ల వయసులోను పెన్షన్ కోసం ఎన్నో సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా రెండు నెలల నుంచి మాత్రమే ఇస్తున్నారు. స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన తనకు సమరయోధులకు ఇచ్చే సాయాన్ని అందించాలని పోతురాజు కోరుతున్నారు. నేతల సహదేవుడు, శేషమ్మల కుమారుడైన పోతురాజుకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి. యువకుడిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెళ్ళ నాగిరెడ్డి, చింతలపాటి మూర్తిరాజులతో కలిసి పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చాటపర్రు గ్రామంలో రూపాయి నాణేలతో కూడిన సంచిని చందాగా ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు. 1940లో సర్వోదయ సమ్మేళనంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం వరకూ స్వాతంత్య్ర సమరయోధులు కందికట్ల నాగభూషణం, నర్రా మృత్యుంజయరావు, చింతలపాటి మూర్తిరాజు తదితరులతో కలిసి పాదయాత్ర చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలోను చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్య్ర అనంతరం ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం, ఇతర కీలక ఉద్యమాల్లోను పాలుపంచుకున్నారు. అప్పటి ప్రతిపక్ష నేత తరిమెళ్ళ నాగిరెడ్డికి రూ. 200లు ఇవ్వడంతో పాటు, ముఖ్యమంత్రి సంజీవరెడ్డికి రూ.1,116 తన వంతు సాయంగా అందించారు. జవహర్లాల్ నెహ్రూ, పుచ్చలపల్లి సుందరయ్యను అమితంగా అభిమానిస్తానని పోతురాజు తెలిపారు. పూర్తి శాకాహారైన పోతురాజుకు వార్తాపత్రికల పఠనం, రామకోటి రాయడం, భగవద్గీత చదవటం, తన దగ్గరకు వచ్చిన వారికి ఆనాటి ఉద్యమాలపై వివరించటం దినచర్య. ఈ వయసులోను ఎంతో చురుగ్గా ఉండే ఆయన కర్ర సాయం లేకుండా నడవగలరు. అనేక సార్లు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి వైద్యం సాయం అందలేదు. మూడేళ్ళ క్రితం ఆయన భార్య మృతి చెందారు. గత రెండు నెలల నుంచి మాత్రమే పింఛన్ ఇస్తున్నారు. తాను చేసిన సేవలకు గాను అప్పటి ప్రభుత్వాలు గుర్తింపు సర్టిఫికెట్లు ఇచ్చాయని, ప్రస్తుతం అవి కనిపించడం లేదని, ఎలాగైనా తనను ఆదుకోవాలని కోరుతున్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే అన్ని రాయితీలను తనకు వర్తింపచేయాలని పోతురాజు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రపతికి వివరిస్తా.. పలు ఉద్యమాల్లో విశేష సేవలందించిన నేతల పోతురాజు మా నియోజకవర్గంలో ఉండడం గర్వకారణం. స్వాతంత్య్ర సమరయోధుడికి దక్కే అన్ని రాయితీలు ప్రభుత్వం మానవతాదృక్పథంతో అందించేలా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తా.– కొఠారు అబ్బయ్య చౌదరి,దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్. -
రాజు ది గ్రేట్
జ్ఞానం మూడో నేత్రం అంటారు. మరీ ముఖ్యంగా అంధులకు చదువు చాలా ముఖ్యం. కళ్లతో లోకాన్ని చూడలేకపోయినా ఆత్మస్థైర్యం, పట్టుదలతో ప్రపంచాన్ని జయించగలరు. అంధులకు ప్రత్యేకంగా బ్రెయిలీ లిపి కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ జీవితమే దీనికి ఉదాహరణ. తన మూడు సంవత్సరాల వయస్సులోనే ఒక ప్రమాదంలో ఆయన చూపు కోల్పోయారు. కానీ ఆత్మస్థైర్యాన్ని వీడక బ్రెయిలీ పేపర్ మీద ఎత్తు చుక్కల ఆధారంగా ఒక భాష రూపొందించారు. ఈ చుక్కలను స్మర్శించడం ద్వారా కనిపించకపోయినప్పటీకీ చదివేలా లిపి రూపొందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నేడు ఆ చుక్కల భాషే ఎందరో అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన అంధ ఉపాధ్యాయుడు మల్లాబత్తుల పోతురాజుది ఇటువంటి ఆదర్శప్రాయమైన జీవితమే. నేడు లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఆ వివరాలు ఇలా.. జంగారెడ్డిగూడెం రూరల్ :కంటి చూపు కోల్పోయినా పట్టుదలతో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాధ్యాయుడు మల్లాబత్తుల పోతురాజు. మేనరికం కారణంగా బాల్యం నుంచి చూపుకు దూరమైనా ఎంతో కష్టపడి పీజీ స్థాయి వరకు చదువుకొని తాను విద్యనభ్యసించిన పాఠశాలలోనే ఉపా«ధ్యాయుడిగా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మల్లాబత్తుల పోతురాజు ఇదే గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల మెయిన్‌లో 7 వ తరగతి వరకు విద్యనభ్యసించారు. అనంతరం 8 నుంచి టెన్త్ వరకు హైదరాబాద్‌లోని జీబీహెచ్‌ఎస్ పాఠశాలలో, ఇంటర్మీడియట్ మలక్‌పేటలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ నిజాం కళాశాలలో, పీజీ ఉస్మానియాలో, బీఈడీ నల్లగొండలో విద్యనభ్యసించారు. 2001 డీఎస్సీలో టీచర్‌గా ఎంపికైన అనంతరం పోతురాజు మాస్టారు 2002 జనవరిలో పోలవరం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2003 నుంచి జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి తన స్వగ్రామమైన శ్రీనివాసపరంలో ఉన్న తాను చదివిన పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా బా«ధ్యతలు చేపట్టారు. తన సొంత గ్రామంలో, చదివిన పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేయడం పోతురాజు జీవితంలో మరిచిపోని అనుభూతిగా నిలిచింది. పోతురాజు బ్రెయిలీ ద్వారా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఆకట్టుకునే విద్యాబోధన పోతురాజు మాస్టారు విద్యాబోధన అంటే విద్యార్థులకు ఎంతో ఆసక్తి. అంధత్వం ఉన్నా పాఠ్యాంశాలకు సంబంధించిన బ్రెయిలీ పుస్తకాలను తెప్పించుకుని మరీ విద్యను బోధిస్తున్నారు. బ్రెయిలీ పుస్తకంలో చుక్కలను చేతితో తాకుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. బోర్డు దగ్గరగా తన కళ్లను పెట్టి అక్షరాలను కూడా అవలీలగా రాస్తూ విద్యాబోధన చేస్తున్నారు. 2012 సంవత్సరంలో పోతురాజు మాస్టారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నారు. నా ఆత్మస్థైర్యమే నన్ను నడిపించింది నాకు చిన్ననాటి నుంచి అంధత్వం ఉన్నా ఏనాడు కుమిలిపోలేదు. ఆత్మస్థైర్యంతో చదివి అనుకున్నది సాధించాను. నా తల్లితండ్రులైన రాములు, సీతల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. నా స్వగ్రామంలో నేను చదవిన పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉంది. వైకల్యం కలిగిన వారిని చూసి అయ్యో పాపం అనేదాని కన్నా.. చేతనైనా సాయం చేస్తే ఎంతో మేలు చేసినవారవుతారు. –మల్లాబత్తుల పోతురాజు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
పోతురాజు ఇంటిపై ఏసీబీ దాడి
విశాఖపట్నం : విశాఖపట్నం నగరంలోని సబ్ రిజిస్ట్రార్ పోతురాజు ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. అతడి బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడుల చేశారు. ఇప్పటి వరకు రూ. కోటి 20 లక్షలకు పైగా ఆస్తులను ఏసీబీ గుర్తించినట్లు తెలిసింది. అయితే దాడులు కొనసాగుతున్నాయి. పోతురాజు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు.