ఇంట్లో రామకోటి రాస్తున్న పోతురాజు ,స్వాతంత్య్ర సమరయోధుడు పోతురాజు
పశ్చిమగోదావరి,దెందులూరు: స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వీరులు వారు. మన భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పోరాడిన సమర యోధులు. ఈ రోజున వారి త్యాగానికి మాత్రం విలువ శూన్యం. అందుకు ఉదాహరణే దెందులూరు నియోజకవర్గం రామారావుగూడెంకు చెందిన గాంధేయ వాది, శతాధిక వృద్ధుడు నేతల పోతురాజు. స్వాతంత్య్ర సమరయోధులు, సీనియర్ సిటిజన్‌లకు అన్ని రాయితీలు, ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం మాత్రం ఆయనను నిర్లక్ష్యం చేసింది. 103 ఏళ్ల వయసులోను పెన్షన్ కోసం ఎన్నో సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా రెండు నెలల నుంచి మాత్రమే ఇస్తున్నారు. స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన తనకు సమరయోధులకు ఇచ్చే సాయాన్ని అందించాలని పోతురాజు కోరుతున్నారు.
నేతల సహదేవుడు, శేషమ్మల కుమారుడైన పోతురాజుకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి. యువకుడిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెళ్ళ నాగిరెడ్డి, చింతలపాటి మూర్తిరాజులతో కలిసి పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చాటపర్రు గ్రామంలో రూపాయి నాణేలతో కూడిన సంచిని చందాగా ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు. 1940లో సర్వోదయ సమ్మేళనంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం వరకూ స్వాతంత్య్ర సమరయోధులు కందికట్ల నాగభూషణం, నర్రా మృత్యుంజయరావు, చింతలపాటి మూర్తిరాజు తదితరులతో కలిసి పాదయాత్ర చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలోను చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్య్ర అనంతరం ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం, ఇతర కీలక ఉద్యమాల్లోను పాలుపంచుకున్నారు. అప్పటి ప్రతిపక్ష నేత తరిమెళ్ళ నాగిరెడ్డికి రూ. 200లు ఇవ్వడంతో పాటు, ముఖ్యమంత్రి సంజీవరెడ్డికి రూ.1,116 తన వంతు సాయంగా అందించారు. జవహర్‌లాల్ నెహ్రూ, పుచ్చలపల్లి సుందరయ్యను అమితంగా అభిమానిస్తానని పోతురాజు తెలిపారు. పూర్తి శాకాహారైన పోతురాజుకు వార్తాపత్రికల పఠనం, రామకోటి రాయడం, భగవద్గీత చదవటం, తన దగ్గరకు వచ్చిన వారికి ఆనాటి ఉద్యమాలపై వివరించటం దినచర్య.
ఈ వయసులోను ఎంతో చురుగ్గా ఉండే ఆయన కర్ర సాయం లేకుండా నడవగలరు. అనేక సార్లు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి వైద్యం సాయం అందలేదు. మూడేళ్ళ క్రితం ఆయన భార్య మృతి చెందారు. గత రెండు నెలల నుంచి మాత్రమే పింఛన్ ఇస్తున్నారు. తాను చేసిన సేవలకు గాను అప్పటి ప్రభుత్వాలు గుర్తింపు సర్టిఫికెట్లు ఇచ్చాయని, ప్రస్తుతం అవి కనిపించడం లేదని, ఎలాగైనా తనను ఆదుకోవాలని కోరుతున్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే అన్ని రాయితీలను తనకు వర్తింపచేయాలని పోతురాజు విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్రపతికి వివరిస్తా..
పలు ఉద్యమాల్లో విశేష సేవలందించిన నేతల పోతురాజు మా నియోజకవర్గంలో ఉండడం గర్వకారణం. స్వాతంత్య్ర సమరయోధుడికి దక్కే అన్ని రాయితీలు ప్రభుత్వం మానవతాదృక్పథంతో అందించేలా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తా.– కొఠారు అబ్బయ్య చౌదరి,దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కన్వీనర్.
Comments
Please login to add a commentAdd a comment